తృప్తిని మించిన ఆనందం లేదు!
విక్రమపురి రాజ్యానికి చేరాలంటే ఏ దారి గుండా ప్రయాణించినా సరే.. తప్పనిసరిగా తంగేడుగూడెం దాటి వెళ్లాల్సిందే.
విక్రమపురి రాజ్యానికి చేరాలంటే ఏ దారి గుండా ప్రయాణించినా సరే.. తప్పనిసరిగా తంగేడుగూడెం దాటి వెళ్లాల్సిందే. అక్కడ అన్నపూర్ణమ్మ ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఆ గ్రామం మీదుగా వెళ్లే బాటసారులను ఆప్యాయంగా ఆహ్వానిస్తూ, చక్కని రుచులతో భోజనం పెట్టేదామె. వారు ఇచ్చే నామమాత్రపు రుసుముతోనే తన భోజనశాలను నిర్వహించేది. అన్నపూర్ణమ్మ వల్ల తంగేడుగూడెం పేరు విక్రమపురి రాజ్యంలో అందరికీ తెలిసింది.
అన్నపూర్ణమ్మ ఆతిథ్యం మహత్యం అలాంటిది. ఆమె వంట అమృతం వంటిదని తిన్న ప్రతి ఒక్కరూ అనేవారు. ఆమె చక్కని వంటకాల గురించి విక్రమపురి రాజు విజయవర్మకు తెలిసింది. ఒకరోజు మంత్రి గోపాలుడితో.. ‘మంత్రివర్యా! మన రాజ్యంలోని తంగేడుగూడెంలో అన్నపూర్ణమ్మ చాలా చక్కని ఆతిథ్యం ఇస్తుందని తెలిసింది. ఆమె వంటలు అమృతంలా ఉంటాయని చాలాసార్లు విన్నాను. నాకు ఆమె వంటకాలు తినాలని కోరికగా ఉంది. మనం ఒకసారి సాధారణ పౌరుల్లా అక్కడకు వెళ్లి ఆమె వంటకాల రుచి చూద్దాం’ అని అన్నాడు.
‘అలాగే మహారాజా!’ అన్నాడు మంత్రి. ఒకరోజు విజయవర్మ, మంత్రి గోపాలుడు మారువేషంలో తంగేడుగూడెం చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె సాదరంగా ఆహ్వానించింది. వారి యోగక్షేమాలు తెలుసుకొంది. చక్కని వంటకాలతో భోజనం వడ్డించింది. రాజు, మంత్రి తృప్తిగా తిన్నారు.
అన్నపూర్ణమ్మతో రాజు విక్రమవర్మ... ‘అమ్మా! నీ వంట చాలా అద్భుతంగా ఉంది. ఈ తంగేడుగూడెంలో ఉండి, ఇలా దారిలో వెళ్లే బాటసారుల కోసం వండి వడ్డించే బదులు మన రాజుగారి ఆస్థానంలోని వంటశాలలో చేరి చక్కని వేతనంతో రోజూ ఆయనకు విందు భోజనం వండుతూ హాయిగా జీవించవచ్చు కదా!. మీరు ఒప్పుకుంటే అందుకు ఏర్పాట్లు చేయగలను. రాజుగారి ఆస్థానంలో నాకు తెలిసినవారికి చెప్పి మీకు కొలువు ఇప్పిస్తాను’ అని అన్నాడు. మంత్రి గోపాలుడు కూడా రాజుగారి మాటకు వంత పాడాడు.
వారి మాటలు విన్న అన్నపూర్ణమ్మ... ‘అయ్యలారా! మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ తంగేడుగూడెంలో ఉంటూ.. ఇటునుంచి వెళ్లే బాటసారులకు ఆతిథ్యమిస్తూ, వారి ఆకలిని తీర్చడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. నాకు ధనంతో పని లేదు. జీవితంలో తృప్తిని మించిన ఆనందం లేదు. ఆస్థాన వంటశాలలో పనిచేస్తే కేవలం రాజుగారికి, అక్కడి సిబ్బందికి మాత్రమే నేను వండిన ఆహార పదార్థాలు తృప్తినిస్తాయి. కానీ ఇక్కడ ఈ గూడెంలో ఉంటూ వివిధ పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల వారు చాలా ఆనందపడతారు. ఇక్కడ తృప్తిగా భోజనం చేసి, కాసేపు సేదతీరి వెళ్తారు. అందులో కలిగే ఆనందం చెప్పలేనిది’ అంటూ అన్నపూర్ణమ్మ.. రాజు, మంత్రికి జవాబు చెప్పింది.
ఆమె మాటలకు రాజు.. ‘అవునమ్మా! నువ్వు చెప్పింది నిజమే. ఈ దారిగుండా పోయే బాటసారులకు మీ సేవలు అవసరం. ఈ రోజు మీ ఆతిథ్యం స్వీకరించి చాలా తృప్తిగా భోజనం చేశాం. అందుకే మీకు మేలు చేయాలని అనుకున్నాం. మీరు బాటసారులకు మరింత సేవ చేయడానికి వీలుగా రాజాస్థానంలో మాట్లాడి ఇక్కడ మంచి వసతులు ఉన్న భవన నిర్మాణానికి మా చేయూత అందిస్తాం. మా మాటను కాదనకండి’ అని అన్నారు.
అన్నపూర్ణమ్మ చాలా సంతోషించింది. మారువేషాల్లో ఉన్న రాజు, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. మరుసటిరోజే ఆస్థానం నుంచి రాజు సిబ్బందిని పంపి, బాటసారుల వసతికి వీలుగా నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. చకచకా పనులు పూర్తయ్యాయి. భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజు, మంత్రులను చూసి అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. ఆరోజు తన ఆతిథ్యం స్వీకరించిన వాళ్లు రాజు, మంత్రి అని తెలుసుకొంది. రాజుగారితో.. ‘అయ్యా! ఆరోజు మీరు ఆస్థాన వంటశాలలో పని ఇస్తానంటే.. వద్దన్నాను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి’ అని వేడుకుంది.
అప్పుడు రాజుగారు.. ‘నలుగురికి అతిథ్యం ఇచ్చే మీలాంటివారు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే, మీ ఆలోచన తెలుసుకోవాలని ఆరోజు అలా అడిగాను. బాటసారులకు చేతనైన సాయం చేయాలన్న మీ ఆశయం అపూర్వమైంది. అందుకు చేయూతనిస్తూ ఈ భవనం నిర్మించి ఇచ్చా’ అని రాజుగారు అన్నారు.
మొర్రి గోపి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!
-
AP High Court: అమరావతి రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురి అరెస్ట్!
-
colors swathi: విడాకుల వార్తలపై విలేకరి ప్రశ్న.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన ‘కలర్స్’ స్వాతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: 10వేల మంది ఉన్న స్టేడియంలో పోయిన ఫోన్.. కనిపెట్టారిలా..!