నిజమైన స్నేహితుడు!

ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. అది చాలా మంచిది. దాని ఇంటి పక్కనే ఓ తోటను పెంచుతోంది. అందులో ద్రాక్ష, జామ, మామిడి, అరటి తదితర చెట్లు ఉన్నాయి.

Published : 10 Sep 2023 00:31 IST

ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. అది చాలా మంచిది. దాని ఇంటి పక్కనే ఓ తోటను పెంచుతోంది. అందులో ద్రాక్ష, జామ, మామిడి, అరటి తదితర చెట్లు ఉన్నాయి. ప్రతిరోజూ కష్టపడి పాదులు తీసి, ఆ చెట్లకు నీళ్లు పోసేది. దాంతో ఆ తోటలో పండ్లు విరగకాశాయి. తన కష్టానికి ఫలితం దక్కిందని ఎలుగుబంటి సంతోషించింది. ఆ తోటలోని పండ్లను చూసిన ఇతర జంతువులు, కష్టపడకుండానే కడుపు నింపుకోవచ్చనే ఆశతో నెమ్మదిగా దానితో స్నేహం చేయటం మొదలుపెట్టాయి. ఎలుగుబంటి కూడా అన్నింటితో స్నేహంగానే ఉండేది. అలా నక్క, తోడేలు, గద్ద తదితర జంతువులు దానికి బాగా దగ్గరయ్యాయి. అవి ఏదో ఒక వంకతో రోజూ ఎలుగుబంటి ఇంటికి వచ్చి.. కబుర్లు చెప్పి, కడుపునిండా పండ్లు తిని వెళ్లిపోయేవి. ఎలుగుబంటి కూడా తన స్నేహితులకు చక్కటి మర్యాదలు చేసేది.
ఇదంతా ఎదురుగా ఉన్న చింతచెట్టు మీద నివసించే కొంగ గమనించేది. ఒకరోజు కొంగ, ఎలుగుబంటితో ‘మిత్రమా.. ఇంతమంది స్నేహితులున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. కానీ, వీరిలో నీ అసలైన స్నేహితుడెవరు?’ అని అడిగింది. ఎలుగుబంటి ఒక్క క్షణం ఆలోచించి.. ‘అన్నీ నాతో స్నేహంగానే ఉంటాయి’ అని బదులిచ్చింది. సరేనని నవ్వి వెళ్లిపోయిందా కొంగ. ఆ మరుసటి ఏడాది సమయానికి వర్షాలు పడలేదు. దాంతో ఎలుగుబంటి తోటలోని చెట్లు అంతగా కాయలేదు. అదే సమయంలో ఓ పెద్ద చెట్టు మీద నుంచి కిందపడటంతో దాని కాలికి గాయమైంది. ఆహారం కోసం బయటకు కూడా వెళ్లలేకపోయింది. చెట్లకు కాయలు లేకపోవడంతో ఎప్పుడూ వచ్చి వెళ్లే స్నేహితులైన నక్క, ఏనుగు, కోతి, తోడేలు తదితర జంతువులన్నీ దాని ఇంటికి రావటం పూర్తిగా మానేశాయి. కారణం అడిగితే.. ఏదో ఒక పనుందని చెప్పి తప్పించుకునేవి.
ఇదంతా చింతచెట్టు మీద ఉన్న కొంగ గమనిస్తూనే ఉంది. అవన్నీ ఎలుగుబంటి పెంచిన తోటలోని ఫలాల మీద ఆశతోనే దాంతో స్నేహం చేస్తున్నాయని దానికి అర్థమైంది. కానీ, ఆ విషయం చెబితే ఎలుగుబంటి నమ్మదని మౌనంగా ఉండిపోయింది. కొంగ మాత్రం ఏనాడూ ఆ ఫలాలు ఇవ్వమని కోరలేదు. అది ఇస్తేనే, మొహమాటం కొద్దీ తీసుకునేది. ఎలుగు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆహారం కోసం వచ్చివెళ్లేటప్పుడు దాన్ని కచ్చితంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకునేది. దాని నిస్సహాయ స్థితిని చూసి కొంగ బాధపడింది. ఇంతలో ఇంట్లో ఉన్న పదార్థాలూ అయిపోవడంతో ఎలుగుబంటికి ఆకలి ఎక్కువైంది.
అప్పుడు దానికి ఎదురుగా చింతచెట్టు మీద ఉండే కొంగ గుర్తుకొచ్చింది. అతికష్టమ్మీద అక్కడికి వెళ్లింది. ఎలుగుబంటి రాకను గమనించిన కొంగ.. ‘మిత్రమా.. ఎలా ఉంది నీ ఆరోగ్యం?’ అని అడిగింది. ఆ మాటలకు అది కన్నీరు పెడుతూ.. ‘తోట నిండా పండ్లున్నప్పుడు వచ్చిన జంతువులు, ఇప్పుడసలు ముఖం కూడా చూపించడం లేదు. ఆరోగ్యం బాగోలేదని తెలిసినా, ఎవరూ సహాయం చేయడం లేదు’ అంటూ ఏడ్చింది. దాని బాధను చూడలేక.. చెరువు నుంచి తెచ్చుకున్న కొన్ని చేపల్ని అందించింది కొంగ. దూరంగా చెట్టు మీద ఉన్న తేనెపట్టు తీసుకొచ్చి తాగించింది.
దాని గాయం పూర్తిగా మాని, కోలుకునేదాక ఆహారం స్వయంగా తీసుకొచ్చి తినిపించింది. కొద్దిరోజులకు ఎలుగుబంటి కోలుకుంది. మరుసటి ఏడాది వర్షాలు బాగా కురవడంతో దాని తోటలోని చెట్లు బాగా కాశాయి. ‘మిత్రమా.. ఇంతకాలం అడవిలోని జంతువులన్నీ నా స్నేహితులే అనుకున్నాను. మనం బాగా ఉన్నప్పుడు, పిలవకుండానే అందరూ దగ్గరకు వస్తారు. కానీ, ఆపద సమయంలోనూ మనతో ఉండేవారే అసలైన మిత్రులని ఇప్పుడే తెలిసింది. నువ్వే నా అసలైన స్నేహితుడివి’ అని కొంగను దగ్గరకు తీసుకుందా ఎలుగుబంటి.
మహంకాళి స్వాతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని