కాగితం విలువ తెలిసేనా..!

ఆరోజు ఆదివారం కావడంతో బొమ్మలు గీస్తూ కూర్చున్నాడు వంశీ. చాలాసేపటి నుంచి నెమలి బొమ్మ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు వేసినా అస్సలు బాగా రావడంలేదు. దాంతో పేజీలను చించుతూ బొమ్మ గీస్తున్నాడు.

Updated : 29 Nov 2023 04:39 IST

రోజు ఆదివారం కావడంతో బొమ్మలు గీస్తూ కూర్చున్నాడు వంశీ. చాలాసేపటి నుంచి నెమలి బొమ్మ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు వేసినా అస్సలు బాగా రావడంలేదు. దాంతో పేజీలను చించుతూ బొమ్మ గీస్తున్నాడు. అలా వేస్తూవేస్తూ.. ఒక్కసారి తలపైకెత్తి చూశాడు. చుట్టూరా.. తను చించిపడేసిన కాగితాల కుప్ప కనిపించింది. ‘అమ్మో..! అమ్మ వచ్చి ఇదంతా చూసిందంటే.. కోప్పడుతుంది’ అనుకుంటూ, అవన్నీ బ్యాగులో వేసుకున్నాడు. మళ్లీ నెమలి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. అంతలోనే ‘నాన్నా.. వంశీ’ అంటూ వాళ్లమ్మ గొంతు వినిపించింది. మళ్లీ చించిన కాగితాలను కూడా బ్యాగులో వేసి, వస్తున్నానమ్మా.. అంటూ వెళ్లాడు.

మరుసటిరోజు ఉదయాన్నే వంశీ స్కూల్‌కి వెళ్లాడు. ‘రేపు మీకు చేతిరాత పోటీ ఉంది. ఎవరైతే తప్పులు, కొట్టివేతలు లేకుండా చక్కగా రాస్తారో వాళ్లకి బహుమతి ఉంటుంది. అందరూ బాగా సాధన చేయండి’ అని చెప్పారు తెలుగు టీచర్‌. ఇవన్నీ కాకుండా, ఎంచక్కా కాగితంతో పడవలు చేసే పోటీ పెడితే ఎంత బాగుండో. నాకే మొదటి బహుమతి వచ్చేది’ అని మనసులోనే అనుకున్నాడు. అంతలోనే బడి గంట మోగింది. ఇంటికి వెళ్లి కాళ్లూచేతులు శుభ్రంగా కడుక్కొని, ఇక పుస్తకాలు తీసుకొని రాయడం ప్రారంభించాడు. ఎంత ప్రయత్నించినా అక్షరాలు సరిగ్గా రావడంలేదు. మళ్లీ కాగితాలు చించుతూ రాస్తున్నాడు. ఇంతలోనే వాళ్లమ్మ వచ్చింది. అక్కడున్న కాగితాలను చూసి ‘వంశీ ఏంటి.. కాగితాలన్నీ అలా వృథా చేస్తున్నావు?’ అని అడిగింది. ‘రేపు స్కూల్లో చేతిరాత పోటీలు ఉన్నాయమ్మా. దానికోసమే సాధన చేస్తున్నా’ బదులిచ్చాడు వంశీ. ఎంత సాధన చేసినా.. ఇలా కాగితాలన్నీ చించడం మంచి పద్ధతి కాదు. ఇక అవి చించడం ఆపి చదువుకో’ అనడంతో అమ్మ చెప్పినట్లు కాసేపు చదువుకొని నిద్రపోయాడు వంశీ.

ఇక ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లాడతను. మొదటి పీరియడ్‌లో సోషల్‌ టీచర్‌ రాలేదు. ఎవరూ మాట్లాడకుండా చూడమని హెడ్‌మాస్టర్‌ క్లాస్‌ లీడర్‌కి చెప్పారు. పిల్లలంతా ఇక అల్లరి చేయడం మొదలుపెట్టారు. వంశీ తన నోట్‌బుక్‌ చించి, రాకెట్లు చేసి క్లాస్‌లో విసరసాగాడు. అలా చేయొద్దని స్నేహితులు చెప్పినా, నా దగ్గర ఇంకా చాలా నోట్‌బుక్స్‌ ఉన్నాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడతను. పైగా మిగతా పిల్లలకు కూడా రాకెట్లు చేయమని చెబుతున్నాడు. దాంతో ఆ క్లాస్‌ లీడర్‌ నేను మీ ఇద్దరి పేర్లు టీచర్‌కు చెబుతానన్నాడు. ‘ప్లీజ్‌ చెప్పొద్దు. కావాలంటే నీకు చాక్లెట్‌ ఇస్తాను’ అని ఆశపెట్టాడు వంశీ. ఇష్టమున్నా కాస్త బెట్టు చేస్తూ.. ‘సరేలే, వెంటనే ఈ కాగితాలన్నీ తీసి చెత్తబుట్టలో వేయండి. టీచర్‌ వస్తే, మీతోపాటు నన్ను కూడా కోప్పడతారు. రేపు చాక్లెట్‌ మాత్రం తప్పకుండా తీసుకురా.. మర్చిపోవద్దు’ అన్నాడతను. అందరూ గబగబా కాగితాలన్నీ తీసి చెత్తబుట్టలో వేశారు.

ఇంతలోనే రెండో పీరియడ్‌ గంట మోగింది. సైన్స్‌ టీచర్‌ క్లాస్‌లోకి వస్తూనే.. నిండుగా ఉన్న చెత్త బుట్టను చూశారు. ‘పిల్లలూ..! మీరంతా రోజూ నోట్‌బుక్స్‌లో రాస్తుంటారు కదా?’ అని ప్రశ్నించారు. ‘అవును టీచర్‌’ అని బదులిచ్చారు విద్యార్థులంతా. ‘కాగితాలు ఎలా తయారుచేస్తారో తెలుసా?’ అని అడిగారామె. తెలియదని అడ్డంగా తలూపారందరూ. ‘చెట్ల నుంచి వచ్చే కలప గుజ్జుతో కాగితం తయారుచేస్తారు. ఒక టన్ను నాణ్యమైన కాగితాల తయారీ కోసం, చాలా చెట్లు నరికేయాల్సి వస్తుంది. దాని వల్ల మన అవసరాలు తీరుతున్నా.. పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకే వీలైనంత పొదుపుగా కాగితాలను వాడుకోవాలి’ అన్నారు టీచర్‌. ‘చెట్ల నుంచి వచ్చే గుజ్జుతో కాకుండా వేరే పదార్థాలతో కాగితాలను తయారుచేయలేమా టీచర్‌?’ అని అడిగింది అపర్ణ. ‘దానికి సంబంధించిన పరిశోధనలు కూడా మొదలయ్యాయి. ఈ కంప్యూటర్లు, టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి కాగితాలను ఉపయోగించడం కాస్త తగ్గింది. అలా కొంతవరకైనా చెట్లను రక్షించగలుగుతున్నాం’ అని బదులిచ్చారు టీచర్‌. విద్యార్థులంతా.. ‘ఇక నుంచి కాగితాలను పొదుపుగా ఉపయోగిస్తాం టీచర్‌’ అని మాటిచ్చారు. ఇంటికి వెళ్లాక వంశీ క్లాస్‌లో జరిగిన విషయమంతా వాళ్లమ్మకు వివరించాడు. పెద్దయ్యాక కలపతో కాకుండా వేరే పద్ధతుల్లో కాగితాలను కనుగొనే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. వంశీలో వచ్చిన మార్పును చూసి ఆమె చాలా సంతోషించింది.

జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని