Updated : 08 Dec 2021 17:19 IST

నాకొక నక్షత్రం కావాలి!

అంతరిక్షం గురించి పెద్ద పెద్ద వాళ్లకే అవగాహన ఉండదు. అలాంటిది ఓ చిన్నారి అతి చిన్న వయసులో ఖగోళ శాస్త్రవేత్త అయిపోయింది. ఏంటి.. ఆశ్చర్యంగా ఉందా? అసలెలా సాధ్యమయింది. ఆ చిన్నారి ఎవరు? తెలుసుకుందామా!

బ్రెజిల్‌కు చెందిన నికోల్‌ ఒలివెరా వయసు ఎనిమిదేళ్లు. ఈ వయసుకే ప్రపంచంలోనే అతి చిన్న ఖగోళ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ సెమినార్‌లకు హాజరవుతోంది. నాసా అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ళీవి 1997దీ అనే సూపర్నోవా ఆవిష్కరణలో పాల్గొన్న బ్రెజిల్‌ ఖగోళ శాస్త్రవేత్త దుయిలియా డి మెల్లో వంటి ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా తీసుకుంటుంది.

ఎలా సాధ్యం?

విషయమేంటంటే.. ఆస్టరాయిడ్స్‌ హంటర్స్‌ అనే ప్రాజెక్ట్‌ ద్వారా విద్యార్థులకు సొంత అంతరిక్ష ఆవిష్కరణలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. బ్రెజిల్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో నాసాకు అనుబంధంగా ఉన్న సిటిజన్‌ సైన్స్‌ ప్రోగ్రాం అయిన ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ సెర్చ్‌ సహకారం ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ పోటీలకు అర్హత సాధించింది నికోల్‌.

పుట్టినరోజు కానుకగా...

నికోల్‌ నడక నేర్చుకున్నప్పుడే నక్షత్రాలను చేరుకోవడానికి చేతులు పైకెత్తేదట. ‘నాకొక నక్షత్రం కావాలి ఇవ్వు’ అంటూ వాళ్లమ్మ దగ్గర మారాం చేసేదట. చిన్న పిల్ల కదా సరదాగా అడిగుంటుంది అనుకునేవారు అమ్మానాన్న. తర్వాత నాలుగేళ్ల వయసులో పుట్టినరోజు కానుకగా టెలిస్కోప్‌ అడిగింది. తనకు ఖగోళశాస్త్రం మీద ఇష్టం ఉందని అమ్మానాన్నలకు అప్పుడర్థమైంది.

తన గది నిండా..

తర్వాత తన ఇష్టం మేరకు ఖగోళశాస్త్రంలో కోర్సు చేయించారు. దానికి సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నికోల్‌కు చెప్పేవారు. అలా ఖగోళశాస్త్రం మీద పూర్తి అవగాహన ఏర్పరుచుకుంది. అన్నట్టు తన గది నిండా సౌరవ్యవస్థ, సూక్ష్మ రాకెట్లు, స్టార్‌ వార్‌ బొమ్మల పోస్టర్లే ఎక్కువుంటాయి. ఇక అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంట్లోనే రెండు పెద్ద కంప్యూటర్‌ తెరలను నికోల్‌ కోసమే ఏర్పాటు చేయించారు. అలా ఆస్టరాయిడ్స్‌ హంటర్స్‌ ప్రాజెక్టు గురించి తెలుసుకుని నాసా సంస్థ వాళ్లతో మాట్లాడించారు.

భవిష్యత్తులో...

అప్పట్నుంచి ఈ ప్రాజెక్టుకోసం పనిచేస్తూ ఇప్పటికే 18 గ్రహ శకలాలను కనుక్కుంది. దీంతో ప్రపంచంలో అతి పిన్న ఖగోళ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకుంది. భవిష్యత్తులో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ అవ్వాలనుకుంటున్నా అని, రాకెట్లను నిర్మించాలనుకుంటున్నాననీ ధీమాగా చెబుతోంది. మరి నికోల్‌ అనుకున్నది సాధించాలని కోరుకుంటూ తనకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు