మేము సైతం బుడతా భక్తిగా..!

వారంతా బుజ్జి బుజ్జి బుజ్జాయిలు.. వాళ్లు చెప్పే చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు రికార్డవుతున్నాయి.. అలా అని అవేమీ కాలక్షేపం కబుర్లు కాదు.. కాలగర్భంలో కలిసిపోతున్న సంస్కృతిని.. కలిసికట్టుగా ఓ

Published : 29 Dec 2021 00:06 IST

వారంతా బుజ్జి బుజ్జి బుజ్జాయిలు.. వాళ్లు చెప్పే చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు రికార్డవుతున్నాయి.. అలా అని అవేమీ కాలక్షేపం కబుర్లు కాదు.. కాలగర్భంలో కలిసిపోతున్న సంస్కృతిని.. కలిసికట్టుగా ఓ జట్టుగా తమ గళంతో కాపాడుతున్న వైనం!

చిన్ని చిన్ని పాటలు.. చిట్టి చిట్టి కథల్లోనే... చాలా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు దాగి ఉంటాయి. చాలా వరకు గిరిజన భాషలకు లిపి ఉండదు. అందుకే ఇవి ఎక్కడా లిఖిత రూపంలో ఉండవు. కేవలం మాటలు, పాటల రూపంలోనే మనుగడ సాగిస్తున్నాయి. అదే ఇప్పుడు వారికి శాపంగా మారుతోంది. పాత తరాల జ్ఞాపకాలు పదిలంగా నేటి తరాలకు చేరడం లేదు. ఇందుకోసం కొంతమంది చిట్టి బుడతలు నడుం బిగించారు. పాలబుగ్గల పసి పిల్లలు.. ముద్దు ముద్దు మాటలతో కథలు చెబుతున్నారు. అవి ఇప్పుడు రికార్డవుతున్నాయి. కేవలం రికార్డవడమే కాదు.. అమెరికన్‌ తమిళ్‌ రేడియోలో ఆన్‌లైన్‌ వేదికగా ప్రసారమవుతున్నాయి. విశేష ఆదరణ కూడా పొందుతున్నాయి.

తమిళనాడు వ్యాప్తంగా..

కోయంబత్తూరు, అమెరికాకు చెందిన కొందరు వాలంటీర్లు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజన తెగల మాండలీకాల మీద డాక్యుమెంట్‌ చేసేపనిలో ఉన్నారు. జానపద కథల్ని వీళ్లు గిరిజన పిల్లలతోనే రికార్డు చేయిస్తున్నారు. వాటిని వాళ్లు ‘అమెరికన్‌ తమిళ్‌ రేడియో’లో ప్రసారమూ చేయిస్తున్నారు. ఇలా ఈ వాలంటీర్ల బృందం తమిళనాడు వ్యాప్తంగా 68 మంది కథకులను (స్టోరీటెల్లర్స్‌ను) తయారు చేసింది.

జట్టుగా.. కలిసికట్టుగా!

మొత్తం 36 గిరిజన తెగల నుంచి 68 మంది పిల్లలను వాలంటీర్లు ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో వాళ్లను భాగస్వాములను చేశారు. ఓ సంవత్సర కాలంగా వాళ్లు కథలను రికార్డు చేసే పనిలో ఉన్నారు. అలాగే ఆ పిల్లలు తమ గిరిజన భాషలోని కథలను తమిళ లిపిలో రాస్తున్నారు. ఇది ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకొంతమంది పిల్లలైతే సొంతంగా కథలూ రాస్తున్నారు. అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్‌లో ఈ కథలకు చక్కటి ఆదరణ దక్కుతోంది. మొత్తానికి ఈ బుజ్జాయిలు గొప్ప పనిలో బుడతాభక్తిగా తమవంతు తోడ్పాటు అందించడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని