అన్నింటా ముందుంటా!

సెలవులిచ్చేశారు కదా! ఏం చేస్తున్నారు? ఏముంది.. అమ్మమ్మ వాళ్ల ఊరెళతాం.. లేదా ఎంచక్కా స్నేహితులతో ఆడుకుంటాం అంటారా! కానీ ఈ నేస్తం మాత్రం ఎప్పుడు సెలవులు ఇచ్చినా అస్సలు వృథా చేయడు. ఆ సమయంలో తన ప్రతిభను వెలికి తీసి..

Updated : 09 Jan 2022 01:03 IST

సెలవులిచ్చేశారు కదా! ఏం చేస్తున్నారు? ఏముంది.. అమ్మమ్మ వాళ్ల ఊరెళతాం.. లేదా ఎంచక్కా స్నేహితులతో ఆడుకుంటాం అంటారా! కానీ ఈ నేస్తం మాత్రం ఎప్పుడు సెలవులు ఇచ్చినా అస్సలు వృథా చేయడు. ఆ సమయంలో తన ప్రతిభను వెలికి తీసి.. ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేనా రికార్డులూ సాధిస్తున్నాడు. ఇంతకీ ఎవరా నేస్తం? తెలుసుకునేందుకు చదివేయండి..

న పేరు ఆకిన భువనేశ్వర్‌ చక్రి సాయికుమార్‌. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్నలు సౌజన్య, మణి ప్రసాద్‌. ఉండేది విజయవాడలో.

నాన్నమ్మ, తాతయ్యల ప్రోత్సాహం

భువనేశ్వర్‌ చిన్నప్పట్నుంచీ చురుకే! ఖాళీ దొరికితే చాలు ఏదో ఒక కొత్త వస్తువు తయారు చేస్తుంటాడు. మామూలుగా కొంతమంది చిన్నారులు ఫోన్‌ ఇవ్వగానే ఎక్కువ శాతం వీడియో గేమ్స్‌ ఆడేందుకు చూస్తారు. కానీ భువనేశ్వర్‌ అలా కాదు. ఫోన్‌లో క్రాఫ్ట్స్‌ ఎలా తయారు చేస్తారు? పెయింటింగ్స్‌ వేయడమెలా? ఇలాంటి వీడియోలు చూసి, తయారు చేస్తుంటాడట. దీని వెనక నాన్నమ్మ తాతయ్యల ప్రోత్సాహం ఎంతగానో ఉందంటాడు. వాళ్లే తనకు అన్నీ చెప్పేవారట.

మ్యాజిక్‌లో ప్రతిభ..!

లాక్‌డౌన్‌ సమయంలో తన ప్రతిభకు పదును పెట్టి 109 క్రాఫ్ట్‌లు తయారుచేసేశాడు. అవి చూసి అందరూ మెచ్చుకున్నారు. ఓఎమ్‌జీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో కూడా స్థానం సంపాదించేశాడు. వీటితో పాటు బోలెడు పతకాలు, బహుమతులూ పొందాడు. అన్నట్టు.. భువనేశ్వర్‌ మ్యాజిక్‌ కూడా చేస్తాడు. అమ్మకు సాయపడుతూ వంట కూడా చేస్తాడట. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో పాల్గొని బోలెడన్ని ప్రశంసపత్రాలు కూడా అందుకున్నాడు. అంతేనా శ్రీ సత్యసాయిబాబా బాల వికాస్‌ సంస్థలో చేరి వేదం కూడా నేర్చుకున్నాడు. చూశారుగా నేస్తాలూ! మన నేస్తం అన్నింటిలో ముందు ఉంటూ ఎంత చక్కగా పేరు తెచ్చుకుంటున్నాడో. మరింకేం.. నేస్తానికి మీరూ అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని