ఇది.. పిల్లలు కనిపెట్టిన పొట్టి నది!

‘ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది?’ అని మనల్ని ఎవరైనా అడిగితే.. మనలో చాలామంది టక్కున ‘నైలు’ నది అని చెబుతారు. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోకెల్లా అతి పొట్టి నది ఏదో?.. ఏంటి అలా ఆలోచిస్తున్నారు?

Published : 11 Feb 2022 00:50 IST

‘ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది?’ అని మనల్ని ఎవరైనా అడిగితే.. మనలో చాలామంది టక్కున ‘నైలు’ నది అని చెబుతారు. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోకెల్లా అతి పొట్టి నది ఏదో?.. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? తెలియదు కదూ! ఫర్లేదులే ఇప్పుడు తెలుసుకుందాం.. సరేనా!

రో నది.. ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత పొట్టి నది. దీని పేరిట గిన్నీస్‌బుక్‌లో రికార్డు కూడా ఉంది. ఈ నది ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’లో ఉంది. ఇది 201 అడుగులు అంటే కేవలం 61 మీటర్ల ప్రవహిస్తుంది అంతే. ఇంతకు ముందు మాత్రం ఈ రికార్డు అమెరికాలోనే ఉన్న ‘డి రివర్‌’ పేరిట ఉండేది.

ఎక్కడ పుట్టింది అంటే...

ఈ రో నది జెయింట్‌ స్ప్రింగ్స్‌లో పుట్టి మిస్సోరి నదిలో కలుస్తుంది. ఈ మిస్సోరి నది మాత్రం ఉత్తర అమెరికాలోనే అత్యంత పొడవైనది. రో నది లోతు కూడా చాలా తక్కువ. కేవలం 6 నుంచి 8 అడుగులు ఉంటుందంతే!

పిల్లలే పేరు పెట్టారు!

ఈ రో నదికి పేరు ఎవరు.. ఎప్పుడు.. పెట్టారో తెలుసా? దీనికి 1987 ప్రాంతంలో గ్రేట్‌ఫాల్‌లోని లింకన్‌ ఎలిమెంటరీ స్కూల్లో అప్పట్లో అయిదోతరగతి చదివే పిల్లలు రో నది అని పేరు పెట్టారు. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారి దృష్టికి కూడా తమ టీచర్‌ సాయంతో వాళ్లే తీసుకెళ్లారు. వీళ్లు ముందు నదికి రో అనే పేరు పెట్టాలని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ బోర్డ్‌ ఆన్‌ జియోగ్రాఫిక్‌ నేమ్స్‌’లో పిటీషన్‌ వేశారు. ఆ సంస్థ వీళ్ల పిటీషన్‌ను ఒప్పుకుంది. నదికి రో అనే పేరు ఖరారు చేసింది. ఇంకేముంది ఈ పిల్లలు గిన్నీస్‌ తలుపు తట్టారు. వాళ్లూ ఈ నదికి ప్రపంచంలో అత్యంత పొట్టి నదిగా గుర్తింపు ఇచ్చేశారు. ఎంతైనా బాలవాక్కు, బ్రహ్మవాక్కు ఒక్కటే కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని