Published : 10 Mar 2022 00:19 IST

ఈ రోబో.. బ్యాక్టీరియా పాలిట యమరాజు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘సైన్స్‌ డే’ సందర్భంగా బడిలో మనం వివిధ ప్రాజెక్టులు చేస్తుంటాం కదా! అయితే, ఓ నేస్తం మాత్రం అందరిలా కాకుండా కొంత విభిన్నంగా ఆలోచించాడు. ఆటలాడే వయసులోనే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణ చేశాడు. ఆ నేస్తం వివరాలేంటో, ఆ ప్రాజెక్టు ఏంటో తెలుసుకుందాం..

పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన హర్సిర్జన్‌కు పన్నెండేళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఈ నేస్తానికి చిన్నప్పటి నుంచే రోబోలన్నా, రోబోటిక్స్‌ అన్నా ఎంతో ఇష్టమట. అదే ఆసక్తితో ప్రత్యేకంగా క్లాసులకూ వెళ్తున్నాడట. అయితే, ఇటీవల పాఠశాలలో ఇచ్చిన ఓ ప్రాజెక్టులో భాగంగా ఓ రోబోను తయారు చేసి ఔరా అనిపించాడు.

రూ.15 వేల ఖర్చుతో..

‘రోబోనే కదా?’ అని తేలిగ్గా తీసుకోకండి ఫ్రెండ్స్‌. అలాంటిలాంటిది కాదనీ.. అతినీలలోహిత (అల్ట్రావయొలెట్‌-యూవీ) కిరణాలతో పనిచేస్తుందనీ చెబుతున్నాడీ కుర్రాడు. ఈ యూవీ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు.. చుట్టూ 1.5 మీటర్ల వరకూ గాలిలో ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తాయట. ఈ పరికరం పైభాగంలో 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరానూ ఏర్పాటు చేశాడు. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో ఆపరేట్‌ చేయవచ్చు.

పేటెంట్‌కు ప్రయత్నం

ఈ రోబో తయారు చేసేందుకు రూ.15 వేలు ఖర్చయిందని చెబుతున్నాడు హర్సిర్జన్‌. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇటువంటి రోబోలను ఇళ్లతోపాటు ఆసుపత్రుల్లోనూ వినియోగించవచ్చట. బ్యాటరీల ఆధారంగా పనిచేసే ఈ పరికరానికి ‘యూవీ-21’ అని పేరు పెట్టాడు. గతేడాది డిసెంబర్‌లో మొదలు పెట్టి.. రెండు నెలల్లో పూర్తి చేసిన ఈ రోబో ప్రాజెక్టుకు.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటుదక్కింది. ప్రస్తుతం తన రోబోకు పేటెంట్‌ పొందే ప్రయత్నంలో ఉన్నాడు మన హర్సిర్జన్‌. తమ కుమారుడి ప్రతిభ చూసి.. తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతున్నారట. రోబో పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించాక, మరిన్ని మార్పులు చేర్పులు చేశాక.. మార్కెట్లోకి విడుదల చేస్తానని చెబుతున్నాడీ బుల్లి శాస్త్రవేత్త. ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు