Updated : 13 Mar 2022 03:10 IST

పేదరికాన్ని ఓడించి.. ఆటలో సాధించి..!

హలో ఫ్రెండ్స్‌.. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తోంది ఓ నేస్తం. నిరంతర సాధనతోనే అద్భుతాలు సాధ్యమనేందుకూ ఉదాహరణగా నిలుస్తోంది. చిన్నతనం నుంచే తనకిష్టమైన బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకుంటూ.. బోలెడు పతకాలు సాధిస్తోంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఇటీవల అంతర్జాతీయ పోటీలకూ అర్హత సాధించింది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి మరి! 

నేస్తం ఎవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఎం.అమృతలక్ష్మి. వయసు 13 ఏళ్లు. ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నాన్న శివ.. ఫర్నిచర్‌ దుకాణంలో రోజువారి కూలీ. అమ్మ సత్యవతి గృహిణి. తండ్రి సంపాదనతోనే ఆ కుటుంబం జీవిస్తోంది. అమృతకు చిన్నతనం నుంచి బాక్సింగ్‌, కరాటే తదితర ఆత్మరక్షణ విద్యలంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తిని గమనించిన తండ్రి.. ఆర్థిక ఇబ్బందులున్నా కూతురిని నేర్చుకోవాలని ప్రోత్సహించారు. బాలిక పేదరికాన్ని అర్థం చేసుకున్న కోచ్‌ రామకృష్ణ ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఆటకు కావాల్సిన పరికరాలనూ ఆయనే సమకూరుస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయికి..

పదేళ్ల వయసులో కరాటేతో తన శిక్షణను ప్రారంభించింది అమృత. మండల, జిల్లాస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించింది. రెండేళ్లుగా బాక్సింగ్‌ పోటీలకూ హాజరవుతోంది. 2021లో విశాఖపట్నంలో యూత్‌ గేమ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. అదే సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. గతేడాది నవంబర్‌లో కర్నూలులో వైఎస్‌డీఏ (యూత్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం గెలిచిన అమృత.. గోవాలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. అక్కడా స్వర్ణంతో మెరిసింది. దీంతో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న అండర్‌-14 అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత పొందింది.

చదువుకుంటూనే.. 

కేవలం శిక్షణ, పోటీలే కాకుండా చదువునూ సమన్వయం చేసుకుంటోంది అమృత. ఉదయం 5-8 గంటల వరకూ సాధన చేశాక.. పాఠశాలకు వెళ్తుంది. సాయంత్రం వచ్చాక 6-8 గంటల వరకూ మళ్లీ సాధన చేస్తుంది. ఇలా రోజుకు 5 గంటలు సాధనకు పోగా.. మిగిలిన సమయాన్ని మాత్రం కచ్చితంగా చదువుకే కేటాయిస్తోంది. ‘నిత్యం క్రీడా సాధనతో ఏకాగ్రత పెరుగుతోంది. అది పరీక్షల సమయంలోనూ ఉపయోగపడుతోంది. ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలనేది నా లక్ష్యం’ అని చెబుతోంది అమృత. మనమూ.. ఈ నేస్తానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దాం మరి! 

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని