తండ్రి దుకాణానికి.. కొడుకే బ్రాండ్‌ అంబాసిడర్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది సోషల్‌ మీడియాలో స్నేహితులతో ఆడుకున్నవో, కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినవో ఫొటోలూ, వీడియోలతోపాటు సరదా అంశాలనూ షేర్‌ చేస్తుంటాం కదూ!

Updated : 20 Apr 2022 00:54 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది సోషల్‌ మీడియాలో స్నేహితులతో ఆడుకున్నవో, కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినవో ఫొటోలూ, వీడియోలతోపాటు సరదా అంశాలనూ షేర్‌ చేస్తుంటాం కదూ! కానీ, ఓ నేస్తం మాత్రం విభిన్నంగా ఆలోచించడమే కాకుండా తండ్రి వ్యాపారానికి అండగానూ నిలుస్తున్నాడు. ఆ వివరాలేంటో చదివేయండి మరి.

పవిత్ర రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో హలీమ్‌ హడావిడి మామూలుగా ఉండదు. ఎప్పుడూ ఉండే రెస్టరంట్లతోపాటు గల్లీ గల్లీలోనూ దుకాణాలు వెలుస్తుంటాయి. జిగేల్‌మనిపించే విద్యుత్తు వెలుగుల్లో హలీమ్‌, ఇతర ప్రత్యేక పదార్థాలూ నోరూరిస్తుంటాయి. ఇంత పోటీలోనూ ఓ చిన్న ఐస్‌క్రీమ్‌ బండిలా కనిపించే వాహనం పైన అమ్మే హలీమ్‌ దగ్గరకు ప్రజలు వరస కడుతున్నారు. దీనంతటికీ కారణం అద్నాన్‌ అనే ఓ బాలుడు.

సోషల్‌ మీడియా వేదికగా...

తన తండ్రి హలీమ్‌ వ్యాపారానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బోరబండకు చెందిన మొహమ్మద్‌ అద్నాన్‌ సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం వైరల్‌గా మారింది. రంజాన్‌ నేపథ్యంలో ఈ బాలుడి తండ్రి తమ ఇంటికి సమీపంలోనే ఓ హలీమ్‌ దుకాణం ప్రారంభించారు. తన తండ్రికి సహాయం చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పప్పా కీ హలీమ్‌’ పేరిట ప్రత్యేకంగా అకౌంట్‌ను క్రియేట్‌ చేసి, నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు అద్నాన్‌. న్యూస్‌ రిపోర్టింగ్‌ తరహాలో నాన్న పడుతున్న కష్టాన్ని వివరిస్తూ.. వారి దుకాణం లొకేషన్‌తోపాటు మెనూ, ఇతర అంశాలపైనా చెబుతూ.. వీడియోలు పోస్టు చేస్తున్నాడు.

ప్రశంసలు అందుకుంటూ..

సోషల్‌ మీడియాను మార్కెటింగ్‌ వేదికగా మలుచుకున్న ఈ నేస్తం తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యాడు. కేవలం దుకాణం ప్రారంభించిన రెండు రోజుల్లోనే విపరీతమైన క్రేజ్‌ సంపాదించాడు. ఈ చిన్నోడి నిజాయతీకి, కుటుంబం పట్ల ఉన్న బాధ్యతకూ ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వివిధ ఫుడ్‌ బ్లాగర్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లూ, చిన్నపాటి సెలబ్రిటీలూ అద్నాన్‌ను అభినందించడంతోపాటు గిరాకీ పెంచేందుకు తమవంతు సాయమూ అందిస్తున్నారు. అలా ఈ నేస్తం ఇప్పుడు ‘పప్పా కీ హలీమ్‌’కి బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రమే కాదూ.. మనలాంటి పిల్లలకు స్ఫూర్తిగానూ నిలుస్తున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు