Updated : 12 May 2022 00:16 IST

తనూజ్‌.. అనే నేను!

ప్రకృతి అంటే ప్రాణం.. పర్యావరణం అంటే ఇష్టం.. సేవాకార్యక్రమాలంటే ఆసక్తి.. మొక్కల సంరక్షణ వ్యాపకం.. ఇవన్నీ తనూజ్‌కు నిత్యకృత్యం. వీటికి తగిన గుర్తింపు దక్కింది. తర్వాత ఏమైంది? ఇంతకీ తనూజ్‌ ఎవరు? దక్కిన గుర్తింపు ఏంటి? తెలుసుకోవాలని ఉందా?...

దివి తనూజ్‌ చౌదరి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణానికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూష దంపతుల కుమారుడు. తండ్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటున్నారు. తనూజ్‌ ప్రస్తుతం అక్కడే ప్లస్‌వన్‌ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అమ్మానాన్న ప్రోత్సహించారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల నిర్వహణ, మారథాన్‌, క్యాన్సర్‌ ఫౌండేషన్‌కు, సామాజిక సమస్యల పరిష్కారానికి నిధులు సేకరించి, నిర్వాహకులకు అందించడంలో పాలుపంచుకున్నాడు. కొన్నేళ్లుగా తాను చదువుతున్న పాఠశాలలో తోటి విద్యార్థుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. ‘సోషల్‌ జస్టిస్‌ లీడర్‌’గా ఎన్నికయ్యాడు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటాడు.

ఎంపీగా ఎంపిక!
మన తనూజ్‌ ఈ మధ్యే ఎంపీగానూ ఎంపికయ్యాడు. ఎంపీ అంటే నిజంగా ఎంపీ కాదనుకోండి... ఆస్ట్రేలియాలో యూత్‌ పార్లమెంట్‌ అని ఒక వ్యవస్థ ఉంటుంది. ఇందులో టెన్త్‌, ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ చదివే విద్యార్థులే ఎంపీలుగా ఉంటారు. వీరిని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. ఈ యూత్‌ పార్లమెంట్‌కు సంబంధించి గత ఏడాది వరకు దిగువ సభ ఉండేది. ఈ ఏడాది నుంచి కొత్తగా ఎగువసభ (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) ఏర్పాటు చేశారు. అందులో మొత్తం 80 మంది సభ్యులు ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు, పాఠశాలలో నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. యువ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేస్తారు. మొత్తం పది వేల మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 80 మందిని ఎంపిక చేశారు. అందులో తనూజ్‌.. ‘ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌, క్లైమెట్‌ ఛేంజ్‌’ అంశాలకు సంబంధించి యూత్‌ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యాడు.

ప్రతిపక్షంలోకి...
మన తనూజ్‌ కేవలం ఎంపీ మాత్రమే కాదు.. షాడో మంత్రి కూడా..! విషయం ఏంటంటే.. ఎగువసభకు ఎంపికైన 80 మందిని రెండు భాగాలుగా చేసి 40 మందిని అధికార పక్షం, 40 మందిని ప్రతిపక్షంగా విభజిస్తారు. అధికార పక్షం నుంచి తొమ్మిది మందిని మంత్రులుగా, ప్రతిపక్షం నుంచి 9 మందిని షాడో మంత్రులుగా ఎంపిక చేస్తారు. ఇద్దరికీ సమాన అధికారాలు ఉంటాయి. సభ్యుల ఆసక్తిని బట్టి.. ఏ విభాగంలోకి అయినా వెళ్లే అవకాశం కల్పిస్తారు. తనూజ్‌ ప్రతిపక్షంలోకి వెళ్లాడు. అక్కడ ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖలకు షాడో మంత్రిగా నియమితులయ్యాడు. తన గళాన్ని అక్కడి పార్లమెంట్‌లో వినిపించబోతున్నాడు.

ప్రకృతి పరిరక్షణే లక్ష్యం...
‘మరో పదేళ్లలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించనున్నాయి. ప్రకృతిని ఇష్టారీతిన నాశనం చేస్తే పెద్ద విలయమే వస్తుంది. సౌర, పవన తదితర పద్ధతుల్లో విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి. ప్రభుత్వం, తోటి యువ ఎంపీలతో కలిసి సహజ సిద్ధంగా ఉండేలా ప్రకృతిని కాపాడుకునేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని తనూజ్‌ ‘హాయ్‌బుజ్జీ’తో చెబుతున్నాడు. అన్నట్లు మన తనూజ్‌ ప్లాస్టిక్‌ సీసాలను కూడా తన ఇంట్లోనే రీ సైక్లింగ్‌ కూడా చేస్తున్నాడట. ఎంతైనా గ్రేట్‌ కదూ!

- నలమోతు సురేంద్ర, న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts