పిట్టకొంచెం... జ్ఞాపకశక్తి ఘనం!

వయసు 14 నెలలు.. మాటలే సరిగా రాని వయసు... అడుగులూ తడబడే వయసు కానీ ఏకంగా ఓ రికార్డే కొల్లగొట్టేశాడు.. ‘గూగుల్‌ బాయ్‌’గానూ పేరు సంపాదించాడు మరి ఆ బుడతడు ఎవరు? సాధించిన ఘనతేంటో తెలుసుకుందామా!

Updated : 02 Jun 2022 01:08 IST

వయసు 14 నెలలు.. మాటలే సరిగా రాని వయసు... అడుగులూ తడబడే వయసు కానీ ఏకంగా ఓ రికార్డే కొల్లగొట్టేశాడు.. ‘గూగుల్‌ బాయ్‌’గానూ పేరు సంపాదించాడు మరి ఆ బుడతడు ఎవరు? సాధించిన ఘనతేంటో తెలుసుకుందామా!

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన సంజయ్‌, శివాని మిశ్రా దంపతుల కుమారుడు యశస్వి మిశ్రా. వయసు 14 నెలలు మాత్రమే. కానీ అప్పుడే అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 26 దేశాల జాతీయ జెండాలను గుర్తించి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదు చేసుకున్నాడు ఈ బుడతడు. దీంతో దేశంలోనే అత్యంత చిన్నవయసులో ‘గూగుల్‌ బాయ్‌’గా యశస్వి గుర్తింపు పొందాడు. అంతకు ముందు మనదేశం తరఫున ఈ రికార్డు కౌటిల్య పేరిట ఉండేది. ఆ చిన్నారి 4 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించాడు. దాన్ని ఇప్పుడు యశస్వి తిరగరాశాడు.

అమ్మానాన్న చేయూతతో...

ఆరు, ఏడు నెలల వయసు నుంచే యశస్వికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. తండ్రి సంజయ్‌, తల్లి శివాని మిశ్రా.. యశస్వికి పూలను చూపించి వాటిని గుర్తు పట్టమనేవారు. ఆ చిన్నారి ఒక్కసారికే గుర్తుపెట్టుకుని చెప్పేవాడు. అత్యంత చిన్న వయసులోనే తమ పిల్లాడి ప్రతిభను చూసిన తల్లిదండ్రులు, యశస్వికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు 194 దేశాల జాతీయ పతాకాలను గుర్తించి సరికొత్త రికార్డు సృష్టించేందుకు యశస్వికి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ బుడతడు భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని