పసిప్రాయం.. పసిడి ఖాయం!

చిట్టి చేతులు గట్టిగానే తపిస్తున్నాయి... పంచ్‌లతో పతకాల పంట పండిస్తున్నాయి.. పట్టు పడితే పసిడి ఖాయం... రెప్పవాల్చేలోగా ఫిరంగిలా పంచ్‌ల వర్షం కురిపించడం ఈ బుజ్జి బుడతడి నైజం...ఇంతకీ ఈ కరాటే చిన్నారి ఎవరంటే..

Published : 12 Jun 2022 03:16 IST

చిట్టి చేతులు గట్టిగానే తపిస్తున్నాయి... పంచ్‌లతో పతకాల పంట పండిస్తున్నాయి.. పట్టు పడితే పసిడి ఖాయం... రెప్పవాల్చేలోగా ఫిరంగిలా పంచ్‌ల వర్షం కురిపించడం ఈ బుజ్జి బుడతడి నైజం...
ఇంతకీ ఈ కరాటే చిన్నారి ఎవరంటే..

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన 13 సంవత్సరాల మద్దుల అక్షయే ఆ కరాటే కిడ్‌. రామచంద్రాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి సురేష్‌, తల్లి మహాలక్ష్మి అయిదేళ్ల నుంచి అక్షయ్‌కు కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఈ చిన్నారి కరాటేపై పూర్తి దృష్టి సారించాడు. పోటీల్లో ప్రత్యర్థి తనకంటే బలవంతుడైనా, తనతో సమానమైనవాడైనా అదరక బెదరక చిరుతలా దూసుకుపోవటం అక్షయ్‌ ప్రత్యేకత.

పతకాల వేట

అక్షయ్‌ మూడేళ్ల నుంచి కరాటే పోటీల్లో పాల్గొంటున్నాడు. 2019లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 2020లో విశాఖపట్నంలో జరిగిన సౌత్‌ ఇండియా కరాటే టోర్నమెంట్‌లోనూ బంగారు పతకం సాధించి అబ్బుర పరిచాడు. 2021లో రాజమహేంద్రవరంలో జరిగిన స్టేట్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పసిడి పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. 2022 మే 7వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం గెలిచాడు. ఈ ఏడాది మొత్తం 3 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రెండు పసిడి, ఒక కాంస్య పతకాన్ని పొందాడు. ఇప్పటి వరకూ అన్నీ కలిపి 15 వరకు పతకాలు సాధించాడు.

పోలీస్‌ అవ్వాలని...

అక్షయ్‌కు చిన్నతనం నుంచి పోలీస్‌ ఉద్యోగం సాధించాలన్నది ఆశయం. కరాటే ద్వారా ఆ లక్ష్యం చేరేందుకు అవసరం అయిన దేహదారుఢ్యాన్ని, చురుకుతనాన్ని సాధిస్తున్నాడు. కరాటే మాత్రమే కాకుండా, తైక్వాండో, బాక్సింగ్‌, స్కేటింగ్‌ కూడా నేర్చుకుంటున్నాడు. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాడు. రోజూ ఉదయం 5 గంటలకే మేల్కొని పరుగు, వ్యాయామం చేసి అనంతరం కరాటే సాధన చేస్తున్నాడు. సాయంత్రం కూడా కసరత్తులు మానడు. పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌, మొలకెత్తిన విత్తనాలు, పండ్ల రసాలు తన ఆహారంలో భాగంగా చేసుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఈ నేస్తం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- ఉప్పాల రాజాపృథ్వి, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని