పట్టు పట్టింది.. పతకం సాధించింది!

నేస్తాలూ.. ఓ అక్క బాక్సింగ్‌లో పతకం సాధించింది. ‘ఆ.. ఇందులో గొప్పేం ఉంది. చాలా మంది సాధిస్తున్నారుగా?’ అని మీరు అనొచ్చు. కానీ ఆ అక్క బాక్సింగ్‌లో కేవలం 45 రోజుల శిక్షణ

Published : 10 Aug 2022 00:21 IST

నేస్తాలూ.. ఓ అక్క బాక్సింగ్‌లో పతకం సాధించింది. ‘ఆ.. ఇందులో గొప్పేం ఉంది. చాలా మంది సాధిస్తున్నారుగా?’ అని మీరు అనొచ్చు. కానీ ఆ అక్క బాక్సింగ్‌లో కేవలం 45 రోజుల శిక్షణ మాత్రమే తీసుకుని, పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మరి మనం ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

కేరళలోని కల్పెట్టకు చెందిన అవంతికా సజీవ్‌ వయసు 15 సంవత్సరాలు. ఇటీవల కొజికోడ్‌లో జరిగిన స్టేట్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తన సత్తా చాటింది. కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అవంతికాకు ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 73 శాతం మార్కులే వచ్చాయి. దీంతో తను చాలా బాధ పడింది. కానీ తనిప్పుడు బాక్సింగ్‌లో పతకం సాధించి ఆనందపడుతోంది.

రోజూ 80 కిలోమీటర్ల ప్రయాణం...
అవంతికా ప్రతి రోజూ 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మనంతవడిలోని వయనాడ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు చేరుకునేది. అక్కడ ఏబీసీ బాక్సింగ్‌ అకాడమీలో బాక్సింగ్‌లో శిక్షణ పొందేది. మిగిలిన సమయమంతా టీవీలో బాక్సింగ్‌ పోటీలు చూసేది. అసలు రోజంతా తన ధ్యాస బాక్సింగ్‌ మీదే ఉంచేది.

బంధువులు వద్దన్నా...
‘ఆడ పిల్లలకు బాక్సింగ్‌.. చాలా ప్రమాదకరమైన క్రీడ.. వెంటనే తనను మానిపించండి’ అని చాలా మంది బంధువులు అడ్డుచెబుతూ నిరుత్సాహ పరిచారు. కానీ అవంతికా మాత్రం వెనకడుగు వేయలేదు. తన పూర్తి శక్తి, సామర్థ్యాలకు బాక్సింగ్‌ నేర్చుకోవడానికే వెచ్చించింది.

కోచ్‌ మెచ్చిన శిష్యురాలు...
నిజానికి కేవలం 45 రోజుల శిక్షణతో పోటీల్లో పాల్గొనే అవకాశం ఎవరికీ దక్కదు. కానీ కోచ్‌ దీపేష్‌ మాత్రం అవంతికాలో ఉన్న ప్రతిభను గుర్తించారు. బాక్సింగ్‌ మీద తనకున్న అంకితభావానికి ముగ్ధుడయ్యారు. అందుకే కోజికోడ్‌లో జరిగిన స్టేట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఆమె పాల్గొనేలా ప్రోత్సహించారు. అవంతికా కూడా కోచ్‌ తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

అనుభవం లేకున్నా...
బాక్సింగ్‌కు కొత్త అయినప్పటికీ... తనకంటే అనుభవజ్ఞుల మీద విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. నిజానికి బాక్సింగ్‌కంటే ముందు అవంతికా ఫుట్‌బాల్‌ నేర్చుకోవాలనుకుంది. స్థానిక క్లబ్‌లో సభ్యత్వం  కూడా తీసుకుంది.. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఫుట్‌బాల్‌ నేర్చుకోలేకపోయింది. ఆ ఖాళీ సమయంలో తన సోదరుడితో కలిసి బాక్సింగ్‌కు సంబంధించిన హాలీవుడ్‌ సినిమాలు చూసేది. వాటి స్ఫూర్తితో బాక్సింగ్‌లో చేరి, 45 రోజుల్లోనే కాంస్య పతకం గెలుచుకుంది. ఎంతైనా మన అవంతికా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని