చిట్టి చేతులు నూలు వడుకుతున్నాయి!

నేటి బాలలే రేపటి పౌరులు. ఆ చిట్టి చేతులే ఇప్పుడు నూలు వడకడం నేర్చుకుంటున్నాయి. మరి వాళ్లు ఎందుకు నేర్చుకుంటున్నారు. వాళ్లకు ఎవరు శిక్షణ ఇస్తున్నారో తెలుసుకుందామా!

Published : 12 Aug 2022 00:21 IST

నేటి బాలలే రేపటి పౌరులు. ఆ చిట్టి చేతులే ఇప్పుడు నూలు వడకడం నేర్చుకుంటున్నాయి. మరి వాళ్లు ఎందుకు నేర్చుకుంటున్నారు. వాళ్లకు ఎవరు శిక్షణ ఇస్తున్నారో తెలుసుకుందామా!

కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌ నగరంలో బాలబలగ అనే పాఠశాల ఉంది. అక్కడ పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నూలువడకడం, ఖాదీ నేయడంలో మెలకువలు చెబుతున్నారు. ప్రకృతి, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఎలా జీవించాలో తెలిపే క్రమంలో ఆ పాఠశాల నిర్వాహకులు ఇదంతా చేస్తున్నారు.

నూలు వడుకుతూ..
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ముందుగా రాట్నంపై నూలు వడకడం నేర్పిస్తున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పాఠాలు ముగిసిన తర్వాత రోజూ ఓ గంట వరకు నూలు వడకడంలో శిక్షణ ఇస్తున్నారు.

పత్తి నుంచి సంపత్తి!
ముందుగా పత్తి నుంచి గింజల్ని వేరు చేస్తున్నారు. తర్వాత పత్తిని శుభ్రం చేస్తున్నారు. తర్వాత స్పిన్నింగ్‌ చేసి బండెల్స్‌ను ఖాదీ తయారీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇలా పత్తి నుంచి సంపత్తిని సృష్టిస్తున్నారు. నూలు తయారీకి కావాల్సిన పత్తిని స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వారికీ ఉపాధి అందిస్తున్నారు.

నైపుణ్యాల వృద్ధి...
‘వేరు వేరు కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు.. రైతులు, నేత కార్మికులు, వడ్రంగులు, కమ్మరి, కుమ్మరి.. ఇలా పలు వృత్తి కార్మికులతో మమేకమవుతున్నారు. దీనివల్ల పిల్లలకు చదువుతో పాటు, వృత్తి నైపుణ్యాలూ అబ్బుతున్నాయి’ అంటున్నారు ఈ పాఠశాల నిర్వాహకుల్లో ఒకరైన సంజీవ్‌ కులకర్ణి.

శిక్షణలోనే క్రమశిక్షణ...
నూలు వడకటంలో శిక్షణ.. పిల్లల్లో క్రమశిక్షణనూ, నేర్పునూ నేర్పుతోంది. పద్మాసన భంగిమలో కూర్చుని పనిలో నిమగ్నమవడం విద్యార్థులకు ఫిజికల్‌ యాక్టివిటీగానూ పనికి వస్తోంది. అదే సమయంలో పిల్లలు ఇదంతా చేయడాన్ని గర్వంగా భావిస్తున్నారట.

భౌతిక, గణిత, జీవ శాస్త్రాల్లోనూ...
‘నూలు వడకటం వల్ల పిల్లలు భౌతిక, గణిత, జీవ శాస్త్రాలతో మమేకమవుతున్నారు. చరఖాతో పనిచేయడంలో భౌతిక శాస్త్రం, పత్తిని సేకరించడంలో జీవశాస్త్రం, రైతులకు డబ్బులు చెల్లించడంలో అంతర్లీనంగా గణితం దాగి ఉన్నాయి’ అంటున్నారు పాఠశాలకు చెందిన మరో నిర్వాహకురాలు ప్రతిభ కులకర్ణి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని