చిన్నోడు.. పట్టు వదల్లేదు!

హలో ఫ్రెండ్స్‌.. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏం చేశాం మనం.. టీచర్‌ జెండా వందనం చేయగానే.. జాతీయ గీతం పాడాం.. తరవాత చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే ఎంచక్కా తిని ఉంటాం.

Updated : 27 Aug 2022 06:31 IST

హలో ఫ్రెండ్స్‌.. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏం చేశాం మనం.. టీచర్‌ జెండా వందనం చేయగానే.. జాతీయ గీతం పాడాం.. తరవాత చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తే ఎంచక్కా తిని ఉంటాం. కానీ, ఓ నేస్తం మాత్రం వినూత్నంగా డ్రోన్‌తో జెండా ఎగరవేశాడు. అదీ స్కూల్‌లో.. అందరి ముందూ.. ఆ వివరాలేంటో చదివేయండి మరి..

కేరళ రాష్ట్రంలోని అలప్పుజకు చెందిన మహమూద్‌ ఇన్సాఫ్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ బాలుడు సొంతంగా తయారు చేసిన డ్రోన్‌ సహాయంతోనే జెండాను ఎగురవేశారు.

బొమ్మ తెచ్చిన మార్పు
ఇన్సాఫ్‌కు చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్‌ పరికరాలంటే చాలా ఆసక్తి. వాళ్ల నాన్న ఏ బొమ్మ కొనిచ్చినా.. అందులో ఏ పరికరాలున్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? తదితర వివరాలను తెలుసుకునేవాడు. అలా ఒకసారి వాళ్ల నాన్న చైనా నుంచి ఓ చిన్న డ్రోన్‌ను తీసుకొచ్చారు. అది మన ఇన్సాఫ్‌కు చాలా బాగా నచ్చింది. అలాంటిదే తానూ ఒకటి సొంతంగా తయారు చేయాలని అప్పుడే అనుకున్నాడు.

మూడుసార్లు విఫలమైనా..
డ్రోన్‌ తయారీకి సంబంధించి యూట్యూబ్‌లో బోలెడు వీడియాలు చూశాడు. ప్లాస్టిక్‌ బాటిళ్ల మూతలూ, పాత సీడీలూ, పెన్ను రీఫిళ్లు, అల్యూమినియం సామగ్రి ఇలా అన్నింటినీ సమకూర్చుకున్నాడు. మార్కెట్‌ నుంచి డ్రోన్‌ని నియంత్రించే పరికరాలు, ట్రాన్స్‌మిటర్లు, ఓటీజీ రిసీవర్లు, ఇతర పరికరాలు తెచ్చుకున్నాడు. వాటన్నింటితో మొదటిసారి డ్రోన్‌ తయారీకి ప్రయత్నించాడు.. కానీ, విఫలమయ్యాడు.

మళ్లీ రెండోసారి ప్రయత్నించాడు.. మళ్లీ ఫెయిలయ్యాడు. అయినా నిరుత్సాహపడలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మూడోసారి ప్రయత్నించాడు.. అయినా, తయారు చేయలేకపోయాడు. నాలుగోసారి మరింత పట్టుదలతో కృషి చేశాడు. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్నట్లు.. ఈసారి విజయవంతంగా డ్రోన్‌ని తయారు చేశాడు ఇన్సాఫ్‌. సెల్‌ఫోన్‌తోనే నియంత్రించే సౌలభ్యం ఉన్న దాని తయారీకి మొత్తం రూ.10 వేలు ఖర్చయిందట. అందులో రూ.6500 నాన్న ఇచ్చినవి. మిగతా రూ.3500 తన సోదరి కిడ్డీ బ్యాంకులో దాచుకున్నవట.

ఉపాధ్యాయులే అడిగి మరీ..
మన ఇన్సాఫ్‌ డ్రోన్‌ తయారు చేశాడని తెలుసుకున్న స్కూల్‌ టీచర్లు ఎంతో ఆశ్చర్యపోయారట. అంతేకాదు.. ఆ డ్రోన్‌ సహాయంతో ఆగస్టు 15న జెండాను ఎగరవేయాలని కోరారట. బాలుడు కూడా సరేననడంతో.. టీచర్లంతా చూస్తుండగా, విద్యార్థులంతా చప్పట్లు కొడుతుండగా విజయవంతంగా జెండాను ఎగరవేశాడు. నిజంగా ఈ నేస్తం చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని