Updated : 29 Aug 2022 06:34 IST

గులాబ్‌జామూనంత శాటిలైట్‌!

శాటిలైట్‌... అనగానే వెంటనే పే...ద్ద ఆకారం, రెక్కల్లా విచ్చుకున్న సోలార్‌ ప్యానెళ్లు మనకు గుర్తుకు వస్తాయి. కానీ మీకు గులాబ్‌జామూన్‌ అంత శాటిలైట్‌ గురించి తెలుసా. ఇది ప్రపంచంలోనే అతిచిన్న కృత్రిమ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. దీన్ని తయారు చేసింది.. ఎవరో విదేశీయులు కాదు.. మన భారతీయులే. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా.

ఈ బుజ్జి శాటిలైట్‌ బరువు కేవలం 64 గ్రాములు. పొడవేమో 3.8 సెంటీమీటర్లు. దీని పేరు కలాంశాట్‌. దీన్ని తమిళనాడుకు చెందిన యువ సైంటిస్టులు రూపొందించారు. ఇందులో రిఫత్‌ అనే అన్నయ్య ప్రముఖ పాత్ర పోషించాడు. ఆన్‌లైన్‌లో పోటీ వివరాలు చూసి... వాళ్ల బృందంతో కలిసి ఈ శాటిలైట్‌ను తయారు చేశారు. దీన్ని నాసా వాళ్లు 2017లో ప్రయోగించారు. అప్పుడు వాళ్లు పంపిన శాటిలైట్లలో ఇదొక్కటే భారతదేశానికి చెందినది.

పిట్టకొంచెం.. గట్టిదనం ఘనం!
చూడ్డానికి చిన్న శాటిలైటే అయినప్పటికీ ఇది చాలా గట్టిది. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకునేలా దీన్ని చాలా దృఢంగా తయారు చేశారు. చాలా సార్లు దీని గట్టితనాన్ని పరీక్షించారు. అతిశీతల, అతి వేడి పరిస్థితులను తట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ పరీక్షలన్నీ ఇంట్లోనే చేయడం మరో విశేషం. చివరికి అంతరిక్షంలోకి ప్రయోగించారు. రాకెట్‌ ప్రయాణ సమయం 240 నిమిషాలు అయితే... 125 నిమిషాలప్పుడు ఈ బుజ్జి శాటిలైట్‌ రాకెట్‌ నుంచి విడుదలైంది. మైక్రో గ్రావిటీ వాతావరణంలో కొన్ని నిమిషాల పాటు ఉంది. తర్వాత ఇది సముద్రంలో పడిపోయింది.

డీ కోడింగ్‌ కోసం..
సముద్రంలో పడిపోయిన ఈ బుజ్జి శాటిలైట్‌ను నాసా వాళ్లు వదల్లేదు. దాన్ని కనిపెట్టి తిరిగి చెన్నైకే పంపారు. ఎందుకో తెలుసా... ఇది అంతరిక్షంలో సేకరించిన సమాచారం తెలుసుకోవాలంటే డీ కోడింగ్‌ చేయాలి కదా...! దీన్ని తయారు చేసిన విద్యార్థుల బృందమే దీన్ని డీ కోడ్‌ చేసి.. ఆ సమాచారాన్ని నాసాతో పంచుకుంది. నేస్తాలూ.. ఇవీ గులాబ్‌జామూన్‌ అంత శాటిలైట్‌ విశేషాలు. మొత్తానికి భలే ఉంది కదూ!


హోం మేడ్‌ శాటిలైట్‌...

నిజానికి కలాంశాట్‌ను ఏ ప్రయోగశాలలోనూ తయారు చేయలేదు. తమిళనాడులోని టీనగర్‌లోనే ఓ ఇంట్లో తయారు చేశారు. దీన్ని త్రీడీ టెక్నాలజీలో రెయిన్‌ఫోర్స్‌డ్‌ కార్బన్‌ ఫైబర్‌ పాలిమర్‌తో అచ్చేశారు. మీకు మరో విషయం తెలుసా.. త్రీడీ టెక్నాలజీతో తయారైన మొట్టమొదటి శాటిలైట్‌ కూడా ఇదే. అలాగే పరిశోధనలో భాగంగా ఇందులో కొన్ని విత్తనాలనూ ఉంచారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని