Updated : 29 Sep 2022 06:31 IST

అద్భుత ప్రతిభ.. అవార్డుల వరస!

సొంతంగా ఓ యాప్‌ రూపొందించాడు.. జెండాలు చూసి దేశాల పేర్లు చెప్పగలడు.. జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు..   తొమ్మిది నెలల్లోనే ఆరు అవార్డులు అందుకున్నాడు.. అద్భుత మేధస్సుతో అందరితో ‘శెభాష్‌’ అనిపించుకుంటున్నాడు.. ఈ ఘనతలన్నీ ఓ తొమ్మిదేళ్ల బాలుడివి.. ఇంతకీ ఆ నేస్తం ఎవరో తెలుసుకుందామా..!

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని హోమస్‌పేటకు చెందిన అద్దంకి నిరంతక్‌ కృష్ణ ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేస్తం ఇప్పటికే సొంతంగా ఓ యాప్‌ తయారు చేసి ప్లేస్టోర్‌లో ఉంచాడు. అంతేకాదు.. తన జ్ఞాపకశక్తితో, గత జనవరి నుంచి ఇప్పటివరకూ ఆరు పురస్కారాలను సొంతం చేసుకున్నాడు.

సమయం సద్వినియోగం..

లాక్‌డౌన్‌లో అన్నీ మూతబడటంతో అందరిలాగే మన కృష్ణ కూడా ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయాన్ని వృథాగా గడిపేయకుండా, సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. బాగా ఆలోచించాక.. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ నేర్చుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. తన ఆలోచనను తల్లిదండ్రులు బాలకృష్ణ ప్రసాద్‌, జాహ్నవిలకు చెప్పడంతో వారూ సరేనని ప్రోత్సహించారు. అక్క గోవర్ధిని సహకారంతో యూట్యూబ్‌లో కోడింగ్‌కు సంబంధించిన వీడియోలు చూడటం ప్రారంభించాడు. కోడింగ్‌పైన మరింత పట్టు అవసరమని భావించిన తల్లిదండ్రులు.. ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తరవాత నెల రోజుల పాటు కష్టపడిన ఈ నేస్తం.. 2020 జనవరిలో ‘లెర్న్‌ అబౌట్‌ అవర్‌ వరల్డ్‌’ పేరుతో ప్రత్యేక యాప్‌ను తయారు చేశాడు. అది అందరికీ ఉపయోగపడాలని ప్లేస్టోర్‌లో కూడా ఉంచాడు. ఈ యాప్‌లో వివిధ దేశాల్లోని రాష్ట్రాలు, వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఖండాలు తదితర సమాచారాన్ని పొందుపరిచాడు. 

ఒకటీ రెండూ కాదు..

నిరంతక్‌ కృష్ణకు చిన్నప్పటి నుంచే జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒకసారి ఏదైనా చూసినా, విన్నా.. ఆ విషయాన్ని చాలారోజుల పాటు గుర్తుంచుకునేవాడు. టీవీ, యూట్యూబ్‌ చూసి ప్రపంచంలోని వివిధ దేశాల విశేషాలను అధ్యయనం చేయసాగాడు. అలా కేవలం 105 సెకన్ల వ్యవధిలో జాతీయ జెండాలను చూసి ఏకంగా 202 దేశాల పేర్లను టకటకా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ మొత్తం ఆరు అవార్డులు సాధించాడు. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, స్టార్‌ కిడ్‌ అచీవర్‌, ఇండియన్‌ ప్రైమ్‌ ఐకాన్‌, విజన్‌-27, సూపర్‌ ట్యాలెంటెడ్‌ ఇంటర్నేషనల్‌ కిడ్స్‌, వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను దక్కించుకున్నాడు. తక్కువ సమయంలోనే ఇన్ని పురస్కారాలను అందుకోవడంతో బాలుడి తల్లిదండ్రులు తెగ సంబరపడిపోతున్నారు. 

లక్ష్యమూ ఉన్నతమే.. 

ఇప్పటికే ఓ యాప్‌ను తయారు చేసిన కృష్ణ.. ఇప్పుడు గేమింగ్‌కు సంబంధించిన మరో యాప్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు. రోబోటిక్స్‌ అంశంపైన నెల రోజుల నుంచి ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకుంటున్న ఈ నేస్తం.. సాంకేతికతతో ప్రజా సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. 

- బుక్కపట్నం మధుసూదన్‌, న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు విద్యావిభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts