పిట్ట కొంచెం.. ఆట ఘనం!

ఇటీవల ప్యూర్టోరికో దేశంలో ప్రిడేటర్‌ ప్రపంచ జూనియర్‌ 9 బాల్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. దీనిలో 46 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో అండర్‌-17 అమ్మాయిల విభాగంలో ఒక బాలిక మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 27 Nov 2022 00:57 IST

ఇటీవల ప్యూర్టోరికో దేశంలో ప్రిడేటర్‌ ప్రపంచ జూనియర్‌ 9 బాల్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. దీనిలో 46 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో అండర్‌-17 అమ్మాయిల విభాగంలో ఒక బాలిక మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొమ్మిదేళ్లకే టోర్నీలో పాల్గొని.. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. చేతిలో ఉన్న క్యూ స్టిక్‌ పొడవు కంటే కూడా చిన్నగా ఉన్న బుడత.. ఆటలో మాత్రం భలే ఆకట్టుకుంది. ఆ చిచ్చర పిడుగు పేరు తన్వి వల్లెం. అమెరికాలో ఉంటున్న ఈ హైదరాబాద్‌ బాలిక క్యూ స్పోర్ట్స్‌లో దూసుకెళ్తోంది. మరి ఈ చిన్నారి సంగతులేంటో తెలుసుకుందామా..!

ఈ ఏడాది వేసవిలోనే తన్వి క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్‌, స్నూకర్‌, పూల్‌, 9 బాల్‌ తదితర క్రీడలు) ప్రయాణం మొదలైంది. బిలియర్డ్స్‌ టేబుల్‌పై ఇష్టాన్ని పెంచుకోవడానికి ప్రధాన కారణం నాన్న వీరేశ్‌. అమెరికాలోని మేరీల్యాండ్‌లో వీళ్ల కుటుంబం నివాసముంటోంది. సరదాగా ఆడుకోవడం కోసం వీరేశ్‌ పూల్‌ టేబుల్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. నాన్నతో ఆడడం మొదలెట్టిన తన్వి ఆటపై ఆసక్తి పెంచుకుంది. తండ్రి దగ్గరే ఓనమాలు నేర్చుకుంది. ఆటపై చిన్నారికున్న ఇష్టం చూసిన తండ్రి.. బిలియర్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ కింద శిక్షణ ఇస్తున్న రాయ్‌ దగ్గర చేర్పించాడు. అక్కడి నుంచి చిన్నారి క్రమంగా ఆటపై పట్టు సాధించింది. స్టిక్‌ను పట్టుకోవడం, బంతిని గురి చూసి కొట్టడం తదితర విషయాల్లో మెరుగు పరుచుకుంటోంది.

ప్రత్యేక ఆహ్వానం...

గత నెలలో ఎస్‌వీబీ జూనియర్‌ ఓపెన్‌లో తన్వి పోటీపడింది. చిన్నారికి ఇవే తొలి పోటీలు. దీంట్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో ఈ నెల 18 నుంచి 21 వరకు ప్యూర్టోరికోలో జరిగిన ప్రిడేటర్‌ ప్రపంచ జూనియర్‌ 9 బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు భారత బిలియర్డ్స్‌, స్నూకర్‌ సమాఖ్య ద్వారా ప్రపంచ పూల్‌ బిలియర్డ్స్‌ సంఘం ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ పోటీల్లో భారత్‌ నుంచి జూనియర్‌ బాలికల విభాగంలో పోటీపడ్డ ఏకైక క్రీడాకారిణి ఈ చిన్నారే. తొలి రౌండ్లో 2021 ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ రన్నరప్‌ కిమ్‌ (కొరియా)తో తలపడింది. గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. రెండో రౌండ్లోనూ బలమైన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ఓటములు ఎదురైనా చిన్నారి ప్రదర్శన మాత్రం ప్రశంసలు అందుకుంది.

ఓ బుజ్జి ఆల్‌రౌండర్‌..

తన్వి కేవలం క్యూ స్పోర్ట్స్‌లోనే కాకుండా.. కూచిపూడిలోనూ రాణిస్తోంది. తైక్వాండోలోనూ శిక్షణ పొందుతోంది. పెన్సిల్‌తో చక్కగా బొమ్మలూ గీస్తోంది. 2015లో ఉద్యోగరీత్యా వీళ్ల కుటుంబం అమెరికా వలస వెళ్లింది. తల్లిదండ్రులు వీరేశ్‌, రేణుక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం తన్వి అక్కడ మూడో గ్రేడ్‌ చదువుతోంది. ‘ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం మంచి అనుభూతి. ఈ అనుభవం నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. రాయ్‌ రూపంలో నాకు సరైన కోచ్‌ దొరికారు. పాఠశాలలోనూ క్యూ స్పోర్ట్స్‌ను భాగం చేయడం నాకు కలిసొచ్చింది. ఉత్తమ ప్రదర్శనతో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తా’ అని ఈ చిన్నారి ధీమాగా చెబుతోంది. మరి మనమూ తన్వికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.!

- శనిగారపు చందు, ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని