సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పించాడు!

హలో ఫ్రెండ్స్‌.. సాయంత్రం స్కూల్‌ నుంచి బస్సులో ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు స్నేహితులతో కలిసి బాగా అల్లరి చేస్తుంటాం కదూ!

Updated : 02 May 2023 06:11 IST

హలో ఫ్రెండ్స్‌.. సాయంత్రం స్కూల్‌ నుంచి బస్సులో ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు స్నేహితులతో కలిసి బాగా అల్లరి చేస్తుంటాం కదూ! ఆ సమయంలో బస్సు చెడిపోయినా, ఇంకేదైనా అనుకోని సంఘటన జరిగినా అయ్యో అనుకొని పరిస్థితులు చక్కబడే వరకూ ఎదురుచూస్తుంటాం. కానీ, ఓ నేస్తం మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించాడు... శెభాష్‌ అనిపించుకున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మెరికాలోని మిచిగాన్‌లో ఇటీవల స్కూల్‌ ముగిసిన తర్వాత రోజూలాగే పిల్లలను ఎక్కించుకొని ఓ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో.. ఆ డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయితే, ఆ ప్రమాదాన్ని మధ్య వరసల్లో కూర్చున్న రీవ్స్‌ అనే ఏడో తరగతి బాలుడు గమనించాడు. వెంటనే డ్రైవర్‌ క్యాబిన్‌లోకి వచ్చి, పెను ప్రమాదం జరగకుండా అందర్నీ కాపాడాడు.

స్టీరింగ్‌ తిప్పుతూ, బ్రేక్‌ వేసి..  

ఆ స్కూల్‌ బస్సులో మొత్తం 66 మంది పిల్లలు ఉన్నారట. వారంతా అల్లరి చేస్తూ ఎప్పటిలాగే ఇంటికి బయలుదేరారు. డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి రావడంతో.. గబగబా ఆ క్యాబిన్‌లోకి పరుగెత్తుకొచ్చిన రీవ్స్‌కు మొదట ఏం చేయాలో అర్థం కాలేదట. ఒక్క క్షణం ఆలోచించి.. బ్రేక్‌ వేయడంతోపాటు స్టీరింగ్‌ను తిప్పుతూ బస్సును రోడ్డు పక్కన ఆగేలా చూశాడు. ఓవైపు బస్సును సురక్షితంగా నిలిపే ప్రయత్నం చేస్తూనే.. ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేయమని లోపలున్న స్నేహితులకు చెప్పాడట. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకొని, డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించడంతోపాటు పిల్లలను వేరే వాహనంలో వాళ్ల ఇంటికి పంపించారు.

స్కూల్‌లో సన్మానం

పెద్ద ప్రమాదం నుంచి పిల్లలను సురక్షితంగా కాపాడిన విషయాన్ని, ఆ బాలుడు చదివే స్కూల్‌ యాజమాన్యం సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేయడంతో ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు.. విద్యార్థుల తల్లిదండ్రులను, ప్రముఖులను పిలిచి మరీ ఆ పాఠశాల ఉపాధ్యాయులు రీవ్స్‌ను ఘనంగా సన్మానించారు. అంతమంది పిల్లలను కాపాడిన ఈ నేస్తం సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని అందరూ ఎంతో మెచ్చుకున్నారట. నేస్తాలూ.. మనం కూడా ఆపద సమయాల్లో భయపడిపోకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరిద్దాం.. సరేనా.!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని