పాటతో మెప్పించాడు..!

హాయ్‌ నేస్తాలూ..!  ‘ఇంతకీ మీరు పాటలు వింటారా? పాడగలరా?’ అని ఎవరైనా అంటే.. ప్రతి ఒక్కరికి పాటలతో కచ్చితంగా అనుబంధం ఉంటుంది.

Updated : 03 Feb 2024 00:09 IST

హాయ్‌ నేస్తాలూ..!  ‘ఇంతకీ మీరు పాటలు వింటారా? పాడగలరా?’ అని ఎవరైనా అంటే.. ప్రతి ఒక్కరికి పాటలతో కచ్చితంగా అనుబంధం ఉంటుంది. చిన్నప్పుడైతే అమ్మ పాట వింటేగానీ.. నిద్రపోయేవాళ్లం కాదు..’ అని సమాధానం చెబుతాం అంతే కదా..! కానీ ఓ బుడతడు మాత్రం అమ్మ పాట వినే వయసు నుంచే.. వేదికల మీద పాటలు పాడటం ప్రారంభించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మెరికాకు చెందిన మాటియో లోపెజ్‌కు తొమ్మిది సంవత్సరాలు. ఈ చిన్నారి తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే.. పాటలు పాడటం మొదలుపెట్టాడట. అంతే కాదు నేస్తాలూ.. ‘యంగెస్ట్‌ మరియాచి సింగర్‌’గా కూడా రికార్డు సాధించాడు. తన ప్రతిభతో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం పొందాడు. అంతా బాగానే ఉంది కానీ.. మరియాచి సింగర్‌ అంటే ఏంటి? అని ఆలోచిస్తున్నారా..! ఒక మ్యూజిక్‌ బృందం అని అర్థం పిల్లలూ. అలాంటి ఒక బృందంలోనే మన మాటియో కూడా ఉన్నాడన్నమాట.

కొత్త మ్యూజిక్‌..

మన మాటియో పాటలు పాడటమే కాకుండా.. మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరిన కొద్దిరోజులకే కొత్త కొత్త మ్యూజిక్‌ ట్యూన్‌లు కూడా కనిపెట్టాడట. ఇంకా తను గిటార్‌, పియానో కూడా చాలా చక్కగా ప్లే చేస్తాడట. ఇంకో విషయం ఏంటంటే.. తనకు యాక్టింగ్‌ అంటే కూడా చాలా ఇష్టమట. ‘తను వారంలో ఒక్కోరోజు ఒక్కో తరగతికి వెళ్తాడు. ప్రయాణం చేస్తున్నా కూడా పాటలు పాడుతూనే ఉంటాడు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో స్టేజ్‌ పెర్ఫామెన్స్‌లు ఇచ్చాడు’ అని వాళ్ల అమ్మానాన్నలు చెబుతున్నారు. ‘మొదటిసారి మా అక్క మరియాచిలో వయోలిన్‌ ప్లే చేస్తూ.. పాట పాడుతుంటే చూశాను. అప్పటి నుంచి నాకు కూడా అలా పాడాలని ఉండేది. నేను పాట పాడేటప్పుడు నాతో పాటుగా.. ప్రేక్షకులను కూడా పాడించడం. వాళ్లలో జోష్‌ నింపడం అంటే నాకు చాలా ఇష్టం’ అని చెబుతున్నాడు ఈ చిన్నారి. ఎంతైనా మాటియో చాలా గ్రేట్‌ కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు