మృగరాజు మారిందోచ్‌!

చిత్రగ్రీవ అడవికి సారంగం అనే సింహం రాజుగా ఉండేది. మంత్రిగా శయనం అనే నక్క వ్యవహరించేది. రాజు సారంగానిది అవునంటే.. కాదనే మనస్తత్వం. శయనం నిజం చెప్పినా సారంగం వినేది కాదు.

Published : 31 Mar 2023 00:54 IST

చిత్రగ్రీవ అడవికి సారంగం అనే సింహం రాజుగా ఉండేది. మంత్రిగా శయనం అనే నక్క వ్యవహరించేది. రాజు సారంగానిది అవునంటే.. కాదనే మనస్తత్వం. శయనం నిజం చెప్పినా సారంగం వినేది కాదు. దాంతో ఇక రాజుకు చెప్పి లాభం లేదు. ఆయన దారిలో తనూ పోవాల్సిందే అనుకుంది శయనం.

శయనం మంత్రి కనుక రాజైన సారంగం వదిలిన మాంసం దానికి దక్కేది. దాంతో శయనం రోజువారీ జీవనానికి ఆటంకం కలిగేది కాదు. అడవిలో జంతువులకు సారంగం అంటే భయం పట్టుకుంది. అనవసరంగా దాని ముందుకు వెళ్లి దెబ్బలు తినడం దండగ అనుకున్నాయి. అందుకే రాజైన దానికి కనిపించకుండా తిరిగేవి.

ఎప్పుడన్నా ఇక తప్పక న్యాయం చెప్పమని సారంగం దగ్గరకు వెళితే మంచివాళ్లను శిక్షించి చెడ్డవాళ్లకు రక్షణ ఇచ్చేది అది. దాంతో జంతువులకు రాజు అంటే గౌరవం పోయింది. ఒకరోజు ఏనుగు, రాజు లేని సమయంలో శయనాన్ని కలిసింది.

‘మంత్రివర్యా..! మన రాజ్యపాలన ఇలాగే కొనసాగితే.. జంతువులు ఇక్కడ మనుగడ సాగించడం కష్టం. ఇప్పటికే తోడేలు, పులిలాంటి జంతువులు మృగరాజు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, లేని పోనివి చెప్పి చిన్న జంతువులను చంపేస్తున్నాయి. నువ్వు తెలివైనదానివని తెలుసు. ఈ అడవిలో నివసిస్తున్న జంతువులను రక్షించాల్సిన బాధ్యత మంత్రిగా మీకు కూడా ఉంది. ఇకనైనా మేలుకుని మంచి చేయండి’ అని వేడుకుంది.

‘మీరు చెప్పింది నిజమే! మన రాజైన సారంగం ఇలాగే ఉంటే జంతువులు అడవిని వదిలి వెళ్లడమో లేక తిరగబడడమో జరుగుతుంది. నేను ఆలోచిస్తాను. ఇక నుంచి జంతువులకు మేలు జరుగుతుంది. భయం లేదని చెప్పండి’ అని ఏనుగును పంపించి వేసింది శయనం.

ఆరోజు నుంచి రాజు ఎవరికి న్యాయం చేయాలో గ్రహించి దానికి వ్యతిరేకంగా మాట్లాడేది. దాంతో రాజు, శయనం నీకేమి తెలియదు అంటూ తీర్పు చెప్పేది. దాంతో జంతువులకు న్యాయం జరగసాగింది.

కానీ జంతువులు మాత్రం శయనాన్ని అపార్థం చేసుకున్నాయి. ‘ఇప్పటి వరకు మంత్రి న్యాయంగా ఉండేది. కానీ ఇప్పుడు అన్యాయం వైపు మాట్లాడుతోంది’ అనుకోసాగాయి.

ఒకరోజు శయనం, జంతువులు ఉండే ప్రదేశానికి వచ్చింది. జంతువులన్నీ కోపంగా.. ‘నువ్వు ఒక మంత్రివేనా.. చెడును సమర్థిస్తూ మహారాజుకు లేని పోనివి చెబుతావా!’ అన్నాయి.

అప్పుడే అక్కడకు వచ్చిన ఏనుగు.. ‘శయనం అలా చేయబట్టే జంతువులకు మంచి జరుగుతోందని గ్రహించండి. మన మహారాజు ఎలాంటిదో అందరికీ తెలుసు కదా..! మనం ఒకటంటే తాను మరొకటి అంటుంది. అందుకే శయనం ముందుగా అన్యాయం వైపు మాట్లాడడంతోనే మృగరాజు మనకు న్యాయం చేస్తోంది’ అని అంది.

అప్పటికి కానీ జంతువులకు అసలు విషయం అర్థం కాలేదు. కానీ శయనం మాత్రం.. ‘మీకు న్యాయం జరిగేలా చేసినా.. నేను మాత్రం నా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా.. అని నిత్యం బాధ పడుతున్నా’ అంది.

అప్పుడే అక్కడకు వచ్చి వారి మాటలు విన్న మృగరాజు సారంగం... ‘నన్ను మన్నించండి. నా తప్పుడు తీర్పులతో ఎందరికో అన్యాయం చేశాను. కానీ నా మంత్రి నన్ను తప్పుదారిలో నడవకుండా చేశారు... సంతోషం!’ అంటూ శయనానికి అభినందనలు తెలిపింది. మృగరాజులో వచ్చిన మార్పునకు జంతువులన్నీ సంతోషించాయి.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు