వయసు చిన్న.. ప్రతిభ మిన్న!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘తొమ్మిదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు?’.. నాలుగో, అయిదో తరగతి చదువుతుంటారు. మహా అయితే.. ఆరో తరగతి.. అంతే కదా! కానీ, ఓ నేస్తం మాత్రం ఆ వయసులో ఏకంగా పాఠశాల విద్యనే పూర్తి చేసేశాడు.

Published : 08 Feb 2023 00:38 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘తొమ్మిదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు?’.. నాలుగో, అయిదో తరగతి చదువుతుంటారు. మహా అయితే.. ఆరో తరగతి.. అంతే కదా! కానీ, ఓ నేస్తం మాత్రం ఆ వయసులో ఏకంగా పాఠశాల విద్యనే పూర్తి చేసేశాడు. ప్రపంచ రికార్డూ కొల్లగొట్టేశాడు. ఆ వివరాలే ఇవీ..

మెరికాకు చెందిన డేవిడ్‌ అనే బాలుడికి ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. ఈ వయసులోనే అక్కడి పాఠశాల విద్యను పూర్తి చేసేశాడు. అంతేకాదు.. అతి పిన్న వయసులోనే స్కూల్‌ అకడమిక్స్‌ను ముగించిన వ్యక్తుల్లో ఒకరిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

చిన్నతనంలోనే గుర్తింపు..

డేవిడ్‌ ఆలోచనా విధానం, జ్ఞాపకశక్తిని తల్లిదండ్రులు చిన్నతనంలోనే గుర్తించారట. తనను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తాడని వారు అప్పుడే నమ్మారు. డేవిడ్‌ కూడా బాల్యంలోనే తనలోని ప్రతిభను తెలుసుకున్నాడట. ఎలాగైనా పదేళ్ల వయసులోగానే పాఠశాల విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగానే ఎంతో కృషి చేశాడు. తరగతి గదుల్లో చెప్పే పాఠాలతోపాటు సొంతంగా ఆన్‌లైన్‌ క్లాసులూ వినేవాడు. అలా అందరూ 14 లేదా 15 సంవత్సరాలను పూర్తి చేసే పాఠశాల విద్యను.. ఈ నేస్తం మాత్రం కేవలం తొమ్మిదేళ్లలోనే ముగించేసి ఔరా అనిపించాడు.

ఖగోళ శాస్త్రవేత్త కావాలని..

అతి చిన్న వయసులోనే ఇంత ప్రతిభ చూపుతున్న ఈ బాలుడు.. భవిష్యత్తులో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కలలు కంటున్నాడు. మూడో తరగతిలో ఉన్నప్పటి నుంచే అంతరిక్షం, గ్రహాలు తదితర అంశాలపైన ఆసక్తి ఏర్పడిందట. ఆ ఆసక్తే క్రమక్రమంగా ఇష్టంగా మారింది. విద్యతో పాటు వివిధ కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చూపిన బాలుడిగా గతేడాది పెన్సిల్వేనియా అసోసియేషన్‌ నుంచి అవార్డు కూడా అందుకున్నాడీ నేస్తం.

సోదరితో గడపడం ఇష్టం..

ఖాళీ సమయాల్లో బేస్‌బాల్‌ ఆడటంతోపాటు కరాటే శిక్షణకు వెళ్తుంటాడు. తన సోదరితో గడపడమంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. ప్రస్తుతం కళాశాలలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. వచ్చే జూన్‌లో పాఠశాల యాజమాన్యం డేవిడ్‌ను సత్కరించనుందట. అంతకుముందు మైఖేల్‌ అనే వ్యక్తి 1990లో అతి పిన్న వయసులో పాఠశాల విద్య పూర్తి చేసిన వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కాడు. ఆ సమయంలో అతడి వయసు కేవలం ఆరేళ్లేనట. అలా 18 సంవత్సరాలకే ఏకంగా పీజీ చదువునూ పూర్తి చేశాడు. మన డేవిడ్‌కు అతను కూడా స్ఫూర్తేనట. నేస్తాలూ.. మనలోని ప్రతిభను గుర్తించి, ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగితే.. సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన డేవిడ్‌ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని