సన్యాసులు విలపించకూడదా?

ఒకరోజు వివేకానంద వారణాసిలో పర్యటిస్తున్నాడు. ఇంతలో తోటి శిష్యుడు పరుగెత్తుకుంటూ వచ్చి వివేకానందకు ఆత్మీయుడైన బలరాంబోస్‌ హఠాన్మరణం గురించి చెప్పాడు. బలరాంబోస్‌ రామకృష్ణ

Updated : 18 Nov 2021 05:18 IST

ఒకరోజు వివేకానంద వారణాసిలో పర్యటిస్తున్నాడు. ఇంతలో తోటి శిష్యుడు పరుగెత్తుకుంటూ వచ్చి వివేకానందకు ఆత్మీయుడైన బలరాంబోస్‌ హఠాన్మరణం గురించి చెప్పాడు. బలరాంబోస్‌ రామకృష్ణ పరమహంసకు కూడా ఆత్మీయుడైన శిష్యుడు. ఆ విషాదం వివేకానందను నిశ్చేష్టుణ్ని చేసింది. దుఃఖాన్ని ఆపుపోలేకపోయాడు. వివేకానంద విలపించటం చూసి, అక్కడే ఉన్న ప్రముఖ సాహితీవేత్త ప్రమదదాస్‌ మిత్రా ఆశ్చర్యపోతూ ‘స్వామీజీ! మీరు సన్యాసి కదా! ఇలా కన్నీళ్లు పెట్టడం ఉచితమేనా?!’ అంటూ వ్యాఖ్యానించాడు.

వివేకానంద చిత్రంగా చూసి ‘సన్యాసినైనంత మాత్రాన నాకు దుఃఖం ఉండదా? నిజమైన సన్యాసి హృదయం సాధారణ వ్యక్తుల హృదయం కన్నా సున్నితంగా ఉంటుంది. ఉండాలి కూడా! బలరాంబోసు నా గురుదేవుల చెంత నాతో కలిసి తిరిగిన సోదర శిష్యుడు. ఆర్తితో స్పందించని, కారుణ్యంలేని వ్యక్తులుగా మార్చే సన్యాసాన్ని నేను ఇష్టపడను’ అంటూ స్పష్టం చేశాడు.

ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయని, తోటివారి కష్టాలకు చలించనివారిని సన్యాసులుగా పరిగణించకూడదనేది వివేకానంద భావన. సాధువులు ఇతరుల కోసం జీవించాలని, సామాన్యుల కన్నా ఇంకా దయతో మెలగాలని హితవు పలికేవారాయన. ఆధ్యాత్మిక అన్వేషకులంటే ఆర్ద్రత లేకుండా మారిపోవటం కాదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, బిడ్డను కోల్పోయిన తల్లికి కొడుకుగా, కష్టాల్లో ఉన్న యువతులకు సోదరులుగా అండగా నిలవాలని సూచించేవారు. సర్వసంగ పరిత్యాగులు లౌకిక సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, వారిని పారమార్థికంగానూ ఉత్తేజితులను చేయాలనేవారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని