కొత్త సంవత్సరంపైనే కోటి ఆశలు

కొవిడ్‌తో కార్యాలయాల లీజింగ్‌పై ఈ ఏడాది ప్రతికూల ప్రభావం పడింది. వ్యాపారాలు మందగించడం, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడంతో కొత్త కార్యాలయాల విస్తరణ మందగించింది. కొత్త సంవత్సరంలో పుంజుకునే అవకాశం ఉందని స్థిరాస్తి సంస్థలు అంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో కీలకమైన కార్యాలయాల నిర్మాణాల్లో హైదరాబాద్‌ మూడేళ్లుగా కోటికిపైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో దూసుకెళ్లింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వరస కట్టడం, ముందస్తు ఒప్పందాలతో నిర్మాణాలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Updated : 28 Nov 2020 05:53 IST

కార్యాలయాల ఏర్పాటుకు ప్రముఖ కంపెనీల ఆసక్తి
పశ్చిమ నగరంలో విస్తరణకు సానుకూలతలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌తో కార్యాలయాల లీజింగ్‌పై ఈ ఏడాది ప్రతికూల ప్రభావం పడింది. వ్యాపారాలు మందగించడం, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడంతో కొత్త కార్యాలయాల విస్తరణ మందగించింది. కొత్త సంవత్సరంలో పుంజుకునే అవకాశం ఉందని స్థిరాస్తి సంస్థలు అంటున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో కీలకమైన కార్యాలయాల నిర్మాణాల్లో హైదరాబాద్‌ మూడేళ్లుగా కోటికిపైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో దూసుకెళ్లింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వరస కట్టడం, ముందస్తు ఒప్పందాలతో నిర్మాణాలు పెద్ద ఎత్తున వచ్చాయి.
* 2018లో 1.16 కోట్ల చదరపు అడుగుల మేర కార్యాలయాల నిర్మాణాలొస్తే 75 లక్షల చ.అ.మేర లీజింగ్‌ పూర్తయ్యింది.
* 2019లో 1.19 చ.అ. నిర్మాణం చేపట్టగా రికార్డు స్థాయిలో 1.05 కోట్ల చదరపు అడుగుల్లో కొత్త కార్యాలయాలు వచ్చాయి.
* ఈ ఏడాది అత్యధికంగా 1.49 కోట్ల చ.అ. నిర్మాణాలు చేపట్టగా ఆరేళ్ల కనిష్ఠానికి లీజింగ్‌ పడిపోయింది. లాక్‌డౌన్‌తో 55 లక్షల చ.అ. మాత్రమే కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి.
* ప్రపంచంలోని ఫార్చూన్‌ వెయ్యి కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
* ఇందులో ఐటీ వాటానే అధికం. కొవిడ్‌తో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుండటంతో కార్యాలయాల విస్తరణ 8 నుంచి 10 శాతం ఆగిపోయింది. 65 శాతం మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారని సర్వేల్లో వెల్లడైంది. దీంతో కొవిడ్‌ ప్రభావం తగ్గగానే మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు.
* కొవిడ్‌ తర్వాత మారిన పరిస్థితులకు తగ్గట్టుగా డెవలపర్లు ఆధునికీకరణపై దృష్టిపెట్టారు. కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఫ్లెక్సిబుల్‌ కార్యాలయాలపై దృష్టి పెట్టారు.


నలువైపులా విస్తరిస్తేనే..

పశ్చిమ హైదరాబాద్‌లోనే ఐటీ కార్యాలయాలు విస్తరిస్తుండటం, అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతం కావడంతో మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ట్రాఫిక్‌ సమస్యలతో గ్రిడ్‌ లాక్‌ పరిస్థితులు తలెత్తుతున్నాయి.
* ఇప్పటికే ఐటీ కార్యాలయాల భవనాలు చాలా వరకు రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉండగా.. కొత్తగా నిర్మించేందుకు అనుమతులు కూడా ఇటువైపే తీసుకున్నారు.
* ఖాజాగూడ, కోకాపేట, పుప్పాలగూడ వైపు కొత్తగా ఐటీ టవర్లు వస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నవి.. అనుమతులు పొందినవి.. కొత్తగా వచ్చేవాటిని కలుపుకొంటే మరో ఐదేళ్ల పాటు ఐటీ విస్తరణ పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉంటుందని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంటున్నాయి. ఇక్కడ విస్తరణకు పలు సానుకూలతలు ఉన్నాయని చెబుతున్నారు.
* తక్షణం లీజుకు లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ సిద్ధంగా ఉండటం, అధిక విస్తీర్ణంలో భూముల లభ్యత, ఐటీ నిపుణులు, ఉన్నతాధికారులు నివాసం ఉండేందుకు వారి స్థాయిలో ఇళ్ల లభ్యత, హోటల్స్‌ వంటి అనుకూలతలు ఇక్కడ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు ఇలాంటి అనుకూలతలు లేకపోవడంతో ఐటీ సంస్థలు అద్దెలు తక్కువైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు అధికంగా ఉండటం ఒకింత సమస్యగానే ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రిడ్‌ పాలసీతో కొంపల్లి, పోచారం వైపు కొత్త ఐటీ సంస్థలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని