ఇంట్లో పడక గది ఏ దిక్కున ఉండాలి..!

వాస్తురీత్యా పడకగది ఏ దిక్కులో ఉండాలి.. కుటుంబ పెద్దలకు ఎటువైపు అనుకూలం.. పిల్లల గది వాయవ్యంలో ఉండొచ్చా? కుటుంబ సభ్యులకు అన్నివిధాలా కలసి రావాలంటే ఏ దిక్కుకు అభిముఖంగా శయనించాలి? ఇంటి నిర్మాణ పరంగా, కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వాస్తునిపుణులు-ఇంజినీర్‌ పి.కృష్ణాది శేషు వివరిస్తున్నారిలా.. ఇంటి స్థలంగానీ, కట్టిన ఇల్లుగానీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దిక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉన్న స్థలంలో వాస్తు రీత్యా ఇంటి నిర్మాణంతో

Published : 08 Feb 2020 01:11 IST

ఈనాడు, హైదరాబాద్‌

వాస్తురీత్యా పడకగది ఏ దిక్కులో ఉండాలి.. కుటుంబ పెద్దలకు ఎటువైపు అనుకూలం.. పిల్లల గది వాయవ్యంలో ఉండొచ్చా? కుటుంబ సభ్యులకు అన్నివిధాలా కలసి రావాలంటే ఏ దిక్కుకు అభిముఖంగా శయనించాలి? ఇంటి నిర్మాణ పరంగా, కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వాస్తునిపుణులు-ఇంజినీర్‌ పి.కృష్ణాది శేషు వివరిస్తున్నారిలా..

ఇంటి స్థలంగానీ, కట్టిన ఇల్లుగానీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దిక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉన్న స్థలంలో వాస్తు రీత్యా ఇంటి నిర్మాణంతో అనుకూలించడమే కాక ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. రహదారులు మలుపులు తిరిగినప్పుడు కొన్ని స్థలాలు దిక్కులకు బదులు ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి మూలలకు రావొచ్చు. ఇలాంటి స్థలాల్లో ఇల్లు కట్టడం కాస్త ఇబ్బందే అయినా చక్కటి ప్రణాళికతో వాస్తురీత్యా ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు.

ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలంటే గదులు ఉండాల్సిన దిక్కులు కూడా ముఖ్యమే. ఇంటి ప్రధాన ద్వారం, వంటగది, దేవుడి గదికే కాదు పడక గదికి వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా పగలంతా కష్టపడిన శరీరానికి రాత్రికి ఇంటికి రాగానే తగిన విశ్రాంతికి..  రేపటి కోసం కొత్త ఆలోచనలకు నిలయం పడక గదినే. ఇంటి యజమానురాలు, యజమానికి గోప్యతతో పాటూ భద్రతకు అనుకూలంగా ఉండే దిక్కును ఎంచుకోవడం మేలు. వాస్తుపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇంట ఆనందం మరింత రెట్టింపవుతుంది.

ఎటువైపు ఉండాలంటే..
పడక గది సాధారణంగా వాస్తురీత్యా ఇంటికి పడమర, దక్షిణ దిశలలో ఉండేలా కట్టుకోవడం ఉత్తమం. నైరుతి మూల అయితే మరీ మంచిది. ప్రైవసీకి భంగం ఉండదు. భద్రత కూడా.
* ఇల్లు ఏ దిక్కులో ఉన్నా రాకపోకలు తూర్పు, ఉత్తర దిశలలో అనుకూలంగా ఉంటాయి. ఈ దిక్కుల్లో ప్రధాన ద్వారాలతో ఆరోగ్యాన్ని కాపాడే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి. సాయంత్రం పడే పడమర ఎండకు దూరంగా ఉండవచ్చు. ఈ దిక్కుల్లోనే డ్రాయింగ్‌రూమ్‌, గెస్ట్‌ రూమ్‌లు, వంటగది ఉండడం శాస్త్రరీత్యా బాగుంటుంది. దీంతో పడమర, దక్షిణ, నైరుతిలో నిర్మించే పడకగదికి తగినంత గోప్యత లభిస్తుంది.
* ఇంట్లో పెద్దవారికి నైరుతి దిశలో పడక గది నిర్మిస్తే.. ఇతర కుటుంబ సభ్యులకు, పిల్లలకు దక్షిణ, పడమర దిశలతోపాటూ వాయవ్యం కూడా అనుకూలమే. ఆగ్నేయం లేదా ఈశాన్యం వాస్తుపరంగానే అంత అనుకూలం కాదు.
* పడకగది చతురస్ర ఆకారంలో ఉన్నా పర్వాలేదు కానీ.. దీర్ఘచతురస్రంగా ఉంటే మరింత వీలుగా ఉంటుంది. ఇంట్లో స్థలం వృథా కాదు. పడకగది పొడవు, వెడల్పు 10*12, 10*15, 12*15, 15*18 అడుగుల్లో ఉంటే అనుకూలంగా ఉంటుంది. అవసరం, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి గదులను సౌకర్యంగా నిర్మించుకోవచ్చు.


తల ఎటువైపు పెట్టాలి..

పడకగదిలో నిద్రించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. చక్కటి నిద్ర సగం రోగాలను నియంత్రిస్తుందని ఆరోగ్యశాస్త్రం చెబుతుంది. అందుకు నిద్రించే విధానం కూడా మేలు చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
* పడమర దిశ తలపెట్టి పడుకున్నప్పుడు కలత నిద్ర వస్తుంది. సరిగ్గా నిద్రపట్టక పోవడం, మధ్యలో లేవడం ఎక్కువగా జరుగుతుంది. తరచూ నిద్రలేమితో బాధపడడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది.
* తూర్పువైపు తల పెట్టి పడమరవైపు అభిముఖంగా నిద్రిస్తే సుఖనిద్ర పడుతుంది. శయన మందిరానికి వెళ్లడంతోనే నిద్రలోకి జారుకుంటారు.
* దక్షిణం వైపు తలపెట్టి ఉత్తర దిశ అభిముఖంగా పడుకోవడం మేలు చేస్తుంది. గాఢనిద్రకు అనుకూలంగా ఉంటుంది.
* ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణం అభిముఖంగా పడుకోవడం అంత అనుకూలం కాదు. శాస్త్రపరంగా దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలు మనలో ఉన్న శక్తిని గ్రహించి మనిషిని నిర్వీర్యం చేస్తాయి. అందుకే పురాణాలలో ఉత్తరం వైపు నిద్రించే ఏనుగు తలను వేరు చేయడం లాంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాస్తు శాస్త్రాన్ని కేవలం ఆధ్యాత్మికంగా పరిగణించడమే కాక శాస్త్రీయపరమైన అంశాలు కూడా మిళితమైన ఉన్నాయని గ్రహించాలి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని