మార్కెట్‌పై కరోనా ప్రభావమెంత..?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్‌-19 ప్రభావం స్థానిక రియల్‌ ఎస్టేట్‌పై పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దనే ప్రభుత్వ సూచనల మేరకు ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. సెంటిమెంట్‌ మీద నడిచే మార్కెట్‌ కావడంతో ప్రాజెక్ట్‌లను సందర్శించే కొనుగోలుదారులు తగ్గిపోయారు. నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. స్థిరాస్తి మార్కెట్‌పై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి.

Published : 21 Mar 2020 00:53 IST

ఈనాడు, హైదరాబాద్‌

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్‌-19 ప్రభావం స్థానిక రియల్‌ ఎస్టేట్‌పై పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దనే ప్రభుత్వ సూచనల మేరకు ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నారు. సెంటిమెంట్‌ మీద నడిచే మార్కెట్‌ కావడంతో ప్రాజెక్ట్‌లను సందర్శించే కొనుగోలుదారులు తగ్గిపోయారు. నిర్ణయాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. స్థిరాస్తి మార్కెట్‌పై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి. స్టాక్‌మార్కెట్లో భారీ ఒడిదొడుకులు, బ్యాంకుల పనితీరు బాగోలేకపోవడంతో స్థిరాస్తుల్లోనే పెట్టుబడులు భద్రమనే భావనతో స్థిరాస్తుల వైపు ఎక్కువ మంది చూస్తున్నారని.. మున్ముందు మార్కెట్‌ మరింత బాగుంటుందని అంచనా వేస్తున్నారు.


ప్రాజెక్ట్‌ పూర్తిపై ..
- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌ భిన్నం. కొంతకాలంగా వృద్ధిపథంలో నడుస్తోంది. భారీగా కాకపోయినా మోస్తరు వృద్ధి ఉంటుందనే అంచనా. ఇతర నగరాల్లో స్థిరాస్తి రంగం అంత బాగోలేకపోవడంతో అక్కడ కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గిపోయాయి. మన మార్కెట్‌ బాగుండడంతో పెట్టుబడి పెట్టేవారు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. కరోనాతో ప్రాజెక్ట్‌ షెడ్యూళ్లు ఆలస్యం కావొచ్చు తప్ప ఇతరత్రా పెద్దగా ప్రభావం ఉండదు. ప్రస్తుతం విక్రయాలు సాధారణంగానే ఉన్నాయి. కార్మికులు, సిమెంట్‌, స్టీల్‌, రవాణాకు పెద్దగా సమస్యల్లేవు. గృహ నిర్మాణం వరకు ఢోకా లేదనే భావిస్తున్నాను. ఐటీలో నియామకాలు వాయిదాపడటంతో ఆఫీసు మార్కెట్‌పై కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు. నిర్మాణ రంగం బాగుండాలంటే బ్యాంకులు బాగుండాలి. కొనుగోలుదారులకు, నిర్మాణ సంస్థలకు రుణాలు ఇచ్చేది వారే. ప్రస్తుతం బ్యాంకింగ్‌ షేర్లు పడిపోతుండటంతో కొంత ఆందోళన కలిగించే అంశం. స్టాక్‌  మార్కెట్‌ పతనంతో వాటిలో మదుపు చేసేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. వీరందరూ రిస్క్‌లేనిది ఇల్లేనని ఇటువైపు చూసే అవకాశం ఉంది. 


తాత్కాలికమే..
- కె.ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

మార్కెట్లో డబ్బు ఉంది. దీన్ని ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెట్టాలి. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం అందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. స్టాక్‌ మార్కెట్ల భారీ పతనం, బ్యాంకులపై నమ్మకం లేకపోవడంతో వీరందరికీ మిగిలి ఉన్న అవకాశం రియల్‌ ఎస్టేటే. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి అవసరం. కాబట్టి స్థిరాస్తి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. కరోనాతో ఐటీ రంగానికి పెద్ద సమస్యలు లేకపోవడం కూడా మన మార్కెట్‌కు కలిసివచ్చే అంశమే. ప్రస్తుతం ఒకటి రెండు నెలలు విక్రయాలపై ప్రభావం ఉంటే ఉండొచ్చు. సాధారణంగా ఎండాకాలంలో ప్రాజెక్ట్‌లను సందర్శించేవారు తగ్గుతారు.. దీనికి కరోనా తోడవడంతో వచ్చేవారు సగానికి పడిపోయారు. ఫ్లాట్‌ బుక్‌ చేసిన వారు నిర్మాణం జరుగుతున్న తీరు తెలుసుకునేందుకు తరచూ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తుంటారు. కరోనా భయం ఉండటంతో ప్రస్తుతం వీరు రావడం లేదు. నిర్మాణ కార్మికులు వస్తుండటంతో పనులు యథాతథంగా జరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో సులువుగానే డబ్బు సంపాదించవచ్చని ఎక్కువ మంది ఈ రంగంలోకి వచ్చి అనవసర పోటీతో భూముల ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా ఆ భారం కొనుగోలుదారుడిపైనే పడుతోంది. తక్కువ కాలంలో సొమ్ము చేసుకుందామనే ఇన్వెస్టర్లకు మినహా దీర్ఘకాలంగా ఈ రంగంలో ఉన్న బిల్డర్లకు, సొంతింటి కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ప్రస్తుత పరిణామాలు కలిసి వచ్చే అంశమే. 


నెమ్మదించిందంతే..
- ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌

కరోనా భయంతో జనం ఎవరూ బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. సహజంగానే ప్రాజెక్ట్‌ల్లో విచారణలు తగ్గిపోయాయి. మార్కెట్‌ పడిపోయిందని చెప్పలేను కానీ నెమ్మదించింది. ఒక నెల గడిస్తే తప్ప కరోనా ప్రభావం ఎంత ఉందనేది స్పష్టత రాదు. మార్కెట్లో ఎక్కువ మంది బిల్డర్లు నిర్మాణ సామగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. నిర్మాణాలు పూర్తిచేసే దశలో ఉపయోగించే ఎలక్ట్రికల్‌, శానిటరీ, వంటగది సామగ్రి వరకు చైనా నుంచి వచ్చేవి. ప్రస్తుతం అక్కడి నుంచి రావడానికి అవకాశం లేదు. మరో రెండేళ్లు ఎవరూ వెళ్లడానికి కూడా సాహసించరు. ఈ ప్రభావం నిర్మాణ ధరలపై ఎంత ఉంటుందనేది చూడాలి. తాత్కాలికంగా మార్కెట్‌ నెమ్మదించినా ఇళ్ల అవసరం మాత్రం చాలా ఉంది. మరో పదేళ్లపాటూ ఇక్కడ బిజినెస్‌, వృద్ధికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్నారంతే. స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు పడిపోతుండటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా స్థిరాస్తుల్లోనే పెట్టుబడి పెడుతున్నారు. ప్రాజెక్ట్‌లు సందర్శించేందుకు వచ్చే కొనుగోలుదారులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మా బిల్డర్‌ సభ్యులకు సూచించాం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని