మీరూ సొంతిల్లు కొనగలరు!

కొత్త ఏడాదిలోనైనా సొంతిల్లు కొనగలమా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఇల్లు కలగానే మిగిలిఉంది. క్యాలండర్‌ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు ఇంటి చుట్టూనే తిరుగుతుంటాయి. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల తాజా సూచీలు మీరూ.....

Updated : 09 Jan 2021 02:28 IST

సూచీలు సూచిస్తున్నదిదే
కొత్త సంవత్సరం కలిసొస్తుందనే ఆశాభావం
ఈనాడు, హైదరాబాద్‌

కొత్త ఏడాదిలోనైనా సొంతిల్లు కొనగలమా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఇల్లు కలగానే మిగిలిఉంది. క్యాలండర్‌ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు ఇంటి చుట్టూనే తిరుగుతుంటాయి. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల తాజా సూచీలు మీరూ ఇల్లు కొనగలవనే సూచిస్తున్నాయి. ఆదాయాలు పెరగడం, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణంతో మార్కెట్లో ఇల్లు కొనే స్థోమత గతంలో కంటే మెరుగుపడిందని చెబుతున్నాయి.
సొంతంగా ఇల్లు కట్టుకునేవారైనా కట్టిన ఇల్లు కొనేవారైనా గృహ రుణం తీసుకునే వారే అధికం. వస్తున్న ఆదాయం ఎంత? నెలకు ఎంత ఈఎంఐ చెల్లించగలమనే దానిపై ఆధారపడి ఇంటి రుణం మంజూరు చేస్తారు. ఇంటి విలువలో 80 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నా.. క్రమం తప్పకుండా నెలవారీ చెల్లించే స్థోమత కూడా ముఖ్యం. దీన్నే ఆదాయ, ఈఎంఐ నిష్పత్తి అంటారు. అఫర్డబుల్‌ ఇండెక్స్‌గా పేర్కొంటారు. 2010తో పోలిస్తే 2020 నాటికి పదేళ్ల కాలంలో ఇల్లు కొనే స్థోమత పెరిగింది. హైదరాబాద్‌లో 2010లో ఆదాయం, ఈఎంఐ నిష్పత్తి 47 శాతం ఉంటే... 2020 నాటికి 31 శాతానికి మెరుగైంది. 2015 నుంచి చాలా ఎక్కువ మెరుగుపడింది. పదేళ్ల క్రితం ఆదాయంలో 47 శాతం ఇంటి వాయిదాలకు వెచ్చిస్తే తప్ప కొనలేని పరిస్థితి ఉండేది. సగం జీతం ఇంటి వాయిదాలకు కేటాయిస్తే కుటుంబ పోషణ కష్టమవుతుందని కొనడం వాయిదా వేసేవారు. ఇప్పుడు ఆదాయంలో ఇంటి కోసం 31 శాతం చాలు. గృహరుణ వడ్డీరేట్లు తగ్గడం కూడా ఒక కారణమే. ప్రస్తుతం దశాబ్ద కాలంలోనే వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. 6.95 శాతానికి దిగి వచ్చాయి.


అక్కడ సగం ఆదాయంపైనే..

ముంబయి ఇళ్ల ధరలు చాలా ఖరీదని తెలిసిందే. అక్కడ సొంతిల్లు కావాలంటే ఇప్పటికీ ఆదాయంలో 61 శాతం కేటాయించాల్సిందే. అత్యంత అందుబాటులో ఇళ్లు అంటే అహ్మదాబాద్‌ పేరు ముందు వినిపిస్తోంది. ఇక్కడ ఆదాయంలో 24 శాతంతో ఇంటిని కొనే స్థోమత ఉంది. ఆ తర్వాత పుణె, చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. హైదరాబాద్‌ ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ గత కొన్నేళ్లుగా భూముల ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని