Updated : 10 Sep 2021 04:10 IST

సొంతింటి విఘ్నాలు తొలగినట్టేనా?

ఈనాడు,హైదరాబాద్‌

ఇల్లు, స్థలం కొనుగోలు చేసేందుకు చాలామంది మంచి రోజు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజూ రానే వచ్చింది. విఘ్నాలు తొలగించే పండగగా జరుపుకొనే వినాయక చవితి వేళ సొంతింటిపై నిర్ణయం తీసుకునేందుకు సరైన సమయమని చాలామంది భావిస్తుంటారు. విక్రయాలు పెంచుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పండగపూట పలు ఆఫర్లు అందిస్తున్నాయి. పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులు మొదలెడుతున్నాయి. ఇటు కొనుగోలుదారులకు, అటు డెవలపర్లకు పండగ కలిసొస్తుందని విశ్వాసంతో ఉన్నారు.

కొవిడ్‌తో గత ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం క్రమంగా అందులోంచి బయటపడింది.  పాత నిర్మాణ పనుల కొనసాగింపు.. కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. విక్రయాలు ఒక స్థితిలో కొవిడ్‌కి ముందున్న దశకు చేరుకున్నా.. ఆ తర్వాత నిలకడగా కొనసాగుతున్నాయి.  పండగ సీజన్‌ మొదలు కావడంతో పుంజుకునే అవకాశం ఉందని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్న వారు సైతం కొవిడ్‌ మూడోవేవ్‌ భయాలతో ఇప్పటికీ స్థిరాస్తి కొనుగోలుపై ఏటూ తేల్చుకో లేకపోతున్నారు. వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడం.. మున్ముందు వరస పండగలతో వీరంతా కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్‌ వంటి విఘ్నాలు ఈ పండగతో తొలగినట్టేనని అంటున్నారు.

మరింత పెరగకముందే...

కొవిడ్‌కు ముందుతో పోలిస్తే ఏడాదికాలంలో స్థిరాస్తి ధరలు పెరిగాయి.  లాక్‌డౌన్‌ ప్రభావంతో భూముల ధరలు దిగి వస్తాయని స్థిరాస్తి వ్యాపారులు అంచనా వేశారు. ఇళ్ల ధరలు నిలకడగానే ఉంటాయని చెప్పారు. వీరి అంచనాలకు భిన్నంగా మార్కెట్‌ స్పందించింది. స్థలాలు, భూముల ధరలు అమాంతం పెరిగాయి. కొన్ని వర్గాలు వీటిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో డిమాండ్‌ పెరిగింది. అదే సమయంలో ముడి సరకులు, లేబర్‌, ఇతరత్రా వ్యయం పెరగడంతో ఇంటి ధరలు పెంచారు. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్‌ లేక తగ్గించిన నిర్మాణదారులు ఉన్నారు. మొత్తంగా గత ఏడాది వినాయక చవితి నుంచి ఈ ఏడాది పండగ వరకు చూస్తే ధరల్లో చాలా దిద్దుబాటు కనిపించింది.  కొవిడ్‌ ముందు కంటే  కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.500 నుంచి రూ.1500 వరకు పెరిగాయని నిర్మాణదారులు చెప్పారు. సగటు ధరలు చూస్తే 2020లో చదరపు అడుగు రూ.4750 ఉంటే.. ఈ ఏడాదికొచ్చేసరికి ఐదువేల రూపాయలకు చేరింది. ఈ ధరలు మరింత పెరగకముందే స్థిరాస్తిని సొంతం చేసుకోవాలని నిర్మాణదారులు కొనుగోలుదారులకు సూచిస్తున్నారు.  ‘శ్రావణమాసం నుంచి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. స్థిరాస్తి ప్రదర్శనను సందర్శించి, నచ్చిన ప్రాజెక్ట్‌ ఎంపిక చేసుకున్న వారంతా శ్రావణంలో కొనడం మొదలైంది. వినాయక చవితి కూడా చాలామందికి సెంటిమెంట్‌. ముందు వచ్చేవన్నీ పండగలే. మున్ముందు మార్కెట్‌ బాగుంటుంది’ అని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

చేరువయ్యేందుకు..

పండగ వేళ కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పలు రాయితీలు అందిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను తామే భరిస్తామని ఒక సంస్థ అంటుంటే.. మరో సంస్థ జీఎస్‌టీ భారం తమదే అంటోంది. ఉచితంగా మాడ్యులర్‌ కిచెన్‌ అందిస్తాం అంటున్నాయి. నిర్మాణం పూర్తయ్యేవరకు ఈఎంఐ తామే చెల్లిస్తాం అని చెబుతున్నాయి. 10 శాతం బుకింగ్‌ సమయంలో కట్టి.. మిగతా 90 శాతం నిర్మాణం పూర్తయ్యాక చెల్లిస్తే చాలు అని.. ప్రీ ఈఎంఐ ఉండదని చెబుతున్నాయి. ఒక పక్కన అద్దె, మరో పక్కన ఈఎంఐ చెల్లించలేని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను పరిమిత కాలానికి అందజేస్తున్నామని ఆయా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అంటున్నాయి. స్థలాల విషయానికి వస్తే సాధారణంగా దిక్కులను బట్టి ధరలు వేర్వేరుగా చెబుతుంటారు. తూర్పు.. ఇలా ఏ దిక్కు అయినా ఒకటే ధర అని ఆరంభంలో కొంటేనే ఈ ప్రయోజనం దక్కుతుందని చెబుతున్నాయి.

కలిసొచ్చే అంశాలు..

* కొవిడ్‌ సమయంలో అద్దె ఇళ్లలో ఇబ్బందుల దృష్ట్యా సొంతింటి కొనుగోలు వైపు చాలామంది చూస్తున్నారు. 

* గృహరుణ వడ్డీరేట్లు ప్రస్తుతం అత్యంత తక్కువగా ఉన్నాయి. కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ఇంతకు మించిన సమయం ఉండదు. ఎల్‌ఐసీ 6.66 శాతానికి గృహరుణం మంజూరు చేస్తోంది. స్థలాల కొనుగోళ్లకు 50 శాతం వరకు రుణాలు అందజేస్తున్నాయి.

* కొవిడ్‌కు ముందు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోళ్లకు మొగ్గు చూపితే.. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. ఇది కలిసొచ్చే అంశం. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, కొంపల్లి, శంషాబాద్‌.. ఇలా అన్ని వైపులా నిర్మాణాలు వస్తున్నాయి. సోషల్‌ ఇన్‌ఫ్రా మెరుగైంది.

* ఇక్కడ ఐటీ రంగం బాగుంది. కొత్తగా నగరం బయట పారిశ్రామికంగా విస్తరిస్తోంది. పలు కొత్త పరిశ్రమలు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తున్నాయి. ఈ-సిటీలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మూడు ప్రాంతాల్లో అమెజాన్‌ డాటా సెంటర్లు వస్తున్నాయి.  ఫార్మా సిటీ రాబోతుంది. వీటికోసం నిర్మించే మౌలిక వసతులతో స్థలాల ధరలు భవిష్యత్తులో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.  

 


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని