Updated : 05 Mar 2022 06:35 IST

‘వాణిజ్యం’లో కలిసొస్తుందా?

నగరంలో వాణిజ్య నిర్మాణాలు పెరుగుతున్నాయి. కార్యాలయాల భవనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటిలో సంస్థాగత మదుపర్లతో పాటు ఇటీవల రీటైల్‌ ఇన్వెస్టర్లు మదుపు చేస్తున్నారు.  ఇప్పటికే ఇల్లు, స్థలాలు ఉన్నవారు అధిక అద్దెల ఆదాయం కోసం వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. వీటిలో పెట్టుబడి లాభమా? నష్టమా?

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గృహ నిర్మాణాలతో పాటు వాణిజ్య, కార్యాలయాల భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. వ్యాపార పరంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వాణిజ్య భవనాలు కడుతుంటే... మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌లో కార్యాలయ భవనాలు వస్తున్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఈ రెండు కలగలిసిన భవనాలు నిర్మిస్తున్నారు. వీటిల్లో రూ.పది లక్షల మొదలు పెట్టుబడులను డెవలపర్లు స్వీకరిస్తున్నారు. యూడీఎస్‌ కింద కూడా విక్రయిస్తున్నారు. వేర్వేరు పథకాల పేరుతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ముంబయి వంటి దేశ వాణిజ్య రాజధానిలో ఎప్పటి నుంచో వీటిల్లో మదుపర్లు పెట్టుబడులు పెడుతున్నా.. హైదరాబాద్‌లో మూడేళ్ల నుంచి వాణిజ్య భవనాల్లో స్థలాలను కొనుగోలు చేస్తున్నారని రియల్టర్లు అంటున్నారు.

ఫ్రాక్షనల్‌ యాజమాన్యం

ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రస్తుతం వాణిజ్య మార్కెట్లో ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. కొంతమంది నుంచి నిధులు సమీకరించి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయడం. ఉదాహరణకు పదివేల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ను  కొనుగోలు చేయాలంటే చ.అ.కు రూ.పదివేలు అనుకుంటే పది కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని వందమంది చేత కొనిపిస్తారు. ఒక్కొక్కరు రూ.పది లక్షలు మదుపు చేస్తే ఒక్కొక్కరికి 100 చ.అ. కమర్షియల్‌ స్పేస్‌ ఇస్తారు. ఇదంతా కూడా కాగితాల్లోనే ఉంటుంది. విడిగా వంద గజాలు ఎక్కడా చూపించలేరు. అద్దె మాత్రం వస్తుంది. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మొదటగా ఒకరు ఈ పద్ధతిలో కార్యాలయ భవనం నిర్మించారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లావాదేవీలు జరుగుతున్నాయి. రూ.20 లక్షలు పెడితే నెలకు రూ.18వేలు అద్దె గ్యారంటీ అంటూ రిటైల్‌ ఇన్వెస్టర్లను దగ్గరికి చేర్చుకుంటున్నారు. ఐదారువేల చదరపు అడుగులు కొంటున్న వారు ఉన్నారు. యూడీఎస్‌ కింద భవనాలు మొదలు పెట్టకముందే కొంటున్నవారు ఉన్నారు.

అధిక అద్దె వస్తుందని..

కమర్షియల్‌ భవనాల్లో అద్దె రాబడి కోసమే ఇటీవల మొగ్గు చూపుతున్నట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో అద్దె రాబడి 8 శాతం వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువే వస్తుంది. ఇళ్లపై వచ్చే అద్దె కంటే రెండు నుంచి మూడురెట్లు అధికంగా రాబడి వస్తుంది.

* మంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అద్దెకు ఢోకా ఉండదు. సంస్థాగత మదుపర్లకైతే 6 నుంచి 8 శాతం వచ్చినా లాభమే కాబట్టి వారే ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటారు.
* సాధారణంగా వాణిజ్య భవనాల లీజులు దీర్ఘకాలానికి ఉంటాయి. కాబట్టి అద్దె రాబడి స్థిరంగా వస్తుంది.


సవాళ్లు ఉన్నాయ్‌..

* వాణిజ్య, కార్యాలయ భవనాల్లో సానుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయి. అద్దె రాబడి ఎక్కువే అయినా.. వీటి జీవితకాలం తక్కువే ఉంటుంది. ఒకప్పుడు బేగంపేటలో వాణిజ్య భవనాలకు డిమాండ్‌ బాగా ఉండేది. ఇప్పుడు బంజారాహిల్స్‌, ఐటీ కారిడార్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రాంతాలకు వాణిజ్య మార్కెట్‌ మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మాత్రం వీటికి మినహాయింపు.
* వాణిజ్య భవనాల్లో స్పేస్‌ను నిర్వహించడం సాధారణ మదుపర్లకు క్లిష్టమైన పనే. కార్పొరేట్‌ సంస్థలు, వారి ఒప్పందాలు క్లిష్టతరంగా ఉంటాయి. సాధారణంగా వీటిని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు చూస్తుంటాయి. అవగాహనతోనే వీటిలోకి అడుగుపెట్టాలి.
* సరైన వాణిజ్య స్థలం ఎంపిక సైతం పెద్ద సవాల్‌. మార్కెట్‌పై అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే లాభం కంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని