ఆసియా పసిఫిక్‌లో హైదరాబాద్‌కు మూడో స్థానం

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కీలక కార్యాలయాల లీజింగ్‌లో.. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని

Published : 21 Mar 2020 00:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కీలక కార్యాలయాల లీజింగ్‌లో.. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని పది అగ్రశ్రేణి మార్కెట్లలో నగరానికి చోటు దక్కింది. గత ఏడాది 1.28 కోట్ల చదరపు అడుగుల లీజింగ్‌తో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిల్చింది. మన దేశం నుంచి ఆరు నగరాలకు చోటు దక్కగా బెంగళూరు రెండో స్థానంలో, ముంబయి నాలుగో స్థానం, దిల్లీ ఐదో స్థానం, పుణె ఏడో స్థానం, చెన్నై ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొదటి ఎనిమిది మార్కెట్లో ఆరు భారతీయ నగరాలే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఆఫీసు మార్కెట్‌కు 2019 మైలురాయిగా నిల్చింది.

* బెంగళూరులో 1.53 కోట్ల చ.అ. కార్యాలయాల స్థలం లీజింగ్‌ లావాదేవీలు జరగగా మరో 16.5 కోట్ల చ.అ. స్టాక్‌ నిర్మాణంలో ఉంది. నిర్మాణాలు పూర్తయి ఖాళీలు ఉన్న నిర్మాణాల శాతం 4.8 శాతంగా ఉంది.
* హైదరాబాద్‌లో 1.28 కోట్ల చ.అ. విస్తీర్ణం కలిగిన కార్యాలయాలు లీజింగ్‌కు ఇవ్వగా 7.5 కోట్ల చ.అ. భవిష్యత్తులో అందుబాటులోకి రాబోతుంది. ఖాళీలు 7 శాతంగా ఉన్నాయి.
* ఆర్థిక రాజధాని ముంబయిలో ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 17.5 శాతం ఖాళీలు ఉన్నాయి. 97 లక్షల చ.అ.మాత్రమే లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి. 14.6 కోట్ల చ.అ. స్టాక్‌ ఉంది.
* దిల్లీ రాజధాని ప్రాంతంలో 86 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయి. ఇక్కడ కార్యాలయాల్లో ఖాళీలు 17.1 శాతంతో భారీగా ఉన్నాయి. స్టాక్‌ కూడా భారీగానే అందుబాటులో ఉంది. 16.6కోట్ల చ.అ. కార్యాలయాల నిర్మాణంలో ఉంది.
* పుణె, చెన్నైలో 62 లక్షలు, 52 లక్షల ఆఫీసు లావాదేవీలు మాత్రమే జరిగాయి. మున్ముందు ఎక్కువ స్టాక్‌ రాబోతుంది. ఒక్కోనగరంలో 7.3 కోట్ల చ.అ. స్టాక్‌ అందుబాటులోకి రానుంది. ఖాళీలు 4.2 నుంచి 8.8 శాతం వరకు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని