యూపీవీసీ మేలు

ఇంటి నిర్మాణంలో యూపీవీసీ కిటికీల వాడకం పెరిగింది. కలప కొరత, అధిక ధరలు, సమయానికి కలప కిటికీలు సిద్ధం కాక ఇంటి నిర్మాణం ఆలస్యం కావడం వంటి అనుభవాలతో యూపీవీసీ వైపే మొగ్గు చూపుతున్నారు. బహుళ అంతస్తుల సముదాయాలు మొదలు వ్యక్తిగత ఇళ్లలోనూ...

Published : 19 Jun 2021 01:51 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణంలో యూపీవీసీ కిటికీల వాడకం పెరిగింది. కలప కొరత, అధిక ధరలు, సమయానికి కలప కిటికీలు సిద్ధం కాక ఇంటి నిర్మాణం ఆలస్యం కావడం వంటి అనుభవాలతో యూపీవీసీ వైపే మొగ్గు చూపుతున్నారు. బహుళ అంతస్తుల సముదాయాలు మొదలు వ్యక్తిగత ఇళ్లలోనూ ఇప్పుడు దాదాపుగా వీటినే వాడుతున్నారు. తెలుపే కాకుండా ఇప్పుడు భిన్న వర్ణాల్లో లభిస్తుండటంతో నిర్మాణదారులు తమకు నచ్చిన రంగును ఎంపిక చేసుకుంటున్నారు.
నగరంలో పెరిగిన భూముల ధరలతో తక్కువ స్థలంలో మూడు నాలుగు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. గదుల విస్తీర్ణం చాలా చిన్నగా ఉంటోంది. మరి ఇరుకుగా అనిపించకుండా ఉండాలంటే ఆ గదుల్లో తగినంత వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉంటే చిన్న గది కూడా విశాలంగా కనిపిస్తుంది. అందుకు యూపీవీసీ కిటికీలు, స్లైడ్‌ డోర్లు దోహదం చేస్తున్నాయి. తుప్పు పట్టకపోవడం, శబ్దాలను నిరోధించడం, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం, పదేపదే రంగులేయాల్సిన పని లేకపోవడం, తగినంత వెలుతురు వచ్చేలా ఉండటంతో వ్యక్తిగత గృహ నిర్మాణాల్లోనూ ఇప్పుడు వీటినే వాడుతున్నారు.

ఎలా కావాలంటే అలా...
పక్కకు జరిపే(స్లైడింగ్‌) వాటితో పాటూ మడతపెట్టే కిటికీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నా పరిమితులు ఉండేవి. తలుపుల్లో దొరికేవి కాదు. ఇప్పుడు తలుపుల్లోనూ స్టైడింగ్‌తో పాటూ ఫోల్డ్‌ చేసుకునే విధంగా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. బాల్కనీలను తీసుకుంటే జరిపే తలుపుల్లో సగం తెరిస్తే మిగతా సగం గాజు తలుపు మూసే ఉంచాల్సి వచ్చేది. అవసరం అనుకుంటే ఆ తలుపును మడత పెట్టడం ద్వారా పూర్తిగా తెరుచుకునే వెసులుబాటు ఉంటుంది. వీటితో ఇంకా ఎక్కువ వెలుతురు, గాలి ఇంట్లోకి వస్తుంది. నైలాన్‌ రోలర్స్‌ సహాయంతో ఏ దిశలో అయినా సరే సులువుగా కదలడం, ముడవడం చేయవచ్చు అని తయారీదారులు అంటున్నారు. ఇంటి లోపల విస్తీర్ణం, అవసరాన్ని బట్టి వీటిని తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు.  
* యూపీవీసీ కిటికీలు, తలుపులు అంటే తెలుపు రంగే గుర్తుకొస్తుంది. ఇప్పుడు వేర్వేరు రంగుల్లోనూ దొరుకుతున్నాయి. బోల్డ్‌ బ్లాక్‌, ఎడ్జీ బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి. లామినేషన్స్‌ మాత్రం గోల్డెన్‌ ఓక్‌, వాల్‌నట్‌, రస్టిక్‌ ఓక్‌, డార్క్‌ ఓక్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలు..
* కలప కిటికీలు, తలుపుల మాదిరి ఎండావానలకు రంగులు వెలిసిపోతాయనే బాధ ఉండదు.
* అద్దంపైన వర్షం పడితే నీరు లోపలకు రాకుండా రెయిన్‌ ట్రాక్‌ గుండా వెళ్లే ఏర్పాటు ఉంటుంది.
* నైలాన్‌ రోలర్స్‌తో సులువుగా అటూఇటు జరపడం, ముడవడం చేయవచ్చు.
* అధిక వెలుతురు, గాలి ప్రసరణ ఉంటుంది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తుంది.
* శబ్ద కాలుష్యాన్ని నిరోధిస్తుంది. బయటి ధ్వనులు ఇంట్లోకి వినిపించవు.
ఎంపికలో జాగ్రత్తలు
పేరున్న సంస్థలతో పాటూ స్థానిక సంస్థలు పలు బ్రాండ్ల పేరుతో యూపీవీసీ తలుపులు, కిటికీలు తయారు చేస్తున్నాయి. నాణ్యమైన వాటినే ఎంపిక చేసుకోండి.
* నాణ్యతలో రాజీ పడితే వానాకాలంలో వర్షం నీళ్లు కిటికీల నుంచి ఇంట్లోకి చేరే అవకాశం ఉంది. బయటి ధ్వనులు లోపలికి వినిపిస్తాయి. గాజులు మరకలతో అందవికారంగా ఉంటాయి.
* వేర్వేరు రంగుల్లో దొరుకుతున్నా.. తెలుపు రంగే మేలు. ఇంటికి ఏ రంగులు వేయించినా వీటితో ఇబ్బంది అనిపించదు.


వీటికి కరెంట్‌ ఛార్జీలు తగ్గించరూ..

ఈనాడు, హైదరాబాద్‌: గేటెడ్‌ కమ్యూనిటీల్లో సౌకర్యాలకు కొదవ ఉండదు. సకల హంగులతో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మురుగు శుద్ధి కేంద్రాలు, వాననీటి సంరక్షణ, సౌర పలకల ఏర్పాట్లతో పర్యావరణహితంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే వీటి నిర్వహణ భారమై చాలా కమ్యూనిటీల్లో మూన్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి.  వీటిని ఉపయోగించే వారికి విద్యుత్తు ఛార్జీలు, ఇతర పన్నుల రూపంలో కొంతైనా తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటే నిరంతరం కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు అంటున్నాయి.
* మురుగు శుద్ధి కేంద్రాలతో చెట్లకు, ఫ్లషింగ్‌కు నీటి పునర్వినియోగం జరుగుతుంది. పైగా నీరు శుద్ధి చేసి డ్రైన్లలోకి వదులుతారు కాబట్టి కాలుష్యం తగ్గుతుంది. జలమండలి వీటికి ప్రోత్సాహకాలు అందిస్తున్నా మరింత ఎక్కువ మంది వీటివైపు మొగ్గుచూపేలా పెంచాలి.
* కొన్నిచోట్ల కరెంట్‌ బిల్లులకు భయపడి మురుగు శుద్ధి కేంద్రాలను నిర్వహించడం లేదు. వీటి ఛార్జీలు గణనీయంగా తగ్గించాలని స్థిరాస్తి సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. వీటిని పరిశీలించాలి.
* కురిసిన నీటిని వడిసి పట్టేలా వాననీటి ట్యాంకులు ఏర్పాటు, మిగిలిన నీటిని ఇంజెక్షన్‌ వెల్స్‌తో భూమిలోకి ఇంకించే ప్రయత్నం చాలా కమ్యూనిటీలు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గిస్తున్నాయి. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గేలా చూడాలి. అలా చేస్తే మరిన్ని కమ్యూనిటీలు ముందుకొచ్చే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని