మీ ఇంట డిజైనర్‌.. స్నానాల గదులు

డిజైనర్‌ హోమ్స్‌ గురించి విన్నాం. ఇప్పుడు డిజైనర్‌ స్నానాల గదులు అంటున్నారు. ఇళ్లలో ఇదివరకులాగా ఇరుకుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా వీటిని నిర్మించుకుంటున్నారు. టైల్స్‌తో డిజైనింగ్‌ చేయిస్తున్నారు. చూడటానికి బాగా కనిపించడం మాత్రమే కాదు.. గోడలకు...

Published : 03 Jul 2021 01:09 IST

డిజైనర్‌ హోమ్స్‌ గురించి విన్నాం. ఇప్పుడు డిజైనర్‌ స్నానాల గదులు అంటున్నారు. ఇళ్లలో ఇదివరకులాగా ఇరుకుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా వీటిని నిర్మించుకుంటున్నారు. టైల్స్‌తో డిజైనింగ్‌ చేయిస్తున్నారు. చూడటానికి బాగా కనిపించడం మాత్రమే కాదు.. గోడలకు లీకేజీలతో చెమ్మ పట్టకుండా కాపాడుతుంది. ఇందుకోసం ప్రస్తుతం ఎలాంటి టైల్స్‌ ఎక్కువగా వాడుతున్నారంటే..?

సిరామిక్‌ : చౌక ధరలో దొరికే టైల్స్‌లో ఇవి ఒకటి. గోడలకు, గచ్చుకు రెండింటికి వాడుకోవచ్చు. రెండింటికి వేర్వేరు రకాలు దొరుకుతాయి. ఫ్లోరింగ్‌కు వేసేటప్పుడు యాంటీ స్కిడ్‌ టైల్స్‌ను ఎంపిక చేసుకోవాలి.

వినైల్‌ : ఎలాంటి స్నానాల గదులకైనా చక్కగా సరిపోయే టైల్స్‌ ఇవి. ధర పెద్ద ఎక్కువేం కాదు. మన్నిక మాత్రం ఎక్కువే. చూడటానికి బాగుండడంతో పాటు సౌకర్యంగానూ ఉంటాయి. వీటిని బిగించడం సులువే.  ఎలా కావాలంటే అలా కట్‌ చేసుకోవచ్చు.

లైమ్‌ స్టోన్‌ : స్నానాల గది ఫ్లోరింగ్‌కు లైమ్‌ స్టోన్‌ టైల్స్‌ బాగా సరిపోతాయి. ముదురు రంగులో లభిస్తాయి. మరకలు పెద్దగా కనిపించవు కాబట్టి చూడడానికి బాగుంటాయి.  ఎక్కువగా షవర్‌ ఉన్నచోట వాడుతుంటారు.

మార్బుల్‌ : స్నానాల గదుల గోడలకు చూడటానికి మార్బుల్‌గా కనిపించే టైల్స్‌ను వాడుతున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల రంగుల్లో ఇవి దొరుకుతున్నాయి. పైనుంచి కింది వరకు ఒకే రకానికి వాడినా.. మధ్యలో లుక్‌ కోసం కొన్ని డిజైన్లు వాడుతుంటారు. టైల్స్‌ డబ్బాలోనే ఇవి కూడా కలిపి ఇస్తారు. స్నానాల గది విస్తీర్ణాన్ని బట్టి డిజైన్స్‌ ఎంపిక చేసుకోవడం మేలు. వీటి నిర్వహణ తేలిక. నీళ్లతో  అప్పుడప్పుడు కడిగితే శుభ్రంగా మెరుస్తాయి.

మ్యాటి.. : సిమెంట్‌తో తయారయ్యే టైల్స్‌ ఇవి. పెద్దగా మెరుపు ఉండదు. రాతి, చెక్క మాదిరి కనిపిస్తాయి. నీటి మరకలు కనిపించవు.

జాగ్రత్తలు..

* ఏ టైల్‌ ఎంపిక చేసుకున్నా.. ఫ్లోరింగ్‌లో యాంటీ స్కిడ్‌వి వేసుకోవాలి.

* గోడలకు చతురస్రాకారం, ఫ్లోరింగ్‌కు దీర్ఘ చతురస్రాకారంలోని టైల్స్‌ మేలు.

* గోడలకు తేలికపాటి రంగులవి వేస్తే.. ముదురు రంగువి ఫ్లోరింగ్‌కు ఉపయోగించవచ్చు.

* ట్రెండింగ్‌లో ఉన్న రంగుల ఎంపికతో లుక్‌ తాజాగా అనిపిస్తుంది. మార్బుల్‌, ఉడెన్‌ టైల్‌ ఫినిషింగ్‌ ఇప్పటి ట్రెండింగ్‌.

* స్నానాల గదులు చిన్నవిగా ఉంటే తేలికపాటి రంగుల్లో మ్యాటి, యాంటీ స్కిడ్‌ టైల్స్‌ విశాలంగా కనిపించేలా చేస్తాయి.

* బడ్జెట్‌ను బట్టి సిరామిక్‌, వినైల్‌, మ్యాటి, మార్బుల్‌ వరకు ఎంపిక చేసుకోవచ్చు. వీటితో మీ ఇంట డిజైనర్‌ స్నానాల గదులను కట్టించుకోవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని