పెద్దల గది ఏ దిక్కున ఉండాలి?

కొవిడ్‌ వచ్చి ఏడాది దాటిందంతే..ఈలోపే కొత్త ఇంటి నిర్మాణాల్లో చాలా మార్పులు వచ్చాయి.  ఇంటి నుంచి పని చేస్తుండటంతో అందుకు అనుగుణంగా ఒక గదిని కార్యాలయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కొత్తగా కొనేవాళ్లు ఇలాంటి వసతులు ఉన్న ఇళ్లు కావాలని కోరుతున్నారు.

Published : 28 Aug 2021 02:10 IST

ఈనాడు, హైదరాబాద్‌

* కొవిడ్‌ వచ్చి ఏడాది దాటిందంతే..ఈలోపే కొత్త ఇంటి నిర్మాణాల్లో చాలా మార్పులు వచ్చాయి.  ఇంటి నుంచి పని చేస్తుండటంతో అందుకు అనుగుణంగా ఒక గదిని కార్యాలయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కొత్తగా కొనేవాళ్లు ఇలాంటి వసతులు ఉన్న ఇళ్లు కావాలని కోరుతున్నారు.
* ఎన్నో ఏళ్లుగా తమతోనే ఉంటున్న అమ్మానాన్నల కోసం ప్రత్యేకంగా ఒక గది ఉండాలని ఆలోచిస్తున్నవారు తక్కువ మంది ఉన్నారు. మాస్టర్‌ బెడ్‌రూం, పిల్లల పడక గదులు ఉన్నాయి తప్ప పేరెంట్స్‌ బెడ్‌రూం లేదని సీనియర్‌ సిటిజన్లు ఆవేదన చెందుతున్నారు. తమ ఇంట్లోనే పరాయివారం అనే భావనతో ఉంటున్నారు.

జీవితంలో ప్రతి ఒక్కరు సొంతిల్లు కట్టుకోవాలని కలలు కనడం సహజం. కాస్తంత స్థిరపడగానే రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు మొదలెడతారు. ఇంజినీర్‌ దగ్గరకెళ్లి తమ అవసరాలకు అనుగుణంగా కొత్త ఇల్లు ఎలా ఉండాలో దగ్గరుండి మరీ ప్లాన్‌ గీయించుకుంటారు. అందుబాటులో ఉన్న స్థలంలోనే హాలు, వంటగది, పూజగది, పిల్లలకు ఒకటి, తమకో గది, స్నానాల గదులు ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వీటితో పాటూ ఇల్లు కట్టుకునే, కొనుగోలు చేసే గృహ యజమానులు తమ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఒక గది ఉండాలనే విషయాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాది శేషు.

జీవిత కాలం పెరిగింది..

వైద్య సౌకర్యాలు మెరుగవడంతో పదవీ విరమణ తర్వాత కూడా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు పెద్దవాళ్లు జీవిస్తున్నారు. వీరికంటూ ప్రత్యేకంగా గది ఉంటే సౌకర్యంగా ఉండగలుగుతారు. వయసు మీద పడేకొద్దీ ఎక్కువ సమయం గదిలోనే గడుపుతుంటారు కాబట్టి గాలి, వెలుతురు తగినంతగా వచ్చేలా గది కాస్తంత విశాలంగా ఉండాలి. రాత్రిపూట వీరికి నిద్ర సరిగ్గా పట్టదు. ప్రత్యేక గది ఉంటే వచ్చిపోయేవారితో నిద్రకు భంగం కలగకుండా ఉంటుంది.
వాస్తు ప్రకారం..
*  ఇంటి పెద్ద, కుటుంబ భారాన్ని తీసుకుంటున్న ఇంటి యజమానికి నైరుతి మూలగది ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
*  వృద్ధాప్యంలోకి వచ్చి ఓపిక సన్నగిల్లినా, వయసురీత్యా ఆరోగ్యం సహకరించకపోయినా వారు ఇంటి బాధ్యతలను కుమారులకు అప్పగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబంలోని పెద్దవారికి నైరుతి గదికి పక్కన పడమర దిక్కులో గానీ, దక్షిణ దిక్కులోగానీ పడక గది ఉండటం సౌకర్యంగా, శాస్త్రరీత్యా బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని