నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలి 

అత్యధికమందికి ఉపాధినివ్వడమే గాక ప్రభుత్వానికి ఏటా 5 శాతం పైగా ఆదాయం సమకూరుస్తోంది ‘స్థిరాస్తి’ రంగం. గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు బిల్డర్లు. నిర్మాణ రంగంలో పాతవి పరిష్కరించేకొద్దీ కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయని ఏకరవు పెడుతున్నారు.

Published : 06 Apr 2019 02:49 IST

ప్రభుత్వానికి టీబీఎఫ్‌ ప్రతినిధుల వినతి 
ఈనాడు, హైదరాబాద్‌

అత్యధికమందికి ఉపాధినివ్వడమే గాక ప్రభుత్వానికి ఏటా 5 శాతం పైగా ఆదాయం సమకూరుస్తోంది ‘స్థిరాస్తి’ రంగం. గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు బిల్డర్లు. నిర్మాణ రంగంలో పాతవి పరిష్కరించేకొద్దీ కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయని ఏకరవు పెడుతున్నారు. పాత డిమాండ్లు కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పరిశ్రమ హోదా ఇవ్వాలని ఎంతోకాలంగా స్తిరాస్థి సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ బిల్డర్ల సమాఖ్య(టీబీఎఫ్‌) ప్రతినిధులు తమ సమస్యలను తాజాగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

‘రెరా’ దరఖాస్తుల ఆమోదంలో జాప్యం 
- సి.ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, టీబీఎఫ్‌

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లేమి నిర్మాణదారులకు ఇబ్బందిగా మారింది. ఏదైనా ఒక సర్వే నెంబరులో వంద ఎకరాలు ఉంటే.. అందులో ఒకటి రెండు ఎకరాల్లో భూదాన్‌ భూములు ఉంటే మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నారు. వీటి ప్రక్షాళన చేపట్టాలి. 
అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నపుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే జీహెచ్‌ఎంసీ అతి జాగ్రత్తతో నిర్మాణాలను ఆపేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తే మేలు. 
రెరాలో దరఖాస్తు చేసుకుంటే నెలరోజుల్లో ఆమోదించాలి. లేదంటే ఆమోదం పొందినట్లే. రెండు నెలలైనా పెండింగ్‌లో ఉంటున్నాయి. గడువు లోపల చర్యలు తీసుకోవాలి. 
రెరా వచ్చింది కాబట్టి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో 10 శాతం మార్ట్‌గేజ్‌ నిబంధనలను తొలగించాలి. నిర్మాణదారులకు వచ్చే లాభం ఆ 10 శాతమే. 
హెచ్‌ఎండీఏకు కమిషనర్‌ లేకపోవడంతో లేఅవుట్‌, భవన అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. 
బీఆర్‌ఎస్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా మున్సిపల్‌ అధికారులు అక్రమ భవనాలని చెప్పి జరిమానా వసూలు చేస్తున్నారు. పరిష్కారం అయ్యేవరకు జరిమానా వేయొద్దు.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి 
- సి.ప్రేంకుమార్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, టీబీఎఫ్‌

నగరంలో రాతి నేల కావడంతో సెల్లార్‌ తవ్వకం ఇబ్బందిగా మారింది. చుట్టుపక్కల ఇంటి యజమానులు అభ్యంతర పెడుతున్నారు. సాధారణంగా ఒక సెల్లార్‌, ఒక స్టిల్ట్‌, ఐదు అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటారు. రెండు స్టిల్ట్‌ల వరకు అనుమతి ఇచ్చి అగ్నిమాపక శాఖ అనుమతుల నుంచి వెసులుబాటు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. దీంతో సెల్లార్‌లో తవ్విన మట్టిని రహదారి పక్కన, చెరువులో వేసి పూడ్చడం వంటి ఇబ్బందులు తప్పుతాయి. 
ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివాటికి 14 శాతం ఫీజుతో అనుమతులు మంజూరుచేసేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలి. 
టీడీఆర్‌ జోనల్‌ స్థాయిలో ఇస్తే ప్రధాన కార్యాలయానికి తిరగాల్సిన తిప్పలు తప్పుతాయి. 
పర్యావరణ అనుమతులు పీసీబీలో ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. కమిటీ వేసి పరిష్కరించాలి. 
అందుబాటు ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి.

ఎన్‌వోసీలు ఆలస్యం 
- జె.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీబీఎఫ్‌

కాలుష్య కారక పరిశ్రమలు బాహ్యవలయ రహదారి బయటికి తరలనున్న నేపథ్యంలో మాస్టర్‌ప్లాన్‌లో పరిశ్రమల జోన్‌కు అర్థమే లేదు. బహుళ వినియోగ జోన్‌ చేయాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. 100 అడుగులపైన ఉన్న రహదారుల్లో వాణిజ్య నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి. 
మాస్టర్‌ప్లాన్‌లో రహదారులు ఇళ్లు, కాలనీల మీదుగా వెళుతున్నాయి. వీటిని చూపి అనుమతులు నిరాకరిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ లోపాలను సరిచేయాలి. 
బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) పక్కనే స్థలాలు ఉన్నా సర్వీస్‌ రోడ్లకు అనుసంధానం లేవు. టీడీఆర్‌ ఇస్తే స్లిప్‌రోడ్‌కు స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇరువురికీ ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ఐదేళ్లలో ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌ చుట్టూ అభివృద్ధి చెందుతుంది. 
యాదాద్రి మాస్టర్‌ప్లాన్‌ పెండింగ్‌లో ఉంది. త్వరగా అమల్లోకి తెస్తే మేలు. 
నిర్మాణ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి. పరిశ్రమలకు టీ-ఐపాస్‌లో అనుమతులు సత్వరం జారీ చేస్తున్న మాదిరి స్థిరాస్తి రంగానికి వర్తింపజేయాలి. 
నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీకి ఆరునెలలు పడుతోంది. వీఆర్‌ఓ, సర్వేయర్‌, తహసిల్దార్‌, ఆర్‌డీఓ, సంయుక్త కలెక్టర్‌, కలెక్టర్‌, సాగునీటి శాఖ ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు తిరగాల్సి వస్తోంది. ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో తెలియని పరిస్థితి. కలెక్టర్లు సమావేశం పెడితే సరి.. లేదంటే అంతే. తీవ్ర జాప్యం జరుగుతోంది. 
భూములను జియో ట్యాగింగ్‌ చేయాలి. చెరువులు, అడవులు, బఫర్‌జోన్‌ జియో ట్యాగింగ్‌తో ఎన్‌వోసీ సులభతరమవుతుంది. 
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ అనుమతి ఉన్న వెంచర్లు, నిర్మాణాల వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖ చూసుకునే వెసులుబాటు ఇవ్వాలి. వీటికి మాత్రమే రిజిస్టర్‌ చేస్తే ప్రణాళికతో కూడిన అభివృద్ధి సాధ్యమవుతుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు