IT PARK: ఐటీ పార్క్‌తో ఉత్తరానికి ఊపు

నగరానికి ఉత్తరం వైపు సైతం రియల్‌ఎస్టేట్‌ ఊపందుకోనుంది. కండ్లకోయలో ‘గేట్‌వే ఆఫ్‌ ఐటీ పార్క్‌’ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ తాజాగా భూమిపూజ చేయడంతో అందరి దృష్టి ఇప్పుడు ఇటువైపు పడింది. హైదరాబాద్‌

Updated : 19 Feb 2022 06:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి ఉత్తరం వైపు సైతం రియల్‌ఎస్టేట్‌ ఊపందుకోనుంది. కండ్లకోయలో ‘గేట్‌వే ఆఫ్‌ ఐటీ పార్క్‌’ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ తాజాగా భూమిపూజ చేయడంతో అందరి దృష్టి ఇప్పుడు ఇటువైపు పడింది. హైదరాబాద్‌ మార్కెట్‌ ఇప్పటివరకు ఎక్కువగా పశ్చిమం వైపు విస్తరిస్తూ వస్తోంది. అన్నిప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీలో భాగంగా ఉత్తరం దిశలోనూ ఐటీ కంపెనీల రాకను ప్రోత్సాహించేందుకు కొత్తగా ఐటీ పార్క్‌ నిర్మిస్తోంది. దీంతో మాదాపూర్‌ మాదిరి భవిష్యత్తులో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని అంచనా వేస్తున్నారు.

సుమారు పాతికేళ్ల క్రితం మాదాపూర్‌లో సైబర్‌టవర్స్‌కు పునాది పడింది. ఆనక ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌, ఇప్పుడు కోకాపేట వరకు ఐటీ కార్యాలయాలు, గృహనిర్మాణాలతో ఐటీ కారిడార్‌ విస్తరించింది. ఏటా నూతన కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరగుతున్నాయి. వీటి ప్రభావం చుట్టుపక్కల 20 కి.మీ. వరకు ఉంది. ఈ రెండు దశాబ్దాల్లో అక్కడ భూములు, స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసినవారు అధికంగా లబ్ధి పొందారు. ఇదే మాదిరి కండ్లకోయ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రియల్టర్లు అంటున్నారు. దీని ప్రభావం కొంపల్లి నుంచి మొదలై కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, తూఫ్రాన్‌ వరకు ఉంటుందని చెబుతున్నారు.

భారీగా ఉపాధి అవకాశాలు..

గేట్‌ వే ఆఫ్‌ ఐటీ పార్క్‌ పూర్తైతే 6 లక్షల చ.అ. కార్యాలయాల స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇందులో 100 కంపెనీల వరకు కొలువుదీరొచ్చని, 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుత ఐటీ కారిడార్‌లో కార్యాలయాల అద్దెలు పెరగడంతో చిన్నస్థాయి కంపెనీలు మేడ్చల్‌ వైపు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తులో పెద్ద కంపెనీలూ తమ సొంత క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. పెద్దఎత్తున ఖాళీ భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతం ఫార్మాకు కేంద్రంగా ఉంది. పచ్చదనం అధికంగా ఉండటంతో ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలనుకునేవారు ఇన్నాళ్లు ఇక్కడి ఇళ్లను కొనుగోలు చేశారు. ఐటీతో పాటూ మిగతావర్గాలకు ఇప్పుడీ ప్రాంతం ఆకర్షణీయంగా మారింది. పేరున్న విద్యాసంస్థలు, వైద్యసదుపాయాలు చేరువలో ఉండడమే కాదు రిసార్టుల వంటి వినోదానికీ కొదవ లేదు. సోషల్‌ ఇన్‌ఫ్రా మిగతా ప్రాంతాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది.

అనుకూలతలు ఎన్నో...

* ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ సైతం అందుబాటులోకి రాబోతుంది. నూతన ఐటీ పార్క్‌ చేరువలో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్‌ ఉంది. దీన్ని దాటుకుని మేడ్చల్‌ వరకు త్వరలోనే ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ట్రాక్‌ సిద్ధమైంది.

* అవుటర్‌ రింగ్‌ రోడ్డు అనుసంధానంతో ఇక్కడి నుంచి గంటలోపే గచ్చిబౌలికి చేరుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇప్పటికే కొందరు ఐటీ ఉద్యోగులు స్థానికంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఐటీ కంపెనీలూ తరలివస్తే పశ్చిమ హైదరాబాద్‌పై కొంత భారం తగ్గుతుంది. స్థానికంగానే ఉద్యోగాలు చేసుకోవచ్చు.

ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలతో ఇప్పటికే ఉత్తర హైదరాబాద్‌లో రియల్‌ మార్కెట్‌ ఊపందుకుంది. తూఫ్రాన్‌ దాటి రియల్‌ ఎస్టేట్‌ పరుగులు తీస్తోంది. దీనికి కండ్లకోయ వద్ద ఐటీ పార్కు తోడవడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలు పెరగనున్నాయి.

మరో హైటెక్‌సిటీ అవుతుంది..

కండ్లకోయలో ఐటీ పార్క్‌ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతం మరో హైటెక్‌సిటీ అవుతుంది. వంద నుంచి 120 చిన్న కంపెనీలు పనిచేసేందుకు వీలుగా గేట్‌వే ఆఫ్‌ ఐటీ పార్క్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటూ దేశ, విదేశాల నుంచి కంపెనీలు ఏర్పాటు చేస్తామని సంబంధిత ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. రెండు మూడేళ్లలో ఐదు వందల కంపెనీలకు ఈ ప్రాంతం విస్తరిస్తుంది. కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడి ఐటీ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ కంపెనీల్లోనూ పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపిస్తారు. ఐటీ కంపెనీలకు మానవవనరులు కీలకం. ఈ ప్రాంతంలో లక్ష మంది గ్రాడ్యుయేట్లు అందుబాటులో ఉన్నా.. మాదాపూర్‌ వెళుతున్నారు. ఐటీ పార్క్‌ ఉండి మంచి పనివాతావరణం ఉంటే వారంతా ఇక్కడే పనిచేస్తారు. ఏదైనా ప్రాంతంలో ఒకటి రెండు పెద్ద కంపెనీల కంటే చిన్న కంపెనీలు ఉంటే వృద్ధికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఐటీ పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరో హైటెక్‌సిటీ ఎందుకంటున్నాం అంటే ఇక్కడ సోషల్‌ ఇన్‌ఫ్రా మెరుగ్గా ఉంది. రాబోయేరోజుల్లో హోటల్స్‌, రెస్టారెంట్లు, ఆసుపత్రులు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది.

- ఓరుగంటి వెంకట్‌, అధ్యక్షుడు, కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని