చినుకుల్లో ఇంటి బేరాలు!

ఇల్లు, స్థలం కొనేందుకు వానాకాలంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపరు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సైతం ప్రాజెక్ట్‌ సందర్శించాలని అంతగా ఒత్తిడి చేయవు. కానీ కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు రూపురేఖలు తెలియాలంటే.. వాస్తవ పరిస్థితి అర్థం కావాలంటే వానాకాలంలో వెళ్లి చూడటమే సరైందని నిపుణులు సూచిస్తున్నారు

Published : 09 Jul 2022 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇల్లు, స్థలం కొనేందుకు వానాకాలంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపరు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సైతం ప్రాజెక్ట్‌ సందర్శించాలని అంతగా ఒత్తిడి చేయవు. కానీ కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు రూపురేఖలు తెలియాలంటే.. వాస్తవ పరిస్థితి అర్థం కావాలంటే వానాకాలంలో వెళ్లి చూడటమే సరైందని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ఇంటిలో నిర్మాణ లోపాలేమైనా ఉన్నా.. వర్షానికి ఎక్కడైనా కారుతున్నా తెలిసిపోతుంది. తద్వారా నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఒక నిర్ణయానికి రావొచ్చు అంటున్నారు. వానాకాలంలో సహజంగా విక్రయాలు తక్కువగా ఉంటాయి. దీంతో బిల్డర్‌తో ఎక్కువగా బేరమాడేందుకు అవకాశం ఉంటుందని చెబుతుంటారు.
* కొనబోయే స్థలాన్ని వానాకాలంలో చూడటం ద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
* కొంతమంది రియల్టర్లు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చాలా వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. ఇటువంటి భూముల్లో కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముంపు తప్పదు. ఇప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో కొనవద్దని అధికారులు సూచిస్తున్నారు.
* అనుమతి లేని ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే.. ముఖ్యంగా చెరువులు, నాలాల పక్కన ఆక్రమించి కట్టిన వాటిలో భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. నగరంలో వానాకాలంలో రోజుల తరబడి నీటిలో ఉంటున్న కాలనీలు, నివాసితుల గోస ఏటా చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రాంతంలో కొంటే ఆస్తుల విలువ కూడా పడిపోతుందని నగర అనుభవాలు చెబుతున్నాయి.
* మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువకే ఎవరైనా విక్రయిస్తున్నారంటే అనుమానించాలి. అన్నీ సక్రమంగా ఉంటే ప్రయోజనమే. కానీ ఎక్కువశాతం పక్కా అనుమతులు లేకపోవడం... నిబంధనల అతిక్రమణ.. ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిల్లో కట్టి అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. వీటితో జాగ్రత్త.
* సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో అక్కడి రహదారులు ఎలా ఉన్నాయో.. రవాణా సదుపాయల పరిస్థితి సైతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇలాంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా? లేదా? సిద్ధంగా ఉన్న నివాసాలు కొనడమా? నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు.
* లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నట్లయితే వరద ముప్పు లేకుండా పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లను.. అపార్ట్‌మెంట్‌లలో అయితే సెల్లార్‌ లేని వాటిని కొనుగోలు చేయడం మేలు. పార్కింగ్‌ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌ వదిలిన, నిబంధనలు పాటించిన వాటిలో కొనుగోలు చేయడం ఉత్తమం.
* రహదారులు సరిగ్గా లేవని గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించవద్దు. ప్రాజెక్ట్‌ పూర్తయ్యేనాటికి ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనాకు రావాలి. అవగాహన ఉన్నవారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
బేరమాడవచ్చు..
*  వానాకాలంలో కొద్దినెలల పాటు విక్రయాలు మందకొడిగా సాగుతుంటాయి. ఈ సమయంలో కొనుగోలుదారులు బిల్డర్‌తో ఎక్కువగా బేరమాడే అవకాశం ఉంటుంది. వచ్చే కొద్ది మంది వినియోగదారులను చేజార్చుకోకూడదనే నిర్మాణ సంస్థలు చూస్తుంటాయి. నిజంగా కొనే ఆసక్తి ఉందా లేదా చూసి ధరలు తగ్గిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని