అంతిమ సంస్కారం ఎక్కడ నిర్వహించాలి?

కష్టార్జితంతో కూడబెట్టిన సంపాదనతో పాటూ గృహరుణాలు తీసుకుని లక్షలు, కోట్ల రూపాయలు పోసి కొన్న ఇంట్లో.. తమవారికి అంతిమ సంస్కారాలు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తే.. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా! ఇలాంటి

Updated : 13 Aug 2022 05:56 IST

ఈనాడు, హైదరాబాద్‌ 

కష్టార్జితంతో కూడబెట్టిన సంపాదనతో పాటూ గృహరుణాలు తీసుకుని లక్షలు, కోట్ల రూపాయలు పోసి కొన్న ఇంట్లో.. తమవారికి అంతిమ సంస్కారాలు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తే.. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా! ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీ నివాసాల్లో ప్రత్యేకంగా ఫ్యునరల్‌ సెర్మనీ హాల్స్‌ నిర్మిస్తున్నారు. మన దగ్గర కమ్యూనిటీల్లో సకల సౌకర్యాలూ ఉంటున్నా... ఇదొక్క లోటు ముఖ్యంగా పెద్దలను వేదనకు గురిచేస్తోంది.  వీటిని కమ్యూనిటీల్లో నిర్మించవచ్చా? ఎక్కడ కడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది? వాస్తు ఏం చెబుతుంది? అనే విషయాలను వివరిస్తున్నారు ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాదిశేషు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోయినా.. ప్రమాదవశాత్తూ ఆకాల మరణం చెందినా.. వృద్ధాప్యంతో సహజ మరణమైనా.. పార్ధివదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించడం మన ఆచారం.  ఇంటి గేటు బయటనే ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటారు. నగరంలో ఎక్కువ కుటుంబాలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నాయి. వీరి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఈ సంస్కారాల నిర్వహణకు వారు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు.  ఏదో ఒకరోజు అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం ఒక్కో కమ్యూనిటీలో తక్కువలో తక్కువ వంద మంది నుంచి నాలుగువేల మంది వరకు నివసిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొన్నింట పదివేల వరకు నివసించబోతున్నారు. ప్రత్యేకంగా ఫ్యునరల్‌ సెర్మనీ హాల్స్‌ నిర్మాణంతో ఇలాంటి కష్టాల నుంచి బయటపడవచ్చు.

ఎటు వైపు ఉండాలి? 

ప్రస్తుతం ఇళ్లు చాలావరకు వాస్తు ప్రకారమే కడుతున్నారు. బిల్డర్లు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం దిక్కులలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలిపెడుతున్నారు. సహజంగానే కమ్యూనిటీలో నివసించే వారి రాకపోకలు ఈ దిక్కులలో ఎక్కువగా ఉంటాయి. అంతిమ సంస్కారాలు నిర్వహించే హాల్‌కు పడమర, దక్షిణ దిక్కులు అనుకూలంగా ఉంటాయి. పడమర వాయువ్యంలోనూ నిర్మించొచ్చు.

* చివరి చూపు చూసేందుకు, సంతాపం తెలిపేందుకు వచ్చిపోయే వారితో ఇబ్బంది లేకుండా కాస్తంత చాటుగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం చుట్టూ చెట్లను పెంచడం మేలు. పచ్చదనంతో తాజా గాలి వస్తుంది. ఇతరులకు అసౌకర్యం కల్గకుండా ఉంటుంది.

* చనిపోయిన వారి భౌతికకాయం ఉంచేందుకు హాల్‌లో ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫాంను నిర్మించవచ్చు. మూడు అడుగుల ఎత్తు, మూడున్నర అడుగుల వెడల్పు, ఆరు నుంచి ఏడు అడుగుల పొడవు ఉండేలా చూసుకోవాలి. దక్షిణ, ఉత్తర దిక్కులకు ఉండాలి.

* హాల్‌లోకి రాకపోకలకు కనీసం రెండు గుమ్మాలు అవసరం. అవి ఉత్తరం దక్షిణం వైపులకు ఉండాలి. వాస్తు ప్రకారం దక్షిణం యమస్థానం.  కాబట్టి  ఈ దిశలో గుమ్మం తప్పనిసరి. కిటికీలు అన్ని దిక్కుల్లో ఏర్పాటుతో, గాలి, వెలుతురు వచ్చే వీలుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని