ఇంటికి వేసవివి హుషారు

నగరంలో గృహ కొనుగోళ్లు అధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో నమోదవుతున్నాయి. మొత్తం 5877 అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లలో మేడ్చల్‌ జిల్లా వాటానే 45 శాతంగా ఉంది.

Published : 10 Jun 2023 00:14 IST

మే నెలలోపెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

నగరంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏప్రిల్‌ మాసంలో తగ్గినా..మే నెలలో తిరిగి పుంజుకోవడంతో స్థిరాస్తి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. మండుటెండల్లోనూ భారీగా పెరగడం మార్కెట్‌కు హుషారునిచ్చింది. క్రితం నెలలో 5877 అపార్ట్‌మెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే 31 శాతం అధికం. గత ఏడాది మే నెలతో పోలిస్తే మాత్రం 7 శాతం తక్కువే. నెలలో రిజిస్టర్‌ అయిన స్థిరాస్తుల విలువ రూ.2,994 కోట్లు అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఈనాడు-హైదరాబాద్‌


మేడ్చల్‌లో అధికంగా..

* నగరంలో గృహ కొనుగోళ్లు అధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో నమోదవుతున్నాయి. మొత్తం 5877 అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లలో మేడ్చల్‌ జిల్లా వాటానే 45 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో 39 శాతంతో రంగారెడ్డి ఉంది.
* హైదరాబాద్‌లో మే నెలలో రిజిస్ట్రేషన్లు 11 నుంచి 16 శాతానికి పెరిగాయి.


70 శాతం వాటిలోనే...

* ఇళ్ల ధరలు పెరిగినా.. విస్తీర్ణంలో మాత్రం సిటీవాసులు రాజీపడటం లేదు. మొత్తం రిజిస్టర్‌ అయిన స్థిరాస్తుల్లో 70 శాతం వరకు వెయ్యి నుంచి రెండువేల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లే ఉన్నాయి. గత ఏడాది వీటి వాటా 73 శాతంగా ఉంటే ఈసారి స్వల్పంగా తగ్గింది.
* వెయ్యిలోపు చదరపు అడుగుల విస్తీర్ణంలో కొన్నవారి వాటా 16 శాతంగా ఉంది. రెండువేల నుంచి మూడువేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు కొన్నవారు 8 శాతం ఉంటే.. మూడువేల చ.అ.పైన విస్తీర్ణం కలిగిన ఇళ్ల వాటా 2 శాతంగా ఉంది.
* 500 చదరపు అడుగుల లోపు కట్టే నిర్మాణాలే తక్కువ. వీటిని కొనేవారి శాతమూ స్వల్పమే. మొత్తంగా వీరు 3 శాతంగా ఉన్నారు.


ఏ బడ్జెట్‌లో కొంటున్నారు..

* ఇళ్ల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.25 లక్షలు-రూ.50లక్షల మధ్య ఉన్న ఆవాసాలను మే నెలలో కొన్నవారు 55 శాతంగా ఉన్నారు.   ః రూ.25 లక్షల లోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు 17 శాతం జరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గాయి. ః రూ.50 లక్షలు-రూ.75లక్షల మధ్య ధరలున్న ఇళ్లు కొన్నవారు 13 శాతంగా ఉన్నారు.  ః రూ.75లక్షలు-కోటి ధరల్లో ఉన్న ఇళ్లను కొన్నవారి శాతం 7 శాతంగా ఉంది. * రూ.కోటి నుంచి రెండుకోట్ల మధ్య ధరల్లో ఉన్న ఇళ్లను కొన్నవారి శాతం 5 నుంచి 7 శాతానికి పెరిగింది. రూ.రెండుకోట్ల పైన ఉన్న ఇళ్ల రిజిస్టేషన్లు సైతం ఒకటి నుంచి రెండుశాతానికి పెరిగాయి.


ఫ్లాటకు ఇంత ధరలా !

* రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను పరిశీలిస్తే మే నెలలో అతిపెద్ద లావాదేవీలుగా ఐదు నమోదు అయ్యాయి. ఇవన్నీ కూడా 3వేల చదరపు అడుగులపైన కల్గిన ఫ్లాట్ల కొనుగోళ్లే. ఏడువేల నుంచి 11వేల మధ్య చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు సైతం ఇందులో ఉన్నాయి.
* పుప్పాలగూడలో రిజిస్టర్‌ అయిన ఒక ఫ్లాట్‌ విలువ రూ.6.82 కోట్లుగా ఉంది.
*కూకట్‌పల్లిలో ఒక్కోటి రూ.4.50 కోట్లతో రెండు ఫ్లాట్లు రిజిస్టర్‌ అయ్యాయి.
* సోమాజిగూడలో రిజిస్టర్‌ అయిన ఫ్లాట్‌ విలువ రూ.4.22 కోట్లుగా ఉంది. ఇవన్నీ రిజిస్ట్రేషన్‌ విలువలే. మార్కెట్‌ విలువ ఇంకా ఎక్కువే ఉంటుంది.


హైదరాబాద్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్టులు, క్రయ, విక్రయాలన్నీ శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని