ఆకాశాన్ని అందుకునేలా నిర్మాణాలు

తొమ్మిదేళ్ల క్రితం.. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. ఆ సమయంలో ఎన్నో అనుమానాలు... రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందనే ప్రచారమూ జరిగింది.

Published : 17 Jun 2023 00:45 IST

దశాబ్దికాలంలో దశదిశలా విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల క్రితం.. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. ఆ సమయంలో ఎన్నో అనుమానాలు... రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందనే ప్రచారమూ జరిగింది. వీటన్నింటినీ పటాపంచాలు చేస్తూ రెండో ఏడాది నుంచే భాగ్యనగర స్థిరాస్తి రంగం పరుగులు తీయడం మొదలెట్టింది. మధ్యలో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌ వంటి ఆటంకాలు ఎదురైనా అధగమించి.. సవాళ్లను తట్టుకుంటూ మరింత వృద్ధిని నమోదు చేసింది. వార్షికంగా వ్యవస్థీకృత రంగంలో ఇళ్ల యూనిట్ల సంఖ్య 25 వేల నుంచి 50 వేలు దాటి లక్ష దిశగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆకాశమే హద్దుగా ఆకాశహర్మ్యాలు 58 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఆఫీసు స్పేస్‌లో ఒక ఏడాది బెంగళూరు నగరాన్ని అధిగమించింది. ఐటీ కారిడార్‌లో దశాబ్దకాలంలో వచ్చిన కార్యాలయాల భవనాలతో విదేశాలను తలపిస్తోంది. సిటీ విస్తరణ అవుటర్‌ దాటి ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరించింది. దశాబ్ది ఉత్సవాల వేళ దశదిశలా హైదరాబాద్‌పై ప్రత్యేక కథనం.

సహజసిద్ధంగా హైదరాబాద్‌కు అనుకూలంగా ఉన్న భౌగోళిక పరిస్థితులకు తోడు.. ఐటీ, ఫార్మారంగాల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరగడం, కొత్త పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి సదుపాయాలతో వ్యవసాయ రంగ ఉత్పత్తులు పెరగడం, మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు, స్థిరమైన ప్రభుత్వం, పరిశ్రమ అనుకూల సర్కారు నిర్ణయాలతో దశాబ్దకాలంగా స్థిరాస్తి రంగం అప్రహతిహతంగా దూసుకెళ్తోంది.

ఏ గ్రేడ్‌ స్పేస్‌

ఐటీ కార్యాలయాల విస్తరణతో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా గ్రేడ్‌ ఏ కార్యాలయాల నిర్మాణాలు సిటీలో ఊపందుకున్నాయి. కొవిడ్‌కు ముందు ఒకే ఏడాదిలో కోటి చదరపు అడుగులకు పైగా లీజింగ్‌ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ తొమ్మిదేళ్లలో కార్యాలయాల నిర్మాణాల్లో మార్పులు వచ్చాయి. అంతకుముందు ఎక్కువగా ఐదు అంతస్తుల భవనాలు.. కొన్ని పది అంతస్తుల వరకు ఉండేవి. ఇప్పుడు చూస్తే కార్యాలయాల భవనాలను 30 అంతస్తుల పైన కడుతున్నారు. పుప్పాలగూడలో ఒక సంస్థ 42 అంతస్తుల్లో నిర్మిస్తోంది. రాయదుర్గం నాలెడ్జి సిటీ చూస్తే విదేశాల్లో ఉన్నామా అనే భావన కలిగేలా అద్దాల మేడల్లో ఐటీ కార్యాలయాలు కొలువుదీరాయి. వీటికి పెరిగిన డిమాండ్‌తో స్థానిక రియల్‌ ఎస్టేట్‌ పెద్ద కంపెనీలు సైతం వాణిజ్య, కార్యాలయాల భవనాలను భాగస్వాములతో కలిసి నిర్మించడం మొదలెట్టాయి. కోకాపేటలో మరింత ఎత్తులో భవనాలను వీరు నిర్మిస్తున్నారు.

ఏటా లక్ష

ఐటీ, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలతో గృహ నిర్మాణాలకు డిమాండ్‌ పెరిగింది. ఇదివరకు హైదరాబాద్‌ మార్కెట్లో ఏడాదిలో పాతికవేల యూనిట్లను నిర్మించి, విక్రయిస్తే గొప్పగా ఉండేది. అలాంటిది ఇటీవల కాలంలో వార్షిక యూనిట్ల సంఖ్య 50వేలను దాటింది. లక్ష దాకా వెళుతోందని.. అంత డిమాండ్‌ సైతం భవిష్యత్తులో ఉంటుందని.. కట్టే సామర్థ్యం పరిశ్రమకు ఉందని క్రెడాయ్‌ వర్గాలు తెలిపాయి.

విస్తరించింది

దశాబ్దకాలంలో సిటీ నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నగరం ఐటీ కారిడార్‌ ఉండే పశ్చిమం వైపు మాత్రమే కాకుండా అన్నివైపులా విస్తరించింది. ఇప్పుడు ఎల్బీనగర్‌, ఉప్పల్‌, శంషాబాద్‌,  బొల్లారం ప్రాంతాల్లోనూ ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రిడ్‌ పాలసీతో అన్నివైపులా ఐటీ పార్కుల ప్రతిపాదనలతోనూ గృహ నిర్మాణం  విస్తరించింది. నివాసాలు ప్రస్తుతం అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాయి. మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మినహా సిటీ అవుటర్‌దాకా చేరింది. భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతీయ వలయ రహదారి నిర్మిస్తుండటంతో వాటి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ ప్లాటింగ్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. సిటీ అన్నివైపులా 50 కి.మీ. దూరం సైతం దగ్గరే అనేంతగా రహదారి అనుసంధానం పెరగడం కూడా మార్కెట్‌కు కలిసి వచ్చింది.

గేటెడ్‌ పెరిగింది

తొమ్మిదేళ్లలో నిర్మాణ పరంగా గేటెడ్‌ సంస్కృతి బాగా పెరిగింది. సిటీ నలువైపులా బిల్డర్లు సకల సౌకర్యాలతో కమ్యూనిటీలను అభివృద్ధి చేశారు. వీటికి కొనుగోలుదారుల నుంచీ మంచి ఆదరణ లభించింది.
* కొవిడ్‌ తర్వాత సొంతింటి ప్రాధాన్యత గుర్తించడం, ఇంటి నుంచి పనిచేయడం వంటి కారణాలతో పెద్ద ఇళ్ల వైపు మొగ్గు పెరిగింది. విల్లా ప్రాజెక్టులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఫామ్‌ల్యాండ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.
* ఆకాశహర్మ్యాలు పెరిగాయి. 30 నుంచి 58 అంతస్తుల పైన కట్టిన, కడుతున్న 93 ప్రాజెక్టుల్లో ఐదారు తప్ప మిగతావన్నీ గత తొమ్మిదేళ్లలో వచ్చినవే కావడం విశేషం.
* అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ కారణంగా హైదరాబాద్‌ నగరం దేశ, విదేశీ నిర్మాణ సంస్థలకు ఆకర్షణగా మారింది.

మున్ముందు మరింతగా

హైదరాబాద్‌ వృద్ధికి మరో పదేళ్ల పాటు ఢోకా లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. విద్యుత్తు, తాగునీటి సమస్య లేని ఏకైక మెట్రో నగరమని... విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ, సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదనలు, కొత్త రహదారుల వంటి మౌలిక వసతులతో  సిటీ మరింతగా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని.. మరికొంతకాలం ఇది కొనసాగుతుందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా ఎన్నికల తర్వాత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేసేవారు వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చని చెబుతున్నారు.


ఐటీతో పాటే

2014లో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 3.23 లక్షలు ఉండగా... తొమ్మిదేళ్లలో 9.05 లక్షలకు పెరిగారు. 2022-23లోనే కొత్తగా 1.26 లక్షల మందికి ఉపాధి లభించింది. పలు బహుళ జాతీ సంస్థలు తమ ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుండటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఈ తొమ్మిదేళ్లలోనే మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌తో పాటూ మరిన్ని సంస్థలు వారి హెడ్‌క్వార్టర్స్‌ తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. మరిన్ని సంస్థలు సిటీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిలో పాటూ ఫార్మా సంస్థల విస్తరణ, ఏరో స్పేస్‌, డిఫెన్స్‌, డాటా సెంటర్లు, లాజిస్టిక్స్‌ వరకు ఇప్పటికే పెద్ద ఎత్తున సిటీలో ఏర్పాటయ్యాయి. మరిన్ని విస్తరణ బాటలో ఉన్నాయి. వీటి రాకతో ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగయ్యాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.


అప్పుడు ధరలు ఎలా ఉన్నాయ్‌

2014 ప్రాంతంలో గచ్చిబౌలిలో సగటు చదరపు అడుగు రూ.3600 ఉండేది. ఇప్పుడు వాటి చుట్టుపక్కల రూ.8వేల వరకు చెబుతున్నారు. బంజరాహిల్స్‌లో రూ.6300 వరకు ఉంటే.... ఇప్పుడు రూ.15వేల నుంచి 20వేలుకు చేరింది. ఎల్బీనగర్‌లో రూ.2800 ఉండేది.. ఇప్పుడు రూ.6వేలు చెబుతున్నారు. నార్సింగిలో రూ.2500కే ఇచ్చారు. ఇప్పుడీ ధరల్లో అవుటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర కూడా రావడం లేదు. అక్కడ సైతం నాలుగువేల దాకా చెబుతున్నారు. స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లలో రూ.3300 నుంచి రూ.3500 వరకు దొరుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని