ధరణి సమస్యలు పరిష్కరించరూ!

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి 4 నెలలు అవుతున్నా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో స్థిరాస్తి పరిశ్రమ ఇబ్బందులు...

Published : 27 Feb 2021 02:06 IST

క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు సీహెచ్‌ రాంచంద్రారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి 4 నెలలు అవుతున్నా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండటంతో స్థిరాస్తి పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో లోటుపాట్లను వెంటనే సరిచేయాలని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు  సీహెచ్‌ రాంచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన తమ దృష్టికి వచ్చిన సమస్యలు, ఏంచేస్తే సేవలు మరింత పారదర్శకంగా అందుతాయో ‘ఈనాడు’కు వివరించారు.
ధరణిలో ప్రస్తుతానికి సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, పార్టీషన్‌ డీడ్‌, మార్ట్‌గేజ్‌ డీడ్‌ మాత్రమే చేస్తున్నారు. బిల్డర్లు భూ యాజమాని నుంచి స్థలాన్ని డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(డీఏ జీపీఏ) చేసుకునేందుకు అవకాశం లేదు.
ఒక సర్వే నంబరులో 20 ఎకరాలు ఉండి.. అందులో 5 ఎకరాలు ఇదివరకు ప్లాటింగ్‌ చేసి ఉంటే.. ఆ సర్వే నంబరు మొత్తం ధరణిలో నమోదు చేయక, సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయేతర భూమిగా మార్చుకొనేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) ఛార్జీలు చెల్లిద్దామంటే ధరణిలో లేకపోవడంతో వారు తీసుకోవడం లేదు. నాలా ఛార్జీలు చెల్లించకుంటే వీటిని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. రికార్డులను పరిశీలించి ప్లాటింగ్‌ కానీ భూములను ధరణిలో నమోదు చేయాలి.
కంపెనీల పేరున ఉన్న భూములకు పాసుబుక్కులు జారీ చేయలేదు. దాంతో వ్యవసాయేతర భూమిగా మార్చుకోలేకపోతున్నారు. వీటికి నిబంధనల ప్రకారం పాసుబుక్కులు జారీ చేయాలి.
చాలామంది వ్యవసాయ భూములు కొన్నా వారి పేరు మీద మ్యుటేషన్‌ కాలేదు. పాత యాజమాని పేరున పాసు బుక్కులు జారీ అయ్యాయి. దీంతో సదరు యాజమానులు కొందరు రెండోసారి ఇతరులకు భూములు అమ్ముతున్నారు. ఎవరైనా తగిన ఆధారాలతో తహసీల్దార్‌ను సంప్రదిస్తే.. రెండోసారి అమ్మకుండా నిలువరించాలి.
సేల్‌ డీడ్‌లో లీగర్‌హైర్స్‌ కాకుండా కాన్సింటింగ్‌ పార్టీ (హక్కు బదిలీ కాకుండా) చేయడంతో వారసుల నుంచి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. వీటిన్నింటిని ఒక్కోటిగా సత్వరం పరిష్కరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని