telangana news: రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోఖిల్లాలో చదరపు గజం మార్కెట్లో రూ.40వేల వరకు పలుకుతోంది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ చ.గజం రూ.1500 మాత్రమే.  ఎవరైనా ఇక్కడ 200 గజాలు కొనుగోలు చేస్తే రూ.80 లక్షలు అవుతోంది. కానీ మార్కెట్‌ విలువ

Updated : 29 Jan 2022 16:01 IST

ఆ తర్వాతే భూముల మార్కెట్‌ విలువల సవరణ చేపట్టాలి

ఆరునెలలు తిరగకుండానే పెంపుపై స్థిరాస్తి సంఘాల అభ్యంతరాలు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోఖిల్లాలో చదరపు గజం మార్కెట్లో రూ.40వేల వరకు పలుకుతోంది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ చ.గజం రూ.1500 మాత్రమే.  ఎవరైనా ఇక్కడ 200 గజాలు కొనుగోలు చేస్తే రూ.80 లక్షలు అవుతోంది. కానీ మార్కెట్‌ విలువ  ప్రకారం రూ.మూడు లక్షలే. ఈ మేరకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కడితే సరిపోతుంది. ఆదాయం పన్ను చెల్లిస్తున్న ఐటీ, ఇతర ఉద్యోగులు ఎవరైనా ఇక్కడ స్థలం కొనుగోలు చేస్తే  మార్కెట్‌ విలువను చ.గజానికి రూ.ఐదువేలకో, రూ.పదివేలకో పెంచి స్టాంప్‌డ్యూటీ కడుతున్నారు. రుణం తీసుకుని స్థలం కొంటున్నవారు సైతం మార్కెట్‌ విలువను పెంచుకుంటున్నారు. అయినా సరే వీరు చట్టబద్ధంగా సంపాదించిన సొమ్ము   స్థలం కొనుగోలుతో నల్ల డబ్బుగా మారిపోతోంది. అంతే కాదు నగదును సర్దుబాటు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు రూ.రెండు లక్షలకు మించి నగదు ఉపసంహరణకు బ్యాంకుల్లో అవకాశం లేకపోవడంతో తెలిసినవారి ఖాతాల్లో నగదును బదిలీ చేసి చెల్లింపులు జరుపుతున్నారు.

* అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల కొనుగోళ్లలోనూ ఇదే జరుగుతోంది. కూకట్‌పల్లిలో నివాసాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన చ.అ. ధర రూ.2200.  ఇక్కడ చ.అ. రూ.ఐదారువేలకు తక్కువ లేదు. రూ.50 లక్షలు పెట్టి వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే.. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.22 లక్షలకే చేస్తారు. ఎక్కువ మంది గృహరుణం తీసుకుని కొనుగోలు చేస్తుంటారు కాబట్టి చ.అ. విలువను రూ.మూడువేలు, రూ.మూడువేల ఐదు వందలకు పెంచుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటుంటారు. కాబట్టి భూముల మార్కెట్‌ విలువ పెంపుపై ఎవరికి పెద్దగా అభ్యంతరాలు లేవు.  మరీ ఏంటి సమస్య?

ఎంత వరకు ఉండొచ్చు

భూముల మార్కెట్‌ విలువ సవరణకు కొంత అవకాశం ఉన్నప్పటికీ గడువు తర్వాతనే చేపట్టాలని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి.

* సరఫరా, డిమాండ్‌ ఆధారంగా మార్కెట్లో స్థిరాస్తుల ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. కాబట్టి రిజిస్ట్రేషన్‌ విలువ మార్గదర్శకాల ప్రకారం.. బహిరంగ మార్కెట్‌ ధరల్లో రిజిస్ట్రేషన్‌ విలువలు 50 నుంచి 60 శాతం దాటరాదని క్రెడాయ్‌ అంటోంది. 

* అంతటా 25 నుంచి 50 శాతం విలువల పెంపుదల సమర్థనీయం కాదని చెబుతోంది.

మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం

* కొవిడ్‌ కొత్త రకం వైరస్‌ ఒమిక్రాన్‌ భయంతో స్థిరాస్తి కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

* మంచిరోజులు కావని డిసెంబరు, జనవరి మాసంలో పెద్దగా స్థిరాస్తి లావాదేవీలు జరగలేదు.

* ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

* ఆరునెలల్లోనే... ప్రభుత్వం ఆరునెలల క్రితమే భూముల మార్కెట్‌ విలువలను 30 నుంచి 100 శాతంపైగా పెంచింది. అక్కడితో సరిపెట్టలేదు. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కొనుగోలుదారులకు భారంగా మారాయి. ఈ ప్రభావం నుంచి బయటపడకముందే మరోసారి భూముల మార్కెట్‌ విలువల పెంపు చేపట్టడంతో ముందుగా అనుకున్న ప్రణాళికలన్నీ తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. కొందరు పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలకు సొమ్ములు సర్దుబాటు కాక వాయిదా వేస్తున్నారని, ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారని బిల్డర్లు అంటున్నారు.  భూముల విలువ పెంపు ఆకస్మికంగా కాకుండా నిర్దిష్ట గడువు ప్రకారం చేపట్టాలని.. ముందుగానే సమాచారం ఉండాలని స్థిరాస్తి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


ఇవీ సూచనలు..

భూముల మార్కెట్‌ విలువపైన, అందునా పెంచిన విలువలపైన  7.5 శాతం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలంటే చాలా పెద్ద భారమే.  దీన్ని మునుపటి 6 శాతానికైనా తగ్గించాలని క్రెడాయ్‌, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి.

* భూముల మార్కెట్‌ విలువల సవరణని కనీసం ఆరునెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థించాయి.

* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు చెల్లించే నాలా ఛార్జీలను 3 నుంచి 2 శాతానికి, జీహెచ్‌ఎంసీలో 5 నుంచి 3 శాతానికి తగ్గించాలని కోరాయి. 

* ఈ ఛార్జీలన్నీ తగ్గించాకనే భూముల మార్కెట్‌ విలువల పెంపు చేపట్టాలని సూచించాయి.


భూముల మార్కెట్‌ విలువల సవరణ ప్రక్రియ చివరిదశకు చేరింది. పెంపు అనివార్యంగా కనబడుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరలకు.. రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పెంపుతో ఇది తగ్గితే మంచిదే.  కానీ ఎందుకు స్థిరాస్తి సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి? మార్కెట్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువ మధ్య అంతరం తగ్గించాలని సూచించిన సంఘాలే ఇప్పుడు ఎందుకు వాయిదా వేయమంటున్నాయి?


అప్పుడే ఎలా పెంచుతారు...

- డి.మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

2013 తర్వాత గత ఏడాది జులై 22న ప్రభుత్వం భూముల విలువలను పెంచింది. ఆరునెలల్లోనే మరోసారి పెంచాలనే నిర్ణయం అన్యాయం. గతంలో పెంచిన వాటి ప్రభావం ఏ మేరకు ఉందో అధ్యయనం చేయకుండానే ఎలా పెంచుతారు.  దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  తగ్గించేవరకు  స్థిరాస్తి సంఘాలన్నింటిని కలుపుకొని ఆందోళనలు చేస్తాం. రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొనుగోలుదారులకు భారం కానుంది. పెంచిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 నుంచి 6 శాతానికి తగ్గించాలి.


శాస్త్రీయంగా చేపట్టాలి

- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

భూముల మార్కెట్‌ విలువల పెంపునకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ శాస్త్రీయంగా ఈ ప్రక్రియ చేపడితే మాకు అభ్యంతరం లేదు. అలా పెంచిన తర్వాత కూడా బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల్లో 60 శాతానికి మించరాదు. కొన్నిచోట్ల ప్రధాన రహదారి ఉంటే ఎక్కువ ధర ఉండొచ్చు. నాలా పక్కన ఉంటే ధర తక్కువ ఉండొచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. అంతటా ఒకేవిధంగా పెంపు సరికాదు అనేది మా వాదన. వీటన్నింటి కంటే ముందు ఆరునెలల క్రితం పెంచిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను, నాలా ఛార్జీలను మునుపటి స్థాయికి తగ్గించాలనేది ప్రభుత్వానికి మా ప్రధాన అభ్యర్థన.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని