ఐదొందల చదరపు మీటర్లుంటేనే అపార్టుమెంట్లు

కష్టజీవుల పెట్టుబడి పదింతలు కావాలి. గాలిలో దీపం కావొద్దు. చింత లేకుండా పెట్టుబడి నుంచి రాబడి పొందాలంటే.. స్థిరాస్తి రంగం ఎదురు లేనిది.

Published : 18 Feb 2023 01:13 IST

అనుమతు లేనివాటితో కష్టాలు ‘కొని’తెచ్చుకోవద్దు

కష్టజీవుల పెట్టుబడి పదింతలు కావాలి. గాలిలో దీపం కావొద్దు. చింత లేకుండా పెట్టుబడి నుంచి రాబడి పొందాలంటే.. స్థిరాస్తి రంగం ఎదురు లేనిది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. అనుమతిలేని భవన సముదాయాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసి మోసపోతున్నారు. సమయానికి ఇంటిని అమ్ముకోలేకపోవడం, బ్యాంకు రుణాలు పొందలేకపోవడం, రెట్టింపు మొత్తంలో తాగునీటి రుసుము, ఆస్తిపన్ను చెల్లించడం వంటి కష్టాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్లలో ఇంటిని కొనేందుకు అధికారులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌   దినదినాభివృద్ధి చెందుతోంది. భూమి విలువ నానాటికీ పెరుగుతోంది. దాంతో.. చాలా మంది హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇళ్లను కొనుగోలు చేసి.. అద్దెలకు ఇచ్చేవారు ఉన్నారు. కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో, అతి విశ్వాసంతో మోసాలకు బలవుతున్నారు. భూమి ధర ఎక్కడ తక్కువ, నామమాత్రపు పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణమున్న ఇల్లు ఎక్కడ దొరుకుతుందనే ఆలోచనలతో.. మోసగాళ్లకు చిక్కుతున్నారు.

బీఆర్‌ఎస్‌ పేరుతో..

గ్రేటర్‌ హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో రెండు లేదా మూడు అంతస్తుల్లో వ్యక్తిగత గృహానికి అనుమతి పొందడం.. ఐదు లేదా 6అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించడం సర్వ సాధారణమైంది. ఇలాంటి భవనాల్లో గరిష్ఠంగా పది ఫ్లాట్లు ఉంటాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అనుమతితో నిర్మాణమైన అపార్ట్‌మెంట్లోని చదరపు అడుగు ధరను పోల్చుతూ..అంతకన్నా తక్కువకే ఇస్తున్నామని ఇళ్లను అమ్ముతుంటారు. పై అంతస్తులకు అనుమతి లేదు కదా అని కొనుగోలుదారు అడిగితే తర్వాత బీఆర్‌ఎస్‌ చేసుకోవచ్చు అని చెబుతుంటారు. ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేస్తే జీవితాంతం యజమాని బాధపడాల్సిందే.
* ప్రస్తుత పరిస్థితుల్లో.. అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణ(బీఆర్‌ఎస్‌) పథకం భవిష్యత్తులో రాకపోవచ్చని అధికారుల అంచనా. అదే నిజమైతే.. జీవితాంతం ఆ ఇంటిని అక్రమ నిర్మాణమనే పిలుస్తారు. బ్యాంకులు రుణాలివ్వవు. స్థిరాస్తి విలువ పెరగదు. ఆస్తిపన్ను, నల్లా రుసుము రెట్టింపు ఉంటుంది. ఇంటి రిజిస్ట్రేషన్‌, ఇంటి నంబరూ కష్టమే. జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగానికి ఫిర్యాదు వెళ్లినప్పుడల్లా నోటీసులు జారీ అవుతుంటాయి. మరోవైపు సెట్‌బ్యాక్‌లు సరిగా ఉండక పోవడంతో ఇంట్లోకి గాలి, వెలుతురు అరకొరగా అందుతుంటాయి.
* పాత ఇళ్లకూ ఇదే వర్తిస్తుంది.  తమ బడ్జెట్‌ ధరలో వస్తుందని 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. అనుమతి ఉన్న అంతస్తుల వరకే కొనడం మేలు. గతంలో చాలావాటికి మూడు అంతస్తుల వరకే అనుమతి ఉండేది. అప్పట్లో నాలుగో అంతస్తు, పెంట్‌హౌస్‌లు వేశారు. వీటిని కొనేటప్పుడు అన్ని వివరాలు పరిశీలించాకే ముందడుగు వేయాలి.

ఇంటిని కొంటుంటే..

గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్‌ను లేదా అందులోని ఫ్లాటును కొనుగోలు చేయాలంటే.. భవన సముదాయానికి జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందా? లేదా? అని తెలుసుకోవాలి. శివార్లలో అయితే మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి.
* అనుమతి ఉంటే.. యజమాని దగ్గరున్న భవనం ఆమోదిత ప్లాన్‌ను (శాంక్షన్‌ ప్లాన్‌) సరిచూసుకోవాలి. 200చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టి ఉంటే.. నిర్మాణంలోని పది శాతం జీహెచ్‌ఎంసీ వద్ద తనఖా ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయ్యాక యజమాని నివాసయోగ్య పత్రానికి దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నిర్మాణాన్ని తనిఖీ చేసి, శాంక్షన్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మాణం జరిగిందని తేల్చుకున్నాక ఓసీ ఇస్తారు. అలాగే.. తనఖా పెట్టిన నిర్మాణాన్ని విడుదల చేస్తారు. జరిమానాతో గరిష్ఠంగా పది శాతం ఉల్లంఘనను అనుమతిస్తారు. అంతకు మించి ఉల్లంఘనలుంటే.. వాటిని సరిచేసుకునే వరకు ఓసీ మంజూరవదు. అందువల్ల నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనే ముందు శాంక్షన్‌ ప్లాన్‌ను సరిచూసుకోవాలి.
* తనఖా పెట్టిన ఫ్లాట్లను కొనుగోలు చేయొద్దు. నిర్మాణం పూర్తయిన భవనాల్లోని ఫ్లాట్‌ను కొనాలంటే.. శాంక్షన్‌ ప్లాన్‌తో పాటు ఓసీ పత్రాన్ని కూడా పరిశీలించుకోవాలి. రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం మరింత శ్రేయస్కరమని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం సూచిస్తోంది.

అపార్ట్‌మెంట్‌..  ఎంత విస్తీర్ణంలో...

గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్‌ కట్టాలంటే.. భూ విస్తీర్ణం కనీసం 500చదరపు మీటర్లు లేదా 600చదరపు గజాలుండాలి. కనీసం ఆ ప్లాటు ముందు 30అడుగుల రోడ్డుండాలి. అప్పుడే గరిష్ఠంగా 10 ఫ్లాట్లతో 15మీటర్ల ఎత్తున అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. అదేమీ పట్టించుకోకుండా.. చాలా మంది ఇరుకు రోడ్లున్న కాలనీల్లో 250గజాల్లోనే అపార్ట్‌మెంట్లు కడుతుంటారు. వాటిలో ఫ్లాటును కొనుగోలు చేయొద్దని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
* అనుమతి ప్రకారం నిర్మాణమైన అపార్ట్‌మెంట్లపై కొందరు యజమానులు పెంట్‌ హౌస్‌ నిర్మిస్తుంటారు. వాటిని కూడా కొనొద్దని అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని