స్థిరాస్తి కొనేముందు ఏయే డాక్యుమెంట్లు పరిశీలించాలి?

కలల సౌధం నిర్మించుకునేందుకు ఇంటి స్థలం కొనేటప్పుడు కాని.. అపార్టుమెంటులో ఫ్లాట్‌ ఖరీదు చేసేటప్పుడు కాని ఒకటికి రెండు సార్లు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకుంటే అవస్థల పాలవ్వాల్సిన పని ఉండదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హైదరాబాద్‌ జిల్లా(సౌత్‌) రిజిస్ట్రార్‌ రవీందర్‌రావు మల్రాజు అన్నారు.

Published : 18 Feb 2023 01:13 IST

కలల సౌధం నిర్మించుకునేందుకు ఇంటి స్థలం కొనేటప్పుడు కాని.. అపార్టుమెంటులో ఫ్లాట్‌ ఖరీదు చేసేటప్పుడు కాని ఒకటికి రెండు సార్లు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకుంటే అవస్థల పాలవ్వాల్సిన పని ఉండదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ హైదరాబాద్‌ జిల్లా(సౌత్‌) రిజిస్ట్రార్‌ రవీందర్‌రావు మల్రాజు అన్నారు. స్థిరాస్తులు కొనేటప్పుడు ఏయే పత్రాలు సరిచూసుకోవాలో ఆయన వివరించారు. 

* ఇంటి స్థలం, అపార్టుమెంట్లో ఫ్లాట్‌, ఇల్లు కొనేముందు ఏయే డాక్యుమెంట్లు పరిశీలించాలి?

యాజమాన్య హక్కులు పరిశీలించడానికి అన్ని లింకు డాక్యుమెంట్లలోనూ ఆస్తి సర్వే నంబరు/ఆవరణల సంఖ్య, సరిహద్దుల పరంగా ఒకేలా ఉందా లేదా నిర్ధారించుకోవాలి. లే అవుట్‌ మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ లాంటి సంస్థల ఆమోదం ఉందో లేదో చూసుకోవాలి. టైటిల్‌ డీడ్స్‌, ఆస్తి యాజమాన్య పత్రాలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన అధీకృత కాపీలతో సరి చూసుకోవాలి. కొనదల్చిన భూమి రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 సెక్షన్‌ 22(ఎ), ప్రభుత్వం చేసిన ఇతర చట్టాల కింద నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆస్తిని భౌతికంగా చూడకుండా.. ఆ ప్రాంతంలో దాని ఉనికి తనిఖీ చేయకుండా కొనరాదు. స్థలాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. వాస్తవ యజమాని మొదలుకొని ప్రస్తుత విక్రయదారు వరకు లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం సైట్‌ ప్లాన్‌, లొకేషన్‌ హద్దులు ఉన్నాయా అనేదానిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి.

* కొన్న ఆస్తిని ఎలా పరిరక్షించుకోవాలి. అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

హద్దు రాళ్లను పాతడం ద్వారా ఆస్తి భౌతికంగా మీ స్వాధీనంలో ఉండేటట్లు చూసుకోండి. ఆస్తిని కొని వదిలేయకుండా క్రమం తప్పకుండా సందర్శిస్తూ, దాని ఉనికి హద్దులను సరి చూసుకోవాలి. మీ ప్లాట్‌కు ఇరువైపులా ఉన్నవారి వివరాలు కూడా మీ వద్ద ఉండాలి. వారితో వీలైనప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ప్లాట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ఈసీ తీసుకుని సరి చూసుకోవాలి. ఎవరైనా ప్లాట్‌ను కొలుస్తున్నట్టు సమాచారం ఉంటే.. వెంటనే అప్రమత్తం అవ్వాలి. పక్కన ఉన్న వాళ్లు హద్దుల ప్రకారం ప్రహరీ నిర్మిస్తారని భావించరాదు.. వాళ్లు పునాదులు వే ేస్తున్నప్పుడు మనం కూడా పరిశీలించాలి. ఇందులో ఎక్కడా నమ్మకాలకు తావులేదు.

* సర్వే నంబరు ఆధారంగా.. కొన్న భూమి వివరాలు ఎక్కడో తెలుసుకోవాలి..?

మీరు కొంటున్న భూమి అసైన్డ్‌(పేదలకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చినది), ప్రభుత్వానికి చెందిన భూమా లేదా దేవాదాయశాఖ, వక్ఫ్‌ ల్యాండా అనే వివరాలు తెలుసుకోవాలి. అలాగే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. మాజీ సైనికులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సర్కారు ఇచ్చిన భూములను  వారికిచ్చిన తర్వాత 10 ఏళ్లు దాటితేనే కొనాలి. ఈ వివరాలు స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కాని.. తహసీల్దార్‌ కార్యాలయాలకు గానీ వెళ్లి తెలుసుకోవాలి. మీసేవ ద్వారా కాని, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈసీని కూడా పొందాలి. కోర్టు లిటిగేషన్‌లో ఉందా అనే వివరాలు తెలుసుకోవాలి. లిటిగేషన్‌లో ఉన్నా.. భవన నిర్మాణ అనుమతులు, ఎన్‌వోసీలు ఉన్నాయని తొందరపడొద్దు. ప్లాన్‌ ప్రకారం నిర్మించకపోతే.. ఎప్పుడైనా మున్సిపాలిటీ అధికారులు కూల్చేయవచ్చు. ఇంకా అర్థం కాని వ్యవహారాలుంటే.. స్థిరాస్తి లావాదేవీలపై అనుభవమున్న న్యాయవాదులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు నడుచుకోవాలి.

* స్థిరాస్తి కొన్నప్పుడు ఆ ఆస్తిపై హక్కుదారులను, వారసులను గుర్తించడం ఎలా..?

ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా, నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడవద్దు. ఆస్తి కొనుగోలు సందర్భంగా దానిపై హక్కు గల చట్టబద్ధ వారసులు, ప్రతినిధులు అంతా కూడా సమ్మతించి ముందుకు వచ్చిందీ లేనిది నిర్ధారించుకోవాలి. ముందుగా కుదుర్చుకున్న విక్రయ ఒప్పందాలు,  తాకట్టు (మార్టిగేజ్‌)లాంటివి లేవనే అంశాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం జారీ చేసిన ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)ద్వారా నిర్ధారించుకోవాలి. చిరునామా ధ్రువీకరణ పత్రంతో పాటు.. కొనుగోలుదారులు, విక్రయదారుల ఫొటోలు, వేలిముద్రలు, డాక్యుమెంట్‌కు అతికించినట్టుగా నిర్ధారించుకోవాలి. సాక్షుల ధ్రువీకరణ పత్రం, ఐడీ కార్డులు కూడా చూడాలి. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ వంటి డాక్యుమెంట్లు సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రిజిస్టర్‌ అయ్యాయా, వాటి చెల్లుబాటు ఎలాంటిది అనే అంశాలు చూసుకోవాలి. మీరు కొంటున్న భూమికి సంబంధించి సమస్యలు లేకుండా ఉండాలంటే ఎవరిదగ్గర కొంటున్నారు.. అనే వివరాలను వెల్లడిస్తూ. లాయర్‌ నోటీసు మాదిరి పేపర్లలో ప్రకటన కూడా ఇవ్వాల్సి ఉంటుంది.  ఆశలు పెట్టి అమ్మేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలి. పూర్వాపరాలను పరిశీలించాలి. ధరలు పెరిగిపోతాయని తొందరపెడితే మీరు గాబరా పడొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని