ధరల భారం ఎలా దాటగలం?

రూ.కోటి విలువ చేసే ఫ్లాట్‌/విల్లా మార్కెట్‌ విలువ రెండుసార్లు పెంపుతో ఈ నెలల్లోనే 69 శాతం పెరిగింది. వీటిపై చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (6 నుంచి 7.5 శాతానికి పెంపు)తో 103 శాతం పెరిగాయి.

Updated : 05 Feb 2022 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌

* జులై 22కి ముందు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రూ.6 లక్షలు అయ్యేవి. ఆ తర్వాత పెంచిన భూముల విలువలతో రూ.9.75 లక్షలు పెరిగాయి. ఇటీవల మరోసారి భూముల విలువల సవరణతో రూ.12.18 లక్షలకు ఛార్జీలు పెరిగాయి. కొనుగోలుదారుడిపై 6 నెలల్లోనే  రూ.6.18 లక్షలు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారం పెరిగింది. * ఖాళీ స్థలాల విషయానికి వస్తే రూ.కోటి విలువ చేసే జాగాపై మార్కెట్‌ విలువ 103 శాతం పెరగగా... రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 153 పెరిగాయి. జులై 22కి ముందు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రూ.6 లక్షలైతే.. ఇప్పుడు రూ.15.18 లక్షలు అవుతోంది. * వ్యవసాయ భూమిని హెచ్‌ఎండీఏ పరిధిలో వ్యవసాయేతరాల మార్పిడికి చెల్లించే నాలా ఛార్జీలు జులై 22కి ముందు కోటి విలువ చేసే భూమిపై రూ.3 లక్షలు అయ్యేది. ఇప్పుడు రూ.7.5 లక్షలకు పెరిగింది. 150 శాతం ఛార్జీల భారం పెరిగింది. ఈ భారం ఎలా దాటాలని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్‌ విలువలను రెండుసార్లు పెంచడంతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (స్టాంప్‌ డ్యూటీతో కలిపి) కొనుగోలుదారుడికి భారంగా మారాయి. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర తక్కువగా ఉండేవి. 7.5 శాతానికి పెరగడంతో కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నారని బిల్డర్లు వాపోతున్నారు. ఛార్జీలపై పునరాలోచన చేయాలని స్థిరాస్తి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీని నమోదు చేసే సంక్షేమ కార్యాలయమని... రెవెన్యూ తీసుకొచ్చే శాఖ కాదని గుర్తు చేస్తున్నారు.  మార్కెట్లో ఏది కొన్నా ఒకటే పన్ను ఉంది కానీ జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఇలా రెండు పన్నులు కట్టేది ఒక్క రియల్‌ ఎస్టేట్‌లోనే జరుగుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాలని కోరుతున్నారు.  


అందుబాటు ‘ట్యాగ్‌’ దూరం

- వి.శ్రీనివాస్‌, అధ్యక్షుడు, ప్రగతినగర్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌ ఇప్పటి వరకు అందుబాటు ఇళ్లకు కేంద్రంగా ఉంది. వేర్వేరు నగరాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయంతో అఫర్డబుల్‌ అనే ట్యాగ్‌ను హైదరాబాద్‌ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మధ్యతరగతివాసుల ఇంటి కల చెదిరిపోయేలా ఉంది. 30-40 లక్షల మధ్య ఇళ్లు ఇక కనిపించవు. ప్రస్తుతం భూమి ట్రేడింగ్‌ లాభసాటిగా ఉంది. పెరిగిన సామగ్రి ధరలతో నిర్మాణదారులకు ఎలాంటి లాభం లేదు. చిన్న బిల్డరు కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది.


చిన్న బిల్డర్లకు కష్టం 

- కె.రాజారెడ్డి, అధ్యక్షుడు, గ్రేటర్‌ వెస్ట్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌

కూకట్‌పల్లిలో 400 గజాల విస్తీర్ణంలో ఒక బహుళ అంతస్తుల గృహ సముదాయం కట్టాలంటే పెరిగిన భూముల విలువ ప్రకారం స్థలానికే రూ.6కోట్లు అవుతుంది. నిర్మాణానికి చ.అ. రూ.2వేలు వేసుకుంటే... చ.అ.రూ.ఏడు వేలకు విక్రయించాలి. ఆ ధరకు కొనేవారు ఎవరూ? అదే పెద్ద బిల్డర్లు ఎకరం అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలతో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఏతో చేయగలుగుతున్నారు. నలుగురు పెద్ద బిల్డర్ల కోసం కాకుండా చిన్న బిల్డర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.


ఛార్జీలే రూ.20 లక్షలైతే ఎలా?

- జె.టి.విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి, గ్రేటర్‌ సిటీ బిల్డర్స్‌ అసోసియేషన్‌

రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీ నమోదుకు సర్వీసు ఛార్జీ తీసుకోవాలి తప్ప రెవెన్యూ కోసం పన్నులు భారీగా వేయడం సరికాదు. రూ.కోటి విలువ చేసే  కమర్షియల్‌ స్పేస్‌ కొనుగోలు చేస్తే.. జీఎస్‌టీ 12 శాతం, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 7.5 శాతం కలుపుకొంటే రూ.20 లక్షలు అవుతుంది.


మార్కెట్‌ మందగమనంలో ఇలానా...

- ఎస్‌.రమేశ్‌, అధ్యక్షుడు, ఉప్పల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌

స్థిరాస్తి మార్కెట్‌  బాగా నెమ్మదించింది. ఇప్పటికే 20 శాతం ప్రాజెక్టుల్లో అడ్వాన్స్‌లు రానివి ఉన్నాయి.6నెలల్లోనే రెండోసారి భూముల మార్కెట్‌ విలువల సవరణ భారం కొనుగోలుదారుడిపై పడుతుంది. అతను ముందుకు రాకపోతే ఆ ప్రభావం మార్కెట్‌పై ఉంటుంది.


పెంపు సరైంది కాదు..

- ఎన్‌.శ్రీనివాసన్‌, అధ్యక్షుడు, కూకట్‌పల్లి బిల్డర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌లో పది లక్షల మంది కార్మికులు నిర్మాణ రంగంపై  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు. ఎక్కువ మంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్న ఈ రంగం కుదేలైతేఉపాధి కోల్పోతారు. కొవిడ్‌ తర్వాత ఇసుక తప్ప నిర్మాణ సామగ్రి ధరలన్నీ 35 శాతం  పెరిగాయి. టన్ను స్టీల్‌ 3నెలల్లోనే రూ.20వేల వరకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులపై మరింత భారం మోపడం సరైంది కాదు.రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని