త్రీడీలో ఇళ్లు... గంటల్లోనే కట్టేలా

నిర్మాణరంగంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. మున్ముందు భవనాలను కట్టేందుకు రోజులు అక్కర్లేదు గంటలు చాలు అంటున్నారు. త్రీడీ గోడలను ప్రింట్‌ తీసుకుని ఇళ్లు కట్టుకునే రోజులు వచ్చేస్తున్నాయి.

Updated : 25 Feb 2023 10:26 IST

సమయం ఆదా.. మెరుగైన నాణ్యత అంటున్న పరిశోధకులు
డిజిటల్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి
ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణరంగంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. మున్ముందు భవనాలను కట్టేందుకు రోజులు అక్కర్లేదు గంటలు చాలు అంటున్నారు. త్రీడీ గోడలను ప్రింట్‌ తీసుకుని ఇళ్లు కట్టుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఐటీ గౌహతి ఆవిష్కర్తలు త్రీడీ ప్రింటెడ్‌తో 24 గంటల్లో సెక్యూరిటీ పోస్టు నిర్మించారు. జీ20 సదస్సు నేపథ్యంలో సాంకేతికత సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు ఆత్మ నిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా ఈ డిజిటల్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో నాణ్యతతో కూడిన ఇళ్లను తక్కువ సమయంలో నిర్మించి ఇచ్చేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని అంటున్నారు. త్రీడీ ప్రింటెడ్‌ నిర్మాణాల గురించి.. తాము నిర్మించిన సెక్యూరిటీ పోస్టు గురించి ఐఐటీ గౌహతి సహాయ ఆచార్యులు డాక్టర్‌ బిరంచి పాండా ‘ఈనాడు’కు వివరించారు.

భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సు నేపథ్యంలో మా ఇనిస్టిట్యూట్‌ సుస్థిర భవిష్యత్తు అభివృద్ధిపై చురుకుగా పనిచేస్తోంది.  ఇందులో భాగంగా సాంకేతికత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం ఉన్న అంశాలను పరిశీలిస్తున్నప్పుడు త్రీడీ ప్రింటెడ్‌ ఇళ్లు ఆలోచన వచ్చింది.  మా కళాశాల అతిథ్యం ఇస్తున్న ఐ20 సమ్మిట్‌ దృష్ట్యా అత్యవసరంగా ఒక సెక్యూరిటీ పోస్టు అవసరం ఏర్పడింది. గోడలు కట్టి, క్యూరింగ్‌ చేసి ఈ పనులు ముగిసే వరకు చాలా సమయం పడుతుంది. అప్పుడే త్రీడీ ప్రింటింగ్‌తో సెక్యూరిటీ పోస్టు నిర్మించాలని నిర్ణయించుకున్నాం. విద్యార్థులు, త్రీడీపై పనిచేస్తున్న అంకుర సంస్థ స్ట్రాటిఫై 3డి సంస్థతో కలిసి డిజిటల్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లానింగ్‌ తోడ్పాటుతో ఒక రోజులో పూర్తి చేశాం.

డిజిటల్‌లోనే

తొలుత కంప్యూటర్‌లో డిజైనింగ్‌ పూర్తిచేశాం. 85 అడుగుల కార్పెట్‌ ఏరియా విస్తీర్ణం ఉండేలా 56 మాడ్యుల్స్‌ రూపొందించాం. సాధారణంగా కాంక్రీట్‌ నిర్మాణమంటే అచ్చుల్లో పోత పోస్తారు. ఇక్కడ కంప్యూటర్‌కు అనుసంధానించిన త్రీడీ ప్రింటింగ్‌లో గోడలు సిద్ధమయ్యాయి. టెట్రా హెడ్రాన్‌ మాడ్యుల్‌ల్లో వీటిని ముద్రించారు. ఇంటి కోసమూ కావాల్సిన ఆకృతిలో డిజైన్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేక కాంక్రీట్‌తో  

కాంక్రీట్‌లో సాధారణ సిమెంట్‌ కాకుండా పారిశ్రామిక వ్యర్థాలు, ఫైబర్‌లు కలిగిన ప్రత్యేక ఎం40 గ్రేడ్‌ స్థిరమైన కాంక్రీట్‌ను ఇందుకోసం ఉపయోగించాం. కాంక్రీట్‌ మిక్స్‌ డిజైన్‌ను ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. దీనిపై పేటెంట్‌కు దరఖాస్తు చేశాం. ఈ మిశ్రమంతో ఆటోమేటెడ్‌ కాంక్రీట్‌ 3డీ ప్రింటర్‌ సాయంతో సెక్యూరిటీ పోస్టుకు కావాల్సిన మాడ్యుల్స్‌ను ప్రింట్‌ చేశాం. దీనికి 15 గంటల వరకు పట్టింది. ఆ తర్వాత వీటిని ఒక రోజులో బిగించేశాం.

ప్రయోజనాలు

* డిజిటల్‌ నిర్మాణ సాంకేతికతతో నిర్మాణ సమయం తగ్గించవచ్చు. వేగంగా పనులు పూర్తి చేయవచ్చు.

* ఉపరితల ఆకృతి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది.

* పరిశ్రమలో ఈ తరహా మార్పులతో ఉత్పాదకత, సామర్థ్యం వంటివి మెరుగవుతాయి.

* నిర్మాణ రంగం 40 శాతం కార్బన్‌ డయాక్సైడ్‌  ఉద్గారాలను వెదజల్లుతోంది. దీంతో సుస్థిర మిశ్రమాలను ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు.

* విద్యాసంస్థలు, పరిశ్రమ తోడ్పాటుతో త్రీడీలో మరింత పురోగమించడానికి అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని