కో వర్కింగ్‌కుపెరిగిన డిమాండ్‌

కార్యాలయ నిర్మాణాల్లో ‘ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌’కు డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత వీటికి మొదలైన డిమాండ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది.

Published : 13 May 2023 04:03 IST

తొలి త్రైమాసికంలో కార్యాలయాల
లీజింగ్‌లో 27 శాతం వాటా వీటిదే
ఈనాడు, హైదరాబాద్‌

కార్యాలయ నిర్మాణాల్లో ‘ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌’కు డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత వీటికి మొదలైన డిమాండ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అంకుర సంస్థలే కాదు బహుళజాతి సంస్థలు, వ్యాపార కంపెనీలు సైతం వీటి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 7 ప్రధాన నగరాల్లో 8.2 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ లీజింగ్‌ జరిగితే ఇందులో 27 శాతం వాటా కోవర్కింగ్‌ సంస్థలదే. మొత్తం కార్యాలయాల లీజింగ్‌లో సగం 3 దక్షిణాది నగరాలు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో జరగడం విశేషం.

కొవిడ్‌ తర్వాత ఇదే అత్యధికం..

గతంలో 2019 తొలి త్రైమాసికంలో నమోదైన లీజింగ్‌ 9.3 మిలియన్‌ చదరపు అడుగులు ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఈ ఏడాది ఆ స్థాయిలో లావాదేవీలు జరిగాయి. 8.2 మిలియన్‌ చ.అ.కు కార్యాలయాలు లీజింగ్‌ నమోదైంది. ఇందులో 2.18 మిలియన్‌ చ.అ. కోవర్కింగ్‌ ఉండటం సరికొత్త మార్కెట్‌ను సూచిస్తోంది.

ప్రధాన 7 నగరాల్లో కలిపి కోవర్కింగ్‌లో 90 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019లో మొదటి త్రైమాసికంలో 1.43 మిలియన్‌ చ.అ.ఉండగా ఈ ఏడాదికి 2.18 మిలియన్‌ చ.అ.కు పెరిగింది.

దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) దిల్లీ, ముంబయి నగరాల్లో 1.43 మిలియన్‌ చదరపు అడుగుల కోవర్కింగ్‌ కార్యాలయాల్లో లీజింగ్‌ జరిగింది. చెన్నైలో 0.52 మిలియన్‌ చ.అ. కాగా 0.25 మిలియన్‌ చ.అ. కోల్‌కతాలో జరిగిందని అనరాక్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది.

కార్యాలయాల్లో...

‘ఎ’ గ్రేడ్‌తోపాటు అన్నిరకాల కార్యాలయాల్లో కలిపి 8.2 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ జరిగితే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లోని వాటానే 51 శాతంగా నమోదైంది. ఇక్కడ 4.6 మిలియన్‌ చ.అ.ల్లో కార్యాలయాలు వచ్చాయి. ఇందులో 26 శాతం కోవర్కింగ్‌ సంస్థలు తీసుకున్నాయి.

కొనసాగుతున్న హైబ్రీడ్‌ పనివిధానం

కోవర్కింగ్‌ స్పేస్‌లకు డిమాండ్‌ పెరగడానికి ఇప్పటికీ హైబ్రీడ్‌ పని విధానం కొనసాగడమే కారణంగా కన్పిస్తోంది. కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందిగా కంపెనీలు సూచిస్తున్నా ఉద్యోగులు ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తున్నారు. వారంలో 2 రోజులు కార్యాలయానికి, మిగిలిన రోజు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ కారణంగానే పలు కంపెనీలు కోవర్కింగ్‌ స్పేస్‌ చాలని అంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని