మూడు నెలలు.. 20 లక్షల చదరపు అడుగులు

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో రోజుకో దేశీయ, బహుళజాతి సంస్థల కార్యాలయాల ప్రారంభోత్సవాలు.. 2వేల నుంచి రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు.. కొత్తగా మరిన్ని సంస్థల పెట్టుబడి, విస్తరణ ప్రకటనలు..  వెరసి కార్యాలయ స్థలాల లీజింగ్‌ పరంగా భాగ్యనగరంలో సానుకూలత నెలకొంది.

Updated : 08 Jul 2023 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో రోజుకో దేశీయ, బహుళజాతి సంస్థల కార్యాలయాల ప్రారంభోత్సవాలు.. 2వేల నుంచి రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు.. కొత్తగా మరిన్ని సంస్థల పెట్టుబడి, విస్తరణ ప్రకటనలు..  వెరసి కార్యాలయ స్థలాల లీజింగ్‌ పరంగా భాగ్యనగరంలో సానుకూలత నెలకొంది. ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసికంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ కార్యకలాపాలు జరిగాయని సీబీఆర్‌ఈ  ‘ఇండియా ఆఫీస్‌ ఫిగర్స్‌ క్యూ2 2023’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

* టెక్నాలజీ సంస్థల వాటా 44 శాతం కాగా.. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్లు 25 శాతం స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీఎస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) కార్యాలయాల వాటా 8 శాతంగా ఉంది.

* నెక్సిటీ టవర్‌ 30లో ఈఏ స్పోర్ట్స్‌ సంస్థ 2.50 లక్షల చదరపు అడుగులు లీజ్‌కు తీసుకుంది.

* ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ ఏలో యూఎస్‌టీ గ్లోబల్‌ 1.20 లక్షల చదరపు అడుగులు, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌ సైతం ఇంతే విస్తీర్ణం లీజుకు తీసుకుంది.

* 50వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగిన లావాదేవీలు ఎక్కువగా జరిగాయి.

దేశంలో  చూస్తే..

* గడిచిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా కార్యాలయ స్థలం లీజింగ్‌ 12 శాతం పెరిగింది. 13.9 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది.

* బెంగళూరు, చెన్నై, పుణె నగరాలు ముందు వరసలో ఉన్నాయి. ఈ మూడు నగరాల వాటానే 59 శాతంగా ఉంది.

* టెక్నాలజీ కంపెనీలు 29 శాతం, ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్లు 18 శాతం, ఇంజినీరింగ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు 17 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 17 శాతం వాటాని కలిగి ఉన్నాయి.

భవిష్యత్తు ఆశాజనకం

* అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. లీజింగ్‌ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో స్థిరంగా జరుగుతున్నాయి. మున్ముందు ఇది కొనసాగనుంది.

* హైబ్రిడ్‌ పని విధానం కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయానికి వచ్చే పనిచేయాలనే ప్రయత్నాలు పలు రంగాల్లోని కంపెనీలు చేస్తున్నాయి. ఇది కూడా కొత్త లీజింగ్‌కు దారితీస్తుంది.

* ఉద్యోగుల సంఖ్య పెరగడంతో కొన్ని సంస్థల కార్యాలయాల విస్తీర్ణం చాలడం లేదు. విస్తరించే దిశగా సమాలోచనలు చేస్తున్నాయి.

* అంతర్జాతీయంగా పోలిస్తే మన దగ్గర అద్దెలు తక్కువగా ఉండటంతో మన దేశం గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లకు గమ్యస్థానంగా మారుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కంపెనీలు ప్రారంభించాయి. మరికొన్ని వచ్చే అవకాశం ఉంది.  

సరఫరాలోనూ..

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆఫీసు స్పేస్‌ సరఫరా 12.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో సరఫరా వాటా 84 శాతంగా ఉంది.

* పూర్తైన వాటిలో 46 శాతం హరిత ప్రాజెక్ట్‌లు ఉండటం సానుకూలాంశం. ఐజీబీసీ, లీడ్‌ సర్టిఫికెట్‌ కలిగిన ప్రాజెక్టులే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని