పూరీ లోపలే కూర...!

వేడివేడిగా పొంగిన పూరీలను చూస్తే... కనీసం మూడు నాలుగు తింటేనే కానీ సంతృప్తిపడం. అలాంటిది వాటి మధ్యలో ఏదయినా మిశ్రమం కూరితే... ఇంకేముంది పండగే అంటారా... ఈ పూరీలన్నీ అలాంటి స్టఫింగ్‌ రుచులే మరి.

Published : 24 Jun 2021 21:15 IST

వేడివేడిగా పొంగిన పూరీలను చూస్తే... కనీసం మూడు నాలుగు తింటేనే కానీ సంతృప్తిపడం. అలాంటిది వాటి మధ్యలో ఏదయినా మిశ్రమం కూరితే... ఇంకేముంది పండగే అంటారా... ఈ పూరీలన్నీ అలాంటి స్టఫింగ్‌ రుచులే మరి.


గోబీ పూరీ

 

కావలసినవి
గోధుమపిండి: మూడు కప్పులు, పసుపు: పావుచెంచా, నెయ్యి: ఒకటిన్నర చెంచా. ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
స్టఫింగ్‌ కోసం: క్యాలీఫ్లవర్‌ తురుము: ముప్పావుకప్పు, కొబ్బరి తురుము: పావుకప్పు, వేయించిన పల్లీలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత.

తయారీ విధానం
గోధుమపిండిలో నెయ్యి, సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని అన్నింటినీ కలిపి తరువాత నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా చేసుకుని పెట్టుకోవాలి. స్టఫింగ్‌కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోధుమపిండిని తీసుకుని పూరీలా వత్తుకుని మధ్యలో ఈ మిశ్రమం ఒకటిన్నర చెంచా ఉంచి... అంచుల్ని మూసి మళ్లీ కొద్దిగా వత్తి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మిగిలిన పిండినీ ఇలాగే చేసుకోవాలి. వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయివి.


బఠాణి పూరీ

కావలసినవి
మైదాపిండి: రెండు కప్పులు, బేకింగ్‌పౌడర్‌: పావుచెంచా, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: అరటేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
స్టఫింగ్‌కోసం:ఉడికించి కచ్చాపచ్చాగా మిక్సీపట్టిన పచ్చిబఠాణి ముద్ద: అరకప్పు, నెయ్యి: చెంచా, జీలకర్ర: అరచెంచా, పచ్చిమిర్చి తరుగు: చెంచా, నిమ్మరసం: అరచెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం
మైదాపిండిలో బేకింగ్‌పౌడర్‌, పెరుగు, నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి ఓసారి కలపాలి. ఆ తరువాత నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తరువాత బఠాణీల ముద్ద, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కూరలా అయ్యాక దింపేయాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని మైదా ఉండను తీసుకుని పూరీలా వత్తి... మధ్యలో చెంచా బఠాణీల కూరను ఉంచి అంచుల్ని జాగ్రత్తగా మూసి మళ్లీ కొద్దిగా వత్తాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకుని... రెండుచొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


షాహీ స్టఫ్డ్‌ పూరీ

కావలసినవి
మెంతికూర: కప్పు, గోధుమపిండి: ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌: పావుచెంచా, పెరుగు: టేబుల్‌స్పూను, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
స్టఫింగ్‌కోసం: పనీర్‌ తురుము: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం
మెంతి ఆకులపైన కొద్దిగా ఉప్పు చల్లి పక్కన పెట్టాలి. పావుగంటయ్యాక ఆకుల్ని గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో గోధుమపిండి, బేకింగ్‌పౌడర్‌, పెరుగు, కరిగించిన నెయ్యి, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలిపి నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా చేసుకోవాలి. అదేవిధంగా స్టఫింగ్‌కోసం పెట్టుకున్న పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోధుమపిండిని తీసుకుని పూరీలా వత్తుకుని దాని మధ్యలో చెంచా పనీర్‌ మిశ్రమాన్ని ఉంచి... అంచుల్ని జాగ్రత్తగా మూసి మళ్లీ వత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుని కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. 


ఆలూ పూరీ

కావలసినవి
ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, గోధుమపిండి: కప్పు, ఇంగువ: పావుచెంచా, సోంపు: పావుచెంచా, దనియాలపొడి: పావుచెంచా, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, జీలకర్ర: పావుచెంచా, నువ్వులు: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత, కొత్తిమీర : టేబుల్‌స్పూను.

తయారీ విధానం
గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి తరువాత నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా చేసి మూతపెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి... ఉడికించిన బంగాళాదుంప తురుముతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇది కూరలా అయ్యాక దింపేయాలి. గోధుమపిండి ఉండను కొద్దిగా తీసుకుని పూరీలా వత్తి... మధ్యలో ఈ మిశ్రమాన్ని ఉంచి... అంచుల్ని మూసి మళ్లీ కాస్త పల్చగా వత్తుకుని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పూరీలను చేసుకుని రైతాతో కలిపి తింటే చాలా బాగుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని