దినుసును.. మనసును కలిపి వండేయండి!

బియ్యం- పావుకప్పు, కొర్రలు- పావుకప్పు, పెసరపప్పు- అరకప్పు, క్యారెట్‌- ఒకటి, ఫ్రెంచ్‌ బీన్స్‌ - ఎనిమిది, బంగాళాదుంప- ఒకటి, బిర్యానీ ఆకు- ఒకటి, చిన్న ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, టమాటా- ఒకటి, పచ్చిబఠానీ- మూడు స్పూన్లు, నెయ్యి- రెండు స్పూన్లు, జీలకర్ర- అరస్పూన్‌, పసుపు- కొద్దిగా, అల్లం- చిన్న ముక్క, ఇంగువ- కొద్దిగా, ఉప్పు- తగినంత.

Published : 05 Apr 2020 01:26 IST

రోగ నిరోధక శక్తికి హామీ ఇస్తాయవి

పిల్లలందరూ ఇంట్లో ఉంటే అమ్మకెంత ఆనందమో!


కష్టమైనా అడిగినవన్నీ ఇష్టంగా చేసేస్తుంటుంది


మీరు వండే పదార్థాలు రుచిగా ఉంటే సరిపోదు


అందులో పోషకాలతో నిండుగా ఉండేలా చూసుకోండి


వైరస్‌లను తట్టుకునేలా రోగనిరోధకశక్తిని పెంచేవై ఉండాలి


లాక్‌డౌన్‌ కాలంలో పిల్లల్ని ఇంట్లోనే కట్టిపడేసేలా మెనూ సిద్ధం చేసేయండి


ఈ వెరైటీలూ అలాంటివే.. రోజుకోటి ట్రై చేయండి మరి


సూపర్‌ కిచిడీ

కావాల్సినవి: బియ్యం- పావుకప్పు, కొర్రలు- పావుకప్పు, పెసరపప్పు- అరకప్పు, క్యారెట్‌- ఒకటి, ఫ్రెంచ్‌ బీన్స్‌ - ఎనిమిది, బంగాళాదుంప- ఒకటి, బిర్యానీ ఆకు- ఒకటి, చిన్న ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, టమాటా- ఒకటి, పచ్చిబఠానీ- మూడు స్పూన్లు, నెయ్యి- రెండు స్పూన్లు, జీలకర్ర- అరస్పూన్‌, పసుపు- కొద్దిగా, అల్లం- చిన్న ముక్క, ఇంగువ- కొద్దిగా, ఉప్పు- తగినంత.  
తయారీ: క్యారెట్‌, బంగాళాదుంప, ఫ్రెంచ్‌బీన్స్‌, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత అల్లం ముక్కలు వేసి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇంగువ ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. చివరిగా బంగాళాదుంప, టమాటా ముక్కలు, బీన్స్‌, పసుపు వేసి వేయించి నీళ్లు పోయాలి. ఒకటికి మూడు వంతుల చొప్పున నీళ్లు పోయాలి. నీళ్లు పొంగు వచ్చిన తర్వాత ఉప్పు వేసుకుని బియ్యం, పెసరపప్పు, కొర్రలు వేసి ఉడికించుకోవాలి. చివరిలో నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి.
ఉపయోగాలు: ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ఆరోగ్యకరమైంది. ప్రొటీన్లు బాగా ఉంటాయి. దీంట్లో పెసరపప్పు, కొర్రలు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్ల మూలంగా బరువు పెరిగే అవకాశముంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే కిచిడీ మంచిది. అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. పాలకూర, మెంతికూర, కొత్తిమీర.. అన్నీ వేసుకోవచ్చు. అన్నం, పప్పు, కూర .. అన్నీ చేసుకునే బదులు కిచిడీ వండుకోవచ్చు. ఇల్లాలికి పని భారం తగ్గించడానికి కిచిడీని ఎంచుకోవచ్చు. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు ఉన్నాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ సెప్టిక్‌ కూడా. నెయ్యి పిల్లలు, పెద్దలకు శక్తిని అందిస్తుంది. కిచిడీ పని భారాన్ని తగ్గించడమే కాదు ఎక్కువ శక్తినీ అందిస్తుంది.


పిల్లల కోసం పల్లీ లడ్డు..

కావాల్సినవి: పల్లీలు- కప్పు, నువ్వులు- అరకప్పు, బెల్లం పొడి- ముప్పావు కప్పు, యాలకులపొడి- కొద్దిగా.
తయారీ: పల్లీలను నూనె లేకుండా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. నువ్వులను కూడా అలాగే చేయాలి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, బెల్లంపొడి, యాలకుల పొడి వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. పల్లీలు, నువ్వుల్లో ఉండే నూనె మూలంగా ఈ మిశ్రమం పొడిపొడిగా కాకుండా దగ్గరగా వస్తుంది. కాబట్టి సులభంగా లడ్డూలను చుట్టుకోవచ్చు.
ఉపయోగాలు: పల్లీల్లో ప్రోటీన్లు, ఫైబర్‌, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. నువ్వుల్లో జింక్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెలీనియం, కాపర్‌, ఐరన్‌, విటమిన్‌-సి తోపాటు క్యాల్షియం కూడా చాలా ఎక్కువ. ఇది ఎముకల బలానికి, శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, చిప్స్‌ ఇవ్వకుండా వీటిని ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతారు. బయట దొరికే ఆహార పదార్థాల్లో ఉండే అధిక చక్కెరల వల్ల ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. పైగా ఏకాగ్రత కూడా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ లడ్డూ తయారీకి తక్కువ సమయం పడుతుంది. శక్తి మాత్రం ఎక్కువగా అందుతుంది. నువ్వులు, పల్లీలు రెండూ కలిపి ఉండలు చేయొచ్చు. లేదా వేర్వేరుగా తయారుచేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ సెలవుల్లో పిల్లలతో కూడా ఈ లడ్డూలను తయారుచేయించవచ్చు.


యాంటీ యాంగ్జైటీ గ్రీన్‌ స్మూతీ

కావాల్సినవి: గ్రీన్‌ యాపిల్‌ - ఒకటి, పాలకూర - కట్ట, కొత్తిమీర - కట్ట, కీర - సగం, నిమ్మకాయ- ఒకటి, చిన్న అల్లం ముక్క- ఒకటి.  
తయారీ: అల్లం, కొత్తిమీర, పాలకూరను శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. గ్రీన్‌ యాపిల్‌ను చిన్న ముక్కలుగా కోసుకుని అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకుని ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగొచ్చు.
ఉపయోగాలు: ఆందోళను సమర్థంగా ఆహారంతో ఎదుర్కోవాలి అంటే ఈ గ్రీన్‌ స్మూతీ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పాలకూరను ‘సూపర్‌ ఫుడ్‌’ అంటారు. దీంట్లో కేలరీలు తక్కువ. చర్మం, జుట్టు, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. పాలకూరకున్న మరో ప్రత్యేకత మెగ్నీషియం. ఇది ఆత్రుత, ఒత్తిడి, ఆందోళన పెరగకుండా చేస్తుంది. పిల్లలకు దీన్ని రోజూ ఇవ్వడం వల్ల హైపర్‌ యాక్టివిటీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఈ స్మూతీలో వాడిన గ్రీన్‌ యాపిల్‌ అల్లం, కీరా, కొత్తిమీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.


గుమ్మడి సూప్‌...

కావాల్సినవి: ఎర్ర గుమ్మడికాయ- 200 గ్రా, క్యారట్‌- 100 గ్రా, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- రెండు, అల్లం- అంగుళం, ఉప్పు- కొద్దిగా, పాలు లేదా కొబ్బరి పాలు- కప్పు, మిరియాలు- కొన్ని.
తయారీ: ఉల్లిపాయను చిన్న మొక్కలుగా తరుక్కోవాలి. గుమ్మడికాయ, క్యారట్‌ల తొక్కు తీసుకుని ముక్కలు కోసుకోవాలి. వీటిని కుక్కర్‌లో వేసుకుని, దీంట్లోనే అల్లం, వెల్లుల్లి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత చల్లార్చి మిక్సీలో వేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉంటే కొంచెం నీళ్లు కూడా కలపొచ్చు. రుచికి అనుగుణంగా ఉప్పు, మిరియాలు వేసుకోవాలి. చివరిగా కప్పు పాలు లేదా కొబ్బరిపాలు కలుపుకోవచ్చు.
ఉపయోగాలు: వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జలుబును తగ్గిస్తుంది. గుమ్మడికాయలో ఉండే విటమిన్‌ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. చర్మ, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు అవసరమైనంత విటమని సి కూడా ఉంటుంది. గుమ్మడి, క్యారెట్‌లో బీటాకెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉండాలంటే వారంలో మూడు నుంచి నాలుగుసార్లు తీసుకోవచ్చు. గుమ్మడికాయ సూప్‌ను చిన్నా, పెద్దా అందరూ తాగొచ్చు. ఇంట్లోనే ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచిది. మధమేహం ఉన్నవాళ్లు పాలను కలపకుండా తీసుకోవాలి.  దీంట్లోని అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. వెల్లుల్లి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. అల్లం, వెల్లుల్లి, మిరియాలు శ్వాస సంబంధ ఇబ్బందుల నుంచి కాపాడతాయి. దీన్ని వేడి వేడిగా తాగితే మంచిది.

శ్రీదేవి
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని